31.7 C
Hyderabad
May 7, 2024 00: 50 AM
Slider సంపాదకీయం

కమలం కల నెరవేరేనా?

#bandisainjai

తెలంగాణ లో అధికారం కైవసం చేసుకునేంత స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలపడిందా? ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో బీజేపీకి విపరీతమైన స్పందన వస్తున్నదనడంలో సందేహం లేదు. దానికి తోడు కేంద్ర పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ పై దృష్టి కేంద్రీకరించడంతో బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నానికి మరింత ఎక్కువ స్పందన వస్తున్నది.

బండి సంజయ్ తలపెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రలు పార్టీకి మంచి మైలేజీ ఇస్తున్నాయి. తెలంగాణలో నాలుగు పార్లమెంటు స్థానాలలో గెలవడం, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అధికారం నాదే అనే స్థాయిలో పోటీ ఇవ్వడం బీజేపి పెరుగుదలను సూచిస్తున్నాయని కమలనాథులు సంబరపడుతున్నారు.

అదే విధంగా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీజేపీ అభ్యర్ధులు గెలవడంతో కేంద్ర పార్టీకి తెలంగాణ పై ఆశలు చిగురించాయి. తాజాగా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కూడా తాము గెలుస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో తాము అధికారం చేపడతామని కూడా వారు అనుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నాయకులు కూడా బీజేపీ వైపు వస్తుండటంతో ఈ ఆశలు మరింతగా పెరిగాయి. అయితే రాష్ట్రంలో బీజేపీకి ఇప్పటికీ మెజారిటీ స్థానాలలో సరైన అభ్యర్ధులు లేరనేది వాస్తవం. తెలంగాణ అసెంబ్లీలో ఐదు స్థానాలు ఉన్న బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఒకే ఒక్క స్థానానికి పడిపోయిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఉప ఎన్నికలలో గెలిచిన రెండు స్థానాలు కూడా అభ్యర్ధుల బలంతో గెలిచినవే తప్ప పార్టీ బలంపై గెలిచినవి కాదు.

ఒక అంచనా ప్రకారం తెలంగాణ లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 20 నుంచి 30 స్థానాలలోనే బీజేపీకి దీటైన అభ్యర్ధులు ఉన్నారు. ఏదో పోటీకి పెట్టాం అని కాకుండా గెలవగల సత్తా ఉన్న అభ్యర్ధుల కోసం బీజేపీ ఇప్పటికీ వెతుకులాడుతూనే ఉన్నది. నాయకుల సంగతి అలా ఉంచి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని గతంలో అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.

ఆయన పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో బూత్ స్థాయిలో ఇన్ చార్జీలను నియమించే కార్యక్రమాన్ని చురుకుగా కొనసాగించేలా చేశారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడుగా తెలంగాణ సమీక్ష జరిపిన ప్రతి సారీ బూత్ స్థాయి ఇన్ చార్జిల నియామకంపైనే ప్రశ్నలు వేసేవారు. అయితే దాదాపు 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాలలో బూత్ స్థాయి ఇన్ చార్జిలు దొరక్క అప్పటి పార్టీ నాయకులు ఎంతో ఇబ్బంది పడేవారు.

నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో గెలిచినా కూడా ఆ పరిధిలో కూడా అన్ని పోలింగ్ బూత్ లలో ఇన్ చార్జీలు ఇప్పటికీ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ బలపడిందని ఎలా చెప్పగలం అనేది రాజకీయ పరిశీలకుల ప్రశ్న. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నుంచి 18 మంది ముఖ్యమంత్రులు, 23 మంది కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా గెలిచింది కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో అనే విషయం దృష్టిలో ఉంచుకోవాలి. అప్పటికి ఇప్పటికి పరిస్థితి కొంచెం మెరుగు పడ్డా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే స్థాయిలో ఇంకా బలపడలేదనే చెప్పుకోవాలి.

Related posts

ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున SS96 మాస్కులు పంపిణీ

Satyam NEWS

కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగదాసు మృతి

Bhavani

చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా…ఈ ప్ర‌భుత్వాన్ని భ‌ర్త‌ర‌ఫ్ చేయండి….!

Satyam NEWS

Leave a Comment