34.7 C
Hyderabad
May 5, 2024 00: 09 AM
Slider చిత్తూరు

‘దేశం’లో రోజా మనుషులకు ఇక కష్టకాలం

#chittibabu

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వర్గపోరుతో సతమతమవుతోంది. నాయకుల ఆధిపత్య పోరు కారణంగా తెలుగుదేశం పార్టీ చతికిలబడింది. అధిష్టానం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఇక్కడ వ్యవహారం నడుస్తోంది.  ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమితులైన డాక్టర్ థామస్ ఒంటరి పోరాటం చేస్తున్నారు.

థామస్ కు  నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. ఆయనతోపాటు ప్రచారానికి ఎవరు వెళ్లడం లేదు. వారం రోజుల ముందు చిత్తూరులో జరిగిన నియోజకవర్గ సమావేశానికి సైతం చిట్టిబాబు హాజరు కాలేదు. వారం రోజులకు ముందు వరకు థామస్ ను ముందుండి నడిపించిన నియోజకవర్గ మాజీ ఇంచార్జ్  చిట్టి బాబును పార్టీ పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. చిట్టి బాబుకు చెందిన రిసార్టులో  మంత్రి రోజా రెండు రోజులపాటు ఉండి, తన భర్త సెల్వమణి జన్మదిన వేడుకలను చేసుకోవడం ఇందుకు కారణం.

సెల్వమణి జన్మదిన వేడుకలకు చిట్టిబాబు ఆతిథ్యం ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చిట్టి బాబు విషయంలో అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అధిష్టానం చిట్టిబాబు లేకుండా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా థామస్ ను ఆదేశించినట్లు సమాచారం. దీంతో గత వారం రోజులుగా థామస్ ఒకరే ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గతంలో చిట్టి బాబుతో కలిసి మండల పార్టీ అధ్యక్షుల వ్యతిరేకుల ఇళ్లకు థామస్ వెళ్ళడంతో, థామస్ మీద మండల పార్టీ అధ్యక్షులు గుర్రుమని ఉన్నారు.

ఆయనకు ఏ మాత్రం సహకరించడం లేదు. మాజీ సమన్వయ కర్త భీమినేని చిట్టిబాబు నాయుడు ఇటీవల తన రిసార్ట్స్ లో మంత్రి రోజాకు రెండు రోజుల పాటు వసతులు సమకూర్చడం ఇందుకు కారణంగా చెపుతున్నారు. చెన్నై చుట్టు ప్రక్కల ఉన్న హోటళ్ళు, రిసార్ట్స్ ను కాదని ఒక మండల కేంద్రంలో ఆమె రెండు రోజులు ఉండటంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. నగరిలో టిడిపి అభ్యర్థిని ఓడించడానికి ఆమెతో  చిట్టిబాబు మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఆ విషయం నగరి ఇంచార్జి గాలి భాను ప్రకాష్ లోకేష్ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది.

ఆయన దీనిపై చాలా సీరియస్ అయ్యారని, చంద్రబాబు సమస్యలు సద్దుమనిగిన తరువాత నిర్ణయం తీసుకుంటానని లోకేష్ అన్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో చిట్టిబాబు ఎదురు సమాధానాలు చెపుతున్నారు. రిసార్ట్స్ తన కూతురు నిర్వహిస్తున్నదని, రోజా బస చేయడానికి తనకు సంబంధం లేదని వాదిస్తున్నారు. హెరిటేజ్ పాలు టిడిపి వారే తాగుతున్నారా ? వైసిపి వారికి అమ్మారా ? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీనితో జిల్లా నాయకులు చిట్టి బాబును పక్కన పెట్టారని అంటున్నారు.

ఇదిలా ఉండగా నియోజక వర్గంలో ఉన్న వారిని కాదని చెన్నైలో ఉన్న డాక్టర్ థామస్ ను ఇంచార్జిగా నియమించడంపై ఆరు మండల కమిటీ అధ్యక్షులు అలిగి కూర్చున్నారు. దీని వెనక చిట్టిబాబు ప్రమేయం ఉన్నందున ఆయనతో అంటి ముట్టనట్లు ప్రవర్తిస్తున్నారు. మండల అధ్యక్షులు రుద్రయ్య నాయుడు, జయశంకర్ నాయుడు, స్వామి దాస్, రాజేంద్ర, చెంగల్రాయ యాదవ్, లోకనాధ రెడ్డి ఒక వర్గంగా వ్యవహరిస్తున్నారు.

టిఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఇ లోకనాద నాయుడు వెనక ఉండి అసమ్మతి నాయకులను నడిపిస్తున్నారు. రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మనోహర్ నాయుడు కూడా చిట్టి బాబుకు వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో చిట్టి బాబును సమన్వయ కర్తగా నియమించడం నచ్చక మాజీ మంత్రి దివంగత గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు డాక్టర్ హరికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. నియోజక వర్గంలో ఒక వర్గం పెత్తనం సహించ లేక పెనుమూరుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి తన సభ్యత్వాన్ని తిరుపతికి మార్చుకున్నారు.

నియోజక వర్గంలో పార్టీ దెబ్బతినడానికి కారణమైన చిట్టి బాబును దూరం పెట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ పరిశీలకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి  సారథ్యంలో కీలక నేతల సమావేశం బుధవారం జరుగుతుందని తెలిసింది. అందులో  ఇంచార్జి, మండల కమిటీల అధ్యక్షులు, రాష్ట్ర, పార్లమెంటు నాయకులు పాల్గొంటారు. ఈ సమావేశంలో చిట్టిబాబు, మండల పార్టీ అధ్యక్షుల మధ్య నెలకొన్న విభేదాల విషయం ముఖ్యంగా చర్చించ నున్నారు. ఎన్నికల సమయంలో ఎవరిని వదులుకోవడానికి పార్టీ సిద్దంగా లేదు. ఇరు వర్గాలకు రాజీ చేసి పార్టీని ఒక దారిలో పెట్టే ప్రయత్నం చేయనున్నారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

Satyam NEWS

ట్రాఫిక్ పోలీసుల ఆదేశాల‌ను పెడ‌చెవిన పెడుతున్న ప్ర‌జానీకం…!

Satyam NEWS

కరోనా హెల్ప్: మీడియా మిత్రులకు యాదవ సంఘం సహాయం

Satyam NEWS

Leave a Comment