25.2 C
Hyderabad
May 8, 2024 09: 42 AM
Slider ప్రత్యేకం

తుమ్మల ప్రయాణంపై ఉత్కంఠ

#Minister Tummala Nageswara Rao

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రయాణంపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. అధికార బీఆర్ఎస్‌లో ఉన్న ఆయనకు పార్టీ టికెట్ దక్కకపోవడం రాజకీయ వర్గాల్లోనే హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో దాదాపు 40 స్థానాలలో ప్రభావం చూపగలిగినా తనను చిన్నచూపు చూస్తున్నారనే భావనలో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ అవకాశం కల్పించే పరిస్థితి లేకపోవడంతో, ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు.

ఎమ్మెల్యే జాబితాలో తన పేరు లేకపోవడంపై తుమ్మల కూడా అసంతృప్తిగా ఉన్నారు. గురువారం వరకు హైదరాబాద్‌లోనే ఉన్న తుమ్మల… శుక్రవారం ఖమ్మంకు వచ్చారు. హైదరాబాద్‌లో తన నివాసం నుంచి బయటకు వచ్చిన తుమ్మల… తన అనుచరులను చూస్తూనే భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో పార్టీ టికెట్‌ రాకపోవడం…

ఆయన్ను తీవ్రంగా కలచివేసిందన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నుంచి ఖమ్మంకు అనుచరులతో కలిసి పెద్దఎత్తున కార్లలో ర్యాలీగా వెళ్లారు తుమ్మల. ఆయనకు నాయకన్ గూడెం వద్ద అనుచరులు భారీగా స్వాగతం పలికారు.

భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్‌ టికెట్ రాకపోవడంతో పార్టీ మారాలని అనుచురులు ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు. పైగా తుమ్మల ర్యాలీలో కాంగ్రెస్‌ జెండాలు కనిపించడంతో… ఆయన ఆ పార్టీలోకి మారుతారా? అనే చర్చ జోరందుకుంది.

తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రశ్రేణి నేతల్లో ఆయన ప్రుముఖంగా కనిపిస్తారు. నోటీ దురుసు అన్న ఒక అపవాదు తప్ప… ఆపదలో ఉన్న సామాన్య కార్యకర్త నుంచి సీనియర్‌ నేత ఎవరైనా సరే… వారికి తుమ్మల తోడుగా ఉంటారు. అందుకే తుమ్మల అంటే కార్యకర్తలకు ఒక భరోసా.

1985,1994,1999, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి, 2016లో టీఆర్‌ఎస్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2015లో మండలికి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

అనంతరం ఆయనకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్‌అండ్‌బీ, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తుమ్మల నాగేశ్వరరావు 1985 నుంచి 1988 వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా, 1994 నుంచి 1999 వరకు ఎన్టీఆర్, చంద్రబాబుల మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల, ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖల మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ మంత్రివర్గంలో 2015 నుంచి 2018 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రోడ్డు, భవనాలు శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలలో ఎంతోమందికి ఎమ్మెల్యే టికెట్లు దగ్గరుండి ఇప్పించిన తుమ్మలకు… ఇప్పుడు బీఆర్ఎస్‌లో బీఫామ్‌ లేదనే పరిస్థితి రావడంపై జోరుగా చర్చ జరుగుతోంది.

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు తుమ్మల నాగేశ్వరరావు. 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మహాకూటమి ప్రయోగం వైఫల్యం చెందినా… ఒక ఖమ్మం జిల్లాల్లో మాత్రం వర్కవుట్‌ అయింది. దీంతో ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే స్థానాన్ని మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. దీనికితోడు ఒకప్పుడు తాను పెంచి పోషించిన సాధారణ కాంట్రాక్టర్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ఉన్న వార్‌… బీఆర్‌ఎస్‌ను పరోక్షంగా, ప్రత్యక్షంగా దెబ్బతీసింది.

మహాకూటమి ఒక ఖమ్మంలోనే వర్కవుట్‌ కావడమే కాకుండా ఇటు కాంగ్రెస్‌, అటు తెలుగు దేశం కూడా స్థానాలను గెలుచుకుంది. 2018లో ఆంధ్ర ప్రభావం ఉన్న ఖమ్మం జిల్లాలో ఓట్ల బదిలీ జరిగింది. ఆరు చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేస్తే 6 చోట్ల గెలిచింది. టీడీపీకి మూడు ఇస్తే… సత్తుపల్లి, అశ్వరావుపేట ఖమ్మంలో రెండు గెలిచింది. భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, పాలేరు, మదిర కాంగ్రెస్‌ విజయం సాధించడానికి కారణం… పొంగులేటి, తుమ్మల మధ్య వర్గపోరే అని ఇప్పటికీ అంటుంటారు.

ఇక, కేసీఆర్‌తో విభేదిస్తూ వచ్చిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి… ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేట్‌ టచ్‌ చేయనివ్వనని తొడ కొట్టి చెప్పారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తుమ్మలను బీఆర్‌ఎస్‌ వదులుకుంటే… ఇక ఖమ్మం జిల్లాపై గులాబీ పార్టీ ఆశలు వదులుకోవాల్సిందే. పొంగులేటి, తుమ్మల విభేదాలను పక్కకు పెట్టి బరిలోకి దిగితే వార్‌ వన్‌ సైడ్‌ కావడం ఖాయమే.

తుమ్మల సత్తుపల్లి నుంచి 3 సార్లు గెలిచాడు. ఆయన వర్గం, ఆయన అనుచరులు ఇంకా ఉన్నారు. తొలుత బీఆర్‌ఎస్‌ ఆశలు వదులుకోవాల్సిన సీటు సత్తుపల్లిదే. తుమ్మల సొంత గ్రామం అశ్వరావుపేటపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామం. దీంతో అశ్వరావుపేట ఇంఫాక్ట్‌ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తుమ్మల పొంగులేటి ఇద్దరు కలిసి పనిచేస్తే ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు భారీ నష్టం వాటిల్లుతుందన్న చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి… తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఎదిగారు. ఆయన చిన్నాన్న కొడుకు సుధాకర్‌రెడ్డిని తొక్కడం కోసం పొంగులేటిని ఎంక్రేజ్‌ చేశారు తుమ్మల. దీంతో కాంట్రాక్టర్‌ నుంచి రాజకీయ నేత అయ్యారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఇప్పుడు తుమ్మల ఒరలో పొంగులేటి కత్తిగా మారితే… బీఆర్‌ఎస్‌కు భారీ నష్టం జరగడం యమంటున్నారు విశ్లేషకులు. సత్తుపల్లి, పాలేరు, అశ్వరావుపేట నియోజకవర్గాలపై తుమ్మల మార్క్‌ ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల పార్టీ మారితే కొత్త జోష్‌ తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తుమ్మలకు నోటీ దురుసు ఉన్నట్లు అందరూ అంగీకరిస్తారు… చివరకు తుమ్మల కూడా. ఖమ్మం జిల్లా ఎల్లలు తెలిసిన వ్యక్తి తుమ్మల. భద్రాచలం కరకట్ట, అభివృద్ది ఆయన చలవే. మొన్న గోదావరి వరదలతో ముప్పు నుంచి భద్రాచలం తప్పించుకుందంటే తుమ్మల వల్లే అని అందరికీ తెలుసు. చంద్రబాబు సీఎం ఉన్న క్రమంలో భ్రదాచలంలో కరకట్ట నిర్మాణం కోసం శ్రమించింది తుమ్మలనే. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన తుమ్మలపై అవినీతి మచ్చలేదు.

కుటుంబ సభ్యులు వివాదంలో లేరు. తాలిపేరు నుంచి లెప్ట్‌ కెనాల్‌ ద్వారా దమ్ముగూడెంకు నీరు, సీతారామ ప్రాజెక్ట్‌ వర్కవుట్‌ అయిందంటే ఈయన చలువే. 8 నియోజకవర్గాలకు సాగునీరు అందించిన ఘనత తుమ్మలది. ఫస్ట్‌ ప్రియారిటి పాలేరుకు సాగునీరు అందించే మహాకార్యానికి ఆయన తోడ్పాటు అందించారు. లంకసాగర్‌ అభివృద్దిపై తుమ్మల మార్క్‌ ఉంటుంది. వ్యక్తిగతంగా వచ్చే వారికి పనులు, పైరవీలకు దూరంగా ఉండే తుమ్మల… ఒక గ్రామానికి లేదా సమూహానికి మంచి జరుగుతుందంటే ముందుంటారని ఆయన్ను గుర్తెరిగిన ప్రతి ఒక్కరికీ తెలుసు.

Related posts

జామా మసీదులో మహిళల ప్రవేశానికి ఓకే

Satyam NEWS

అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం

Bhavani

గ్రాఫిక్స్ తో మైమరపించే మంచు లక్ష్మి”ఆదిపర్వం”

Satyam NEWS

Leave a Comment