41.2 C
Hyderabad
May 4, 2024 16: 29 PM
Slider మెదక్

పిల్లలకు చదువుతో పాటు గేమ్స్ తప్పకుండా అవసరం

#siddipet

పిల్లలకు చదువుతోపాటు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ తప్పకుండా అవసరమని సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు డప్పులు కొడుతూ చప్పట్లతో అందరూ కలిసి కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు.

గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ స్వయంగా తను చదివిన పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్రంథాలయం, బాలికల రెస్ట్ రూమ్ లను ఏర్పాటు చేయడం, వాటిని ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేస్తూ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ రూమ్ ప్రారంభించాక అందులో ఏర్పాటు చేసిన చెస్, క్యారం ఆటలను స్థానిక ప్రజాప్రతినిధులతో ఆడారు. గ్రంథాలయం ప్రారంభించాక అందులో ఉన్న బుక్స్ ను ఆసక్తిగా తిలకించారు.

విద్యార్థిని పిలిచి బుక్ తీసి అందులో ఉన్న సారాంశం తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రంథాలయంలో పిల్లలకు బాగా ఉపయోగపడే పంచతంత్ర కథలు, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామలింగ కథలతో కూడా పుస్తకాలను ఎక్కువగా ఉంచాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. తర్వాత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫిజిక్స్ ల్యాబ్ ను తిలకించారు. పిల్లలు స్వయంగా తయారుచేసిన చిన్న పిల్లలు ఏడిస్తే ఆటోమేటిగ్గా ఊగే ఉయ్యాల, పవన విద్యుత్ పరికరాన్ని, సోలార్ విద్యుత్ గూర్చి గొడుగు ప్రత్యేకత గురించి పిల్లలు కలెక్టర్ కు తెలియజేశారు.

వీటిని ఫిజిక్స్ ఉపాధ్యాయులు హఫీజ్ సూచనల మేరకు తయారు చేశామని తెలిపారు. తర్వాత బాలికల రెస్టు రూమ్ ప్రారంభించారు. రూమ్ లో గొడలపై అతికించిన కొటేషన్లను పిల్లలు పిలిచి వాటిని చదివి దాని అర్థం ఏంటో చెప్పమని తెలిపారు. పిల్లలు చక్కగా వివరిస్తూ కలెక్టర్ కు తెలపడం జరిగింది. పిల్లల్ని అభినందించారు. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పూలు వేసి నివాళులర్పించడం అక్కడే సభను ఏర్పాటు చేయడం జరిగింది.

కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలను ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయుడుని, తోడ్పాటు అందించిన మాదాసు శ్రీనివాస్  అభినందించారు. బహుశా బాలికల రెస్ట్ రూమ్ అనేది దేశంలోనే ఎక్కడా లేనిది అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్పిన ప్రతి విషయం చాలా విలువైనది వీరందరూ జీవిత అనుభవం దృష్ట చెప్పిన విషయాలు కావున తప్పకుండా ఆచరించాలి.

తల్లిదండ్రులు మీకు కావాల్సిన పుస్తకాలు, బట్టలు ఇతరత్రా సామాన్లు మాత్రమే ఇవ్వగలరు చదవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితం లో సక్సెస్ రావాలంటే శ్రద్ధతో ఏకగ్రతతో చదవడం చాలా ముఖ్యం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం కథ స్ఫూర్తితో అతను వైస్ ఛాన్స్లర్ హోదాలో పనిచేశారు వ్యక్తిగత సామాజిక పోరాటాలు చేసిన మహనీయులు, దీంతోపాటు ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో తోడ్పాటు అందించాడు ఆయన వ్యక్తిగత పోరాటం తో పాటు సామాజిక పోరాటం వలన తెలంగాణ ఉద్యమంలో  ముఖ్య భూమిక వహించారు.

విద్యార్థులు కూడా ఏదో మొక్కుబడిగా చదవకుండా మీకు నచ్చిన రంగంలో ఏదైనా మార్కుల కోసం కాకుండా మంచి స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించెలా చదవాలని తెలిపారు. మన సిద్దిపేట్  జిల్లాకు ఉన్న అడ్వాంటేజ్ ఇక్కడ కొన్ని రోజుల్లో పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వర్గల్, బండ మైలారం ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పుతున్నారు.

మీరుఅత్యున్నత రీతిలో చదవగలిగితే అందులో ఉద్యోగాలు మీకె లభిస్తాయి. మీరు నామ మాత్రంగా చదివితే ఇక్కడ ఉద్యోగాలు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్యడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని చదవాలన్నారు. కొంతమంది చదువుకొని ఏం చేస్తావ్ నేనేం చేస్తున్నా  అని చెప్తుంటారు అలాంటివి అస్సలు నమ్మొద్దు.

మన రాష్ట్రం ప్రవేట్ స్కూల్ తో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా అభివృద్ధి చెందాలని మన ఊరు-మనబడి అనే మంచి స్కీం పెట్టింది దీని ద్వారా ఒక సంవత్సర కాలంలో పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు గాని ఇతరత్రా ఎలాంటి సమస్యలు లేకుండా తీరుతాయి.

మీరు చాలా అదృష్టవంతులు పాఠశాల చదువు పూర్తి కాగానే మీ చుట్టూనే గజ్వేల్ లో ఎడ్యుకేషన్ హబ్, ఆర్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్ ఇలా అనేక యూనివర్సిటీలు మీ చుట్టుపక్కల ఉన్నాయి వీటిని మనం సద్వినియోగం చేసుకొవాలి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలోని భయాలను ఉపాధ్యాయులు విద్యార్థులు నుండి తీసేయాలని తెలిపారు.

ఎఫ్డిసి చైర్మన్ వంటెరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ సార్ మలి దశ ఉద్యమంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండదండగా ఉండేవాడని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు ఉండెలా పని చేపిస్తున్నారు అని అభినందించారు. విద్యార్థి దశ చాలా ముఖ్యమైనది.మన మేధస్సును ఎప్పుడు పదును పెట్టాలి సమయం దొరికినప్పుడల్లా లైబ్రరీకి వెళ్లాలి. మన ముఖ్యమంత్రి కేజీ టు పీజీ వరకు చదివి మన ప్రాంతంలోని మంచి ఉద్యోగాలు సాధించాలనెదే ప్రధాన ఉద్దేశం అని తెలపడం జరిగింది.

ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి మాట్లాడుతూ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సాధనలో నీడగా ఒక సలహాదారులుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మార్గనిర్దేశనం చేశారు. మీ తల్లిదండ్రులు చాలామంది నిరక్షరాస్యులు వాళ్లు మిమ్మల్ని బడికి మాత్రమే పంపించగలరు.చదవడం మీ వంతు సమయం వృధా చేయొద్దు మొక్కుబడిగా కాకుండా పోటీ తత్వంతో చదవాలి కష్టపడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ  లక్ష్యాన్ని నెరవేర్చాలి. ప్రతి గ్రామీణ ప్రాంత స్కూలు బాగుపడాలనే ఉద్దేశంతోనే మంచి స్కీం మన ఊరు- మనబడి. ఇక్కడున్న పిల్లలు మల్లెపూలాంటి వాళ్ళని వాళ్లకు దిశ దశ చూపించే బాధ్యత తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఉపాధ్యాయుల పైన ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరీముద్దీన్, గజ్వేల్ ఎంఈఓ సునీత, గడాధికారి ముత్యం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పిటిసి పంగ మల్లేశం, ఎంపీపీ అమరావతి, గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, ఎంపిటిసి ఆకుల ఆనందం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

సంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సెల్స్ కు మంచి ఆదరణ

Bhavani

సూర్యాపేట జిల్లాలో సదరన్ క్యాంపులు నిర్వహించాలి

Satyam NEWS

G20 దేశాలకు నాయకత్వం వహించేందుకు భారత్ రెడీ

Satyam NEWS

Leave a Comment