28.7 C
Hyderabad
May 6, 2024 10: 42 AM
Slider నెల్లూరు

వి.ఎస్.యూ లో ఘనంగా యువజనోత్సవాలు

#VSU

నెల్లూరు లోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో వర్శిటీ రెండవ యువజనోత్సవాలు (ఇంటర్ కాలేజీ యూత్ ఫెస్టివల్) కృష్ణచైతన్య విద్యాసంస్థల సంయుక్త సహకారంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్శిటీ ఉపకులపతి ఆచార్య జి.యం.సుందరవల్లి జెండా ఊపి వర్శిటీ ప్రాంగణంలో యువజనోత్సవ ర్యాలీని ప్రారంభించారు. వర్శిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల కేరింతల నడుమ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం వర్శిటీ సెమినార్ హాళ్ళో విశిష్ట అతిథులు నెల్లూరు రూరల్ డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ పి.రామచంద్రరెడ్డి, కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కృష్ణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం వివిధ పోటీలను ఉపకులపతి ప్రారంభించారు.

డిసెంబర్ 12, 13న రెండు రోజుల పాటు జరగనున్న ఈ యూత్ ఫెస్టివల్ లో జిల్లా నలుమూలల నుండి వర్శిటీ పరిధిలో వివిధ కళాశాలల్లో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు పాల్గొంటారు. డ్యాన్స్, మ్యూజిక్, క్విజ్, ఎలొక్యూషన్, డిబేట్, స్కిట్, మిమిక్రీ, మైమ్, రంగోళి, మెహెంది, పోస్టర్ మేకింగ్, స్పాట్ పెయింటింగ్, క్లే మోడలింగ్ వంటి వివిధ అంశాల్లో పోటీలు జరిపి బహుమతుల ప్రధానం చేసి, గెలుపొందిన విజేతలను పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్ కి పంపుతారు.

ఈ సందర్భంగా ఆచార్య జి.యం.సుందరవల్లి మాట్లాడుతూ మాండూస్ తుఫాన్ తీవ్రంగా ఉండడంతో ఈ కార్యక్రమానికి ఆటంకం జరిగి వాయిదా వేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందామని, కానీ నేడు ఈ యువజనోత్సవాలలో విద్యార్థినీ విద్యార్థుల్లో ఉత్సాహం తుఫాన్ లా చెలరేగుతుంటే ఆనందంగా ఉందని అన్నారు. దేశానికి యువత వెన్నుముక వంటి వారని, వారిలోని ప్రతిభని వెలికితీసేందుకు ఇలాంటి వేడుకలు తోడ్పడతాయని, వారిలోని ప్రతిభని మరింతగా మల్చుకునేందుకు వారు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహణ ఏర్పాట్లు చేసిన వర్శిటీ అధ్యాపక అధ్యాపకేతర బృందాన్ని, కృష్ణచైతన్య విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆమె అభినందించారు.

విశిష్ట అతిథిగా పాల్గొన్న నెల్లూరు రూరల్ డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి మాట్లాడుతూ మన దేశం గొప్పగా ఎదగాలంటే అది యువత చేతుల్లోనే ఉందని అన్నారు. పోలీసులు ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడేలా విధులు నిర్వహిస్తుంటారని, అదేవిధంగా ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు ఇలా ప్రతిఒక్కరు తమ విధులను సక్రమంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తేనే సమాజం వృద్ధి చెందుతుందని, ఏ రంగానికి చెందిన వారైనా తాము యువకులుగా ఉన్నపుడు బాధ్యతలు తెలుసుకుని సక్రమంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుందని అన్నారు.

విద్యార్ధినీవిద్యార్థులు తల్లిదండ్రులను, స్నేహితులను, సమాజాన్ని గౌరవించడం నేర్చుకోవాలని, పనికిరాని విషయాల పట్ల డైవర్ట్ అవ్వకుండా జ్ఞానం పెంచుకోవాలని అన్నారు. సినిమాలు, సీరియళ్ళు సమాజంలో దుష్ప్రభావం చూపుతున్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదని, రానున్న రోజుల్లో ఎలా బ్రతకాలి అనేందుకు ఈ విద్యార్థి దశలోనే బీజాలు వేసుకోవాలని అన్నారు.

రిజిస్ట్రార్ డాక్టర్ పి.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజనోత్సవాలు జరుగుతాయని, వచ్చే జనవరి 12 నుండి 16వ తేదీ వరకు జాతీయ యువ వారోత్సవాలు (నేషనల్ యూత్ వీక్) జరగనున్నాయని, ఈ లోపు ఇప్పుడు వర్శిటీ స్థాయిలో జరిగే పోటీల్లో నిలిచే విజేతలను రాష్ట్ర స్థాయిలో వేడుకలు జరిగే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి పంపుతామని, అక్కడ నెగ్గిన వారు సౌత్ జోన్ వేడుకల్లో పాల్గొంటారని, అక్కడ కూడా నెగ్గిన వారు జాతీయ యువజన వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.

కృష్ణచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్త్వం పెరిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని, సమాజంలో వివిధ అంశాల్లో ముందుండాలనే దృక్పధం ఏర్పడుతుందని, విద్యార్థుల్లో ఉత్సాహం నింపేలా వేడుకలకు శ్రీకారం చుట్టిన విశ్వవిద్యాలయ అధికారులకు అభినందనలు తెల్పుతూ ఈ కార్యక్రమంలో తాము భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.విజయానందబాబు మాట్లాడుతూ యువతీయువకుల్లో జాతీయ సమగ్రతకు తోడ్పడేలా యువజనోత్సవాలు ఏర్పాటు చేసామని, ఇక్కడ నెగ్గిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని, తద్వారా ఒకరి సంస్కృతి సంప్రదాయాలు, భాష, వ్యవహారశైలి పరస్పరం అవగతమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డా సాయినద్, డా ఉదయ్ శంకర్ డా సుబ్బరామరాజు, డా ప్రభాకర్, డా వీర రెడ్డి మరియు కార్యక్రమనికి కో-ఆర్డినేటర్లు గా అధ్యాపకులు డాక్టర్ హనుమారెడ్డి, కృష్ణచైతన్య విద్యాసంస్థల డీన్ సుధారాణి వ్యవహరించారు. అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పోలీసుల పై దౌర్జన్యం చేసిన వైసీపీ నేతలకు 14 రోజుల రిమాండ్

Satyam NEWS

కటిక దరిద్రం అనుభవిస్తున్నాయా ఈ కార్పొరేట్ కాలేజీలు?

Satyam NEWS

ఒంగోలు వ్యాపారులకు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment