కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపాటర్ గ్రామంలో జరిగిన అత్యాచార సంఘటన దురదృష్టకరమని బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు కె రాములు అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో బాధితురాలి భర్త కుటుంబ సభ్యులను సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నిర్మల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను జరిగిన సంఘటన గురించి వివరాలను, వారు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా ఎంత పరిహారం అందజేశారు, ఇంకా ఎంత అందజేయవలసి ఉన్నది అని తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టప్రకారం బాధిత కుటుంబానికి నెలకు కింటల్ బియ్యం చొప్పున మూడు నెలల వరకు రేషన్ బియ్యం అందజేయవలసినదిగా జిల్లా పౌరసరఫరాల అధికారి ఆదేశించారు.
దళిత బస్తీ కింద మూడు ఎకరాల భూమి, ఇంటి స్థలం, నెలకు రూ 5 వేల పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బాధితురాలి పిల్లలకు గురుకుల పాఠశాలల్లో డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందించాలని సూచించారు.