40.2 C
Hyderabad
May 5, 2024 18: 45 PM
Slider ప్రత్యేకం

అన్నదాత విజయకేతనం: 50 రోజుల పోరాటానికి దక్కిన ఫలితం

#masterplan

చినిచి చినికి గాలివానలా మారి రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. మున్సిపల్ కౌన్సిల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయడంతో రైతులు శాంతించారు. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్టు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. దాంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 50 రోజులుగా రైతులు చేపట్టిన ఆందోళనతో మున్సిపల్ యంత్రాంగం దిగివచ్చింది. ముందుచూపుతో ఆలోచించి నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పడంతో ఈరోజు రైతులు చేపట్టిన ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని కౌన్సిల్ వాయిదా వేయించింది. లేకపోతే ఈరోజు పరిస్థితి వేరే విధంగా ఉండదన్న చర్చ నడుస్తోంది. కలెక్టరేట్ కంటే ఎక్కువ ఆందోళన ఎమ్మెల్యే ఇంటివద్ద జరిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.

చైర్మన్ ప్రకటనతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. చైర్మన్ ప్రకటించిన విధంగానే కౌన్సిల్ సమావేశమైంది. బీజేపీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లలో ఆరుగురు, కాంగ్రెస్ కు చెందిన నలుగురు కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. ఏకైక ఏజండాతో కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు తీర్మానాన్ని ఆమోదించారు.

కౌన్సిల్ సమావేశం దృశ్యం

మాస్టర్ ప్లాన్ రద్దు చేశాం: మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి

కౌన్సిల్ తీర్మానం కాపీ

కౌన్సిల్ సమావేశం అనంతరం మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి మీడియాతో మాట్లాడారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్న కొత్త మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయడం జరిగిందన్నారు. తాము కౌన్సిల్ నుంచి పంపిన ముసాయిదాను ఢిల్లీ కన్సల్టెన్సీ మార్పులు చేసిందని, రెసిడెన్షియల్, గ్రీన్ జోన్లలో ఇండస్ట్రియల్ జోన్లను ప్రతిపాదించిందన్నారు. దాంతో రైతుల భూములోంచి ఇండస్ట్రియల్ జోన్ రావడం వల్ల రైతులు 50 రోజులుగా ఆందోళన బాట పట్టరాని తెలిపారు.

రైతులకు చెందిన ఒక్క గజం భూమి కూడా మాస్టర్ ప్లాన్ లో పోదని హామీ ఇచ్చారు. ఢిల్లీ కన్సల్టెన్సీ, డిటిసిపి అధికారులపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు నివేదిస్తామనన్నారు. ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టించాయని పేర్కొన్నారు. రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. రైతులకు అన్యాయం జరిగే మాస్టర్ ప్లాన్ ఏదీ మున్సిపల్ ఆమోదించదని చైర్మన్ పేర్కొన్నారు. రైతులు ఇకనైనా శాంతించాలని కోరారు.

ఉద్యమానికి తాత్కాలిక విరామం: రైతు ఐక్య కార్యాచరణ కమిటీ

మాస్టర్ ప్లాన్ రద్దు చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ గ్రామంలో భవిష్యత్ కార్యాచరణపై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. మాస్టర్ ప్లాన్ బెంగతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన రైతు రాములుకు రైతులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయడం రైతుల విజయమన్నారు. 50 రోజులుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైన అన్నం పెట్టే భూమిని కోల్పోవద్దన్న ఉద్దేశ్యంతో ఆందోళన బాట పట్టామన్నారు.

అడ్లూర్ లో రైతుల సమావేశం

తమ ఉద్యమానికి బాసటగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ముఖ్య పాత్ర పోషించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ రద్దు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి మాస్టర్ ప్లాన్ తయారు చేసేముందు ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తరువాతే ముసాయిదా తయారు చేయలన్నారు. భవిష్యత్తులో రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఇంతకంటే పదిరేట్లు ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ రద్దుతో తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

మమ్మల్ని మాట్లాడనివ్వలేదు: బీజేపీ కౌన్సిలర్లు

కౌన్సిల్ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం ప్రవేశపెట్టే కంటే ముందు అసలు ప్రతిపాదన ఎవరు చేశారు. ఎలా చేసారనే దానిపై మమ్మల్ని మాట్లాడనివ్వలేదని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు తెలిపారు. తీర్మానం కావాలా వద్ద అనే బెదిరింపు రీతిలో మాట్లాడారని పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు మొదటి నుంచి రైతులకు బీజేపి అండగా ఉందని తెలిపారు. మాస్టర్ ప్లాన్ విషయంలో నిర్లక్ష్యం వహించిన కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం: కాంగ్రెస్ కౌన్సిలర్లు

మున్సిపల్ కౌన్సిల్ లో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు చేసిన తీర్మాణాన్నీ తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి మాస్టర్ ప్లాన్ అమలు చేయవద్దని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు

పోలీసుల భారీ బందోబస్తు

కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. రైతులు మున్సిపల్ కార్యాలయానికి వసతిరేమోనని భావించి ముందస్తుగా భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యాలయంలోకి పని చేసే సిబ్బంది, కౌన్సిలర్లు, మీడియాకు తప్ప ఇతరులను అనుమతించలేదు. కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

భర్తతో విడిపోయిన మహిళను కిరాతకంగా హింసించిన కుటుంబ సభ్యులు

Satyam NEWS

The End: బిల్ గేట్స్, భార్య మిలిందా విడాకులు

Satyam NEWS

ఢిల్లీ మద్యం కుంభకోణం: మరో వీడియో విడుదల చేసిన బీజేపీ

Satyam NEWS

Leave a Comment