33.2 C
Hyderabad
May 4, 2024 02: 18 AM
Slider సంపాదకీయం

కమలం వైఖరిపై అంతులేని ప్రశ్నలు

#purandaresvari

నోటితో నవ్వుతూ …. నొసటితో వెక్కిరిస్తున్న చందంగా బీజేపీ వ్యవహరిస్తున్నదనే విమర్శలు ఎక్కువయ్యాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలు రాష్ట్రంలోని వైసీపీ నేతలో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం వైసీపీ పాలనపై తరచూ ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఏపీ బీజేపీ జగన్ సర్కార్ పై మరో పోరాటానికి సిద్ధమైంది. మద్యం అక్రమాలను వెలుగు తీసే పనిలో పడింది. మద్యంతో జగన్ సర్కార్ భారీగా సంపాదిస్తోందని.. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. మద్యం ద్వారా వేలకోట్ల రూపాయల కప్పం తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మున్ముందు బిజెపి జగన్ మద్యం అవినీతి పై దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని ప్రకటించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రైవేటు మద్యం విక్రయాలను రద్దు చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపేలా కొత్త మద్యం పాలసీని ప్రకటించారు. మద్యం ధరలను సైతం అమాంతం పెంచారు. మద్యం తాగేవారికి షాక్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటిలో చెప్పారు.

అయితే గతంలో వినిపించని, కనిపించని బ్రాండ్లను సైతం అమ్మకాలు ప్రారంభించారు. దీంతో అస్మదీయ కంపెనీల నుంచి కమీషన్ ఆశించి జగన్ నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. కానీ ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వం ఆ రకం మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. వైసీపీ సర్కార్ ఆగడాలపై బీజేపీ ఫోకస్ పెట్టిందట. అందులో భాగంగానే మద్యం అవినీతిని బయటపెడుతోందని అంటున్నారు.

2019లో టిడిపి అధికారం కోల్పోయినప్పుడు ఏపీ మద్యం ఆదాయం 19 వేల కోట్లు. ప్రస్తుతం నెలకు సగటున 32 వేల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం అంత స్థాయిలో ఆదాయం చూపట్లేదు. సరిగ్గా ఈ పాయింట్ నే తీసుకొని ఇప్పుడు బిజెపి సర్కార్ పై పోరాటం ప్రారంభించింది. నెలకు 20 వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయం పక్కదారి పడుతున్నట్లు తాజాగా పురందేశ్వరి ఆరోపించారు.

వాటికి లెక్కలతో సహా గణాంకాలు చూపించి మరీ విమర్శలు చేశారు. జగన్ సర్కార్ కు ఇంతలా ఆదాయం వస్తుందా అన్న రీతిలో ఆమె చెప్పారు. దీంతో మున్ముందు భారతీయ జనతా పార్టీ మద్యం అవకతవకలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.

కేంద్ర బీజేపీ పెద్దలు చంద్రబాబు అరెస్టుపై నోరు మెదపలేదు కానీ ఏపీ బీజేపీ మాత్రం చంద్రబాబు అరెస్ట్ ను తప్పు పట్టింది. బిజెపి మిత్రుడైన పవన్ నేరుగా టిడిపితో పొత్తును ప్రకటించారు. బిజెపి సైతం తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వైసీపీ సర్కార్ మద్యం అవినీతిని బిజెపి బయట పెట్టడం విశేషం. దీనిపై ఏపీ బీజేపీ కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

ఒకవేళ గాని బిజెపి సీరియస్ గా తీసుకుంటే జగన్ సర్కార్ బోను ఎక్కడం ఖాయం. అయితే కేంద్ర పెద్దలు దీనిని పట్టించుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related posts

హఫీజ్ పేటలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

Satyam NEWS

హాలివుడ్ కు చేరిన టీ20 ప్రపంచకప్ వేడి

Satyam NEWS

స్థానిక ఎన్నికల తర్వాత అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS

Leave a Comment