ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప గొప్ప నీతులు చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే పాత విషయాలు మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. అప్పటి అధికార పక్షాన్ని పలు విషయాలపై నిలదీసిన జగన్ పై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తే … ఆయన పదవిలో కూర్చోగానే కక్ష సాధింపు మొదలు పెట్టి నాలుగున్నర ఏళ్లు అయినా ఇంకా అదే పనిలో ఉన్నారు.
తాజాగా కృష్ణా జలాలపై కూడా తెలంగాణ తో పోరాటం చేయలేక చేతులు ఎత్తేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది తనకు ఎంతో సన్నిహితుడైన ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఏపి ప్రయోజనాలను సైతం తుంగలో తొక్కారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కృష్ణా ట్రైబ్యునల్ కొట్టివేసింది. 90 టీఎంసీల నీటిని వాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలని ఏపీ ఇంటర్ లొకేటరీ వేసిన అప్లికేషన్ పై విచారణ అధికారం తమకు లేదని కృష్ణా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.
2022 ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇచ్చిన జీవో 246 పై స్టే ఇవ్వాలని ఏపీ సర్కారు పిటిషన్ వేసింది. దీనిపై కృష్ణా ట్రైబ్యునల్ లో జులై 14వ తేదీ వరకు వాదనలు జరిగాయి. ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది ఉత్తర్వులు వెల్లడించింది. ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ పై విచారణ అధికారం ట్రైబ్యునల్ కు లేదని.. తగిన వేదికలను ఆశ్రయించాలని తుది ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తి పోసుకోవడానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేకుండా పోయింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కర్నూల్ లో జగన్ రెడ్డి జలదీక్ష చేశారు. రాయలసీమ రైతులు అన్యాయమైపోతారని ముసలి కన్నీళ్లు కార్చారు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చుని వికటాట్టహాసం చేస్తున్నారు. కానీ రైతుల బాధలు పట్టడం లేదు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల వరకు కృష్ణా జలాలు ఎత్తి పోసుకోవాలనుకుంటున్నారు. ట్రైబ్యునల్ తీర్పు ద్వారా సబ్ జ్యూడిస్ అడ్డంకి తొలగిపోయిందని తెలంగాణ అంటోంది.
ప్రస్తుతానికి శ్రీశైలంప్రాజెక్టులో అతి కొద్దిగా నీటి నిల్వలే ఉన్నాయి. వాటిని తెలంగాణ కరెంట్ కు.. ఎత్తి పోసుకోవడానికి వాడుకుంటోంది. సీమ రైతులకు ఈ ఏడాది కరువు ఖాయంగా కనిపిస్తోంది. కానీ జగన్ రెడ్డి సర్కార్‌కు చీమ కుట్టినట్లుగా కూడా లేదు.