Slider ప్రత్యేకం

కరోనా లెసన్స్: ప్రభుత్వ వైద్యో నారాయణో హరి:

Gandhi Hospital

కరోనా లాక్ డౌన్ పరిస్థితులు మనకు అనేక కొత్త విషయాలు నేర్పుతున్నాయి. జీవితంలోని కొత్త కోణాలు తెలియజేస్తున్నాయి. అనేక భవిష్య మార్గదర్శకాలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది అంటే ప్రజలకు చిన్నచూపు పెరిగిపోయిన  కాలంలో, కరోనా నేపథ్యంలో వారందిస్తున్న సేవలు, వారు పడుతున్న కష్టాలు, చేస్తున్న త్యాగాలు, వారిలోని ప్రతిభ లోకానికి బాగా తెలుస్తున్నది.

ముఖ్యంగా, మన దేశంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో  ఉన్నవారి ప్రతిభ ఎవ్వరికంటే తక్కువ కాదు. దురదృష్టవశాత్తు  రెడ్ టేపిజం, అవినీతి, అసౌకర్యాలు, నాణ్యతలేమి, సేవా రాహిత్యం ఇక్కడే పెనవేసుకు పొయ్యాయనే అభిప్రాయాలు సమాజంలో పెరిగిపోయాయి. ఈ కారణాల ప్రభావంతో వైద్యం, విద్య వంటి అతి ముఖ్యమైన రంగాలు ప్రైవేటుమయమై పోయాయి.

డబ్బు జబ్బు పెరిగింది.  ప్రభుత్వ ఆస్పత్రుల తీరుతెన్నులపై, ఎప్పుడో 40 ఏళ్ళ క్రితమే ” నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ” అనే పాట వచ్చింది. ఆ పాట అప్పుడు జనం నాలుకలపై నాట్యం చేసింది. ఇప్పటికీ జనంలో అదే అభిప్రాయం ఉంది. ఈరోజు కరోనా నేపథ్యంలో సేవలు అందిస్తున్నవారు 90-95 శాతం ప్రభుత్వ వైద్య సిబ్బంది మాత్రమే.

నిన్నటి వరకూ  ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతూ ఉండేవి. నేడు అవన్నీ దాదాపు ఖాళీ అయిపోయాయి. టెస్టులు, ఉరుకులు,  పరుగులు ఎక్కడా కనిపించడం లేదు. జబ్బులు తగ్గిపోతున్నాయా? అనే అనుమానాలు వస్తున్నాయి.

నేడు, మరణాల రేటు కూడా తగ్గిపోయిందంటున్నారు. ఇప్పటిదాకా మనకు కనిపించిన దృశ్యాలు మరి ఏంటి? ఇంతకాలం సాగిన ఈ ఖరీదైన వ్యవహారాల తాలూకూ అసలు రంగులు బయటపడుతున్నాయని అనుకోవాలా, అనే ఆలోచనల లోకి సమాజం మెల్లగా వెళ్తోంది.

నాణెంలో ఇంకోవైపు చూస్తే,  ప్రభుత్వ సిబ్బంది అందిస్తున్న సేవలు చూసి వారిపట్ల  సమాజంలో గౌరవభావం మెల్లగా  పెరగడం ప్రారంభమైంది. ఒకప్పుడు విశాఖపట్నంలోని కింగ్ జార్జి హాస్పిటల్, గుంటూరులోని జనరల్ హాస్పిటల్, కర్నూలు జనరల్ ఆసుపత్రి మొదలైన ప్రభుత్వ ఆస్పత్రులకు చాలా ఖ్యాతి, గౌరవాలు ఉండేవి.

వైద్యులను దైవంతో సమానంగా భావించి, గౌరవించే సంప్రదాయం సమాజంలో ఉండేది. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి ఈ భావం తగ్గుతూ వచ్చింది. ప్రయివేట్ ఆస్పత్రులు పెరుగుతూ వచ్చాయి. ప్రతిభావంతులైన వైద్యులు ప్రైవేట్ రంగంలోకి, సంపన్నదేశాల వైపు మళ్ళడంలో,  వెళ్లడంలో వేగం గణనీయంగా పెరిగింది.

గిరిజనులు, అట్టడుగు వర్గాల వారికే ప్రభుత్వ ఆస్పత్రులు కేంద్రాలుగా మారాయి. ప్రైవేట్ వైద్యరంగం సంపూర్ణంగా సమాజాన్ని తన  చేతుల్లోకి తీసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లడమంటే, స్టార్ హోటల్ కు వెళ్ళినట్లే అనే భావన వచ్చేసింది. ఆస్పత్రులలో పెట్టాల్సిన ఖర్చు సామాన్యుడి చెయ్యి దాటిపోయింది.

ఆ ఖరీదులు అందుకో లేక, ఆ ఖర్చులు భరించలేక, ఇటు ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం లేక  తీవ్ర అనారోగ్యాలతో బాధపడేవారు, మరణాలకు గురయ్యేవారు, అప్పులు సప్పులు చేసి అవస్థలుపడేవారు పెరిగిపొయ్యారు. వైద్యం సామాన్యుడికి అందాలి.

ఈ దోపిడీ పోవాలి. ప్రభుత్వ వైద్య విధానంలో గుణాత్మక మార్పులు గణనీయంగా రావాలి.  బడ్జెట్ లో 10 శాతం కేటాయింపులున్న అభివృద్ధి చెందిన దేశాలే కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. భారతదేశంలో బడ్జెట్ కేటాయింపులు ఇంకా పెరగాలి.

ప్రభుత్వ వైద్యరంగంలో వనరులు, వసతులు పెరగాలి. కరోనా వచ్చే సరికి మన ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని మౌలిక వసతుల్లో ఉన్న డొల్లతనం బయటపడింది. ఒక్కసారి కరోనా మహమ్మారి మనల్ని కమ్మేసేసరికి వైద్య పరంగా సవాళ్ళను ఎదుర్కొంటున్నాం.

కరోనా పరీక్షలు ఇంకా పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. వెంటిలేటర్లు సరిపడా ఇంకా లేవనే భావించాలి. పరిశుభ్రమైన వాతావరణం  కూడా మన వైద్యకేంద్రాలలో ఆశించిన స్థాయిలో లేదు. నిపుణులు, సిబ్బంది కొరత కూడా కనిపిస్తోంది. ముఖ్యమైన విభాగాల వైద్య  నిపుణుల  జీతభత్యాలు కూడా అంత ఆకర్షణీయంగా లేవు.

ఇంతకంటే 5రేట్లు జీతాలతో ప్రైవేట్ ఆస్పత్రి రంగాలు వీరిని ఆకర్షిస్తున్నాయి. వైద్యులకు, సిబ్బందికీ వేతనాల్లోనూ, ప్రోత్సాహకాల్లోనూ ఇంకా మెరుగుదల పెరగాలి. ప్రజాఆరోగ్యం అనే అంశంతో, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైద్య రంగమే  కీలకపాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి మహమ్మారులు వస్తాయో? ఎటువంటి జబ్బులు ప్రబలుతాయో మనం ఈరోజు చెప్పలేం.

కరోనా రణరంగంలో ప్రభుత్వ వైద్యసిబ్బంది పాత్ర బహు ప్రశంసా పాత్రం. దేశ ప్రధాని నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ రాజకీయాలకు అతీతంగా, ఐక్యభావనతో  పోరాడుతున్నారు. ప్రభుత్వవైద్య సిబ్బంది అంతే స్ఫూర్తితో సేవలు అందిస్తున్నారు.

ఇదే స్ఫూర్తి ఇలాగే కొనసాగితే, వైద్య రంగంలో ఉన్న దోపిడీ అంతమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు,  ప్రజలకు మధ్య సుహృద్భావ వాతావరణం పెరుగుతుంది. ప్రభుత్వాలకు ప్రతిష్ఠ పెరుగుతుంది. ఇన్ని కోట్లమంది జనాభా ఉన్న ఈ దేశ ప్రజలకు  కేవలం ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంతవరకు సరిపోతుంది అన్నది ఒక ప్రశ్న.

అత్యంత బలోపేతమైన, శక్తిమంతమైన, ఖరీదైన  ప్రైవేట్ వైద్య వ్యవస్థను సామాన్యుడికి అందుబాటులో తెచ్చే క్రమంలో   ప్రభుత్వాలు ఎంతవరకూ విజయం  సాధిస్తాయన్నది మరో పెద్ద ప్రశ్న. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సమతుల్యత, సమన్వయం సాధించడం చాలా ముఖ్యమైన అంశం.

కరోనా కోసం చేస్తున్న పోరు స్ఫూర్తితో  వైద్య రంగాలు ఆదర్శనీయమైన వ్యవస్థలుగా పునర్నిర్మాణం జరగాలి. ఇదే స్ఫూర్తి ఎల్లెడలా కొనసాగాలి. కరోనా అనంతరం అటు ప్రజల్లోనూ, ఇటు ప్రభుత్వాలలోనూ కొంగ్రొత్త ఆరోగ్యవంతమైన పోకడలు వస్తాయని ఆశిద్దాం.

మాశర్మ సీనియర్ జర్నలిస్టు

Related posts

డ్రగ్స్ పై పోరాటం కొనసాగిస్తాను: పట్టాభి

Satyam NEWS

కాళేశ్వరం జలాలు చూసి పులకించిపోతున్న కేసీఆర్

Satyam NEWS

ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ లో చేరుటకు ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియ

Satyam NEWS

Leave a Comment