ఇదేదో కొత్తగా అనిపించవచ్చు కానీ కేరళలో ఇదే జరుగుతున్నది. అధ్వాన్నమైన రోడ్ల కారణంగా కేరళలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దారుణమైన రోడ్లపై బండి నడపలేక వాహనదారులు ప్రమాదాలు చేసేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగిపోతుండటంతో కేరళలో మోటారు వాహనాల బీమా ను ఎక్కువగా చేయవద్దని పలు ప్రయివేటు బీమా కంపెనీలు కేరళలోని తమ ప్రతినిధులకు చెప్పాయి.
కేరళలో మోటారు భీమా కవరేజీని బాగా తగ్గించాలని కంపెనీల అధిపతుల నుండి ఏజెంట్లకు సూచన రావడంతో ఒక్క సారిగా ఆందోళన చెలరేగింది. తరచూ ప్రమాదాలు జరగడం వల్ల బీమా కంపెనీలకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతున్నది. అందుకోసమే కేరళలో కస్టమర్లను తగ్గించుకోవడానికి చాలా కంపెనీలు తన బీమా ప్రీమియాన్ని పెంచాలని యోచిస్తున్నాయి.
కొన్ని లగ్జరీ వాహనాలకు బీమా ఇవ్వడం ప్రైవేట్ కంపెనీలు పూర్తిగా నిలిపివేసాయి. అలాంటి వాహనాలు గుంటలో పడినప్పుడు, మరమ్మతుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. ద్విచక్ర వాహనాలకు ఇక బీమా ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ప్రైవేట్ కంపెనీలు వైదొలగడంతో, యజమానులు వాహన భీమా కోసం ప్రభుత్వ వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రభుత్వ సంస్థలలో ప్రతిరోజూ వందలాది వాహనాలు బీమా చేస్తున్నారు.