33.7 C
Hyderabad
April 30, 2024 01: 45 AM
Slider నిజామాబాద్

రెడ్ ఎలర్ట్: కామారెడ్డిలో కరోనా పంజా

#Kamareddy Municipality

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. జిల్లా కేంద్రంలో నేటి కేసులతో కలిపి మొత్తం ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనిలో నివాసముండే 60 సంవత్సరాల వృద్ధునికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతనికి సబందించిన 30 మంది ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ పంపించగా అందరికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రెండు నెలలుగా నమోదు కాని కేసులు

జిల్లాలో మొదట కరోనా ప్రారంభమైన నాటి నుంచి 12 కేసులు జిల్లాలో నమోదయ్యాయి. ఇందులో కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లిలో ఒకటి కాగా బాన్సువాడలో 11 కేసులు నమోదయ్యాయి. వీరందరూ చికిత్స ద్వారా కోలుకుని సురక్షితంగా ఇంటికి చేరారు. దాంతో కరోనా రహిత జిల్లాల లిస్టులో కామారెడ్డి చేరింది.

వ్యాపారి దావత్ తో కరోనా పంజా

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి ఇటీవల ఓ గెట్ టు గెట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు బంధువులు, శ్రేయోభిలాషులు కలిపి మొత్తం 30 నుంచి 50 మంది వరకు హాజరైనట్టుగా తెలిసింది. ఫంక్షన్ అయిన 15 రోజులకు వ్యాపారి అల్లుళ్ళయిన మెదక్, ఆర్మూర్ వాసులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దాంతో వారి ప్రైమరీ కాంటాక్టుల వివరాలు సేకరించగా ఇటీవల నిర్వహించిన పార్టీ విషయం బయటకు పొక్కింది.

దాంతో వ్యాపారులైన తండ్రి కొడుకులు ముందు జాగ్రత్తగా యశోద ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోగా కొడుక్కి పాజిటివ్ గా నిర్దారణ అయింది. మరుసటి రోజు తండ్రికి కూడా కరోనా సోకినట్టు నిర్దారించారు. ప్రైమరీ కాంటాక్టులపై అధికారులు విచారించగా అందులో 16 మందిని గుర్తించి వారి శాంపిల్లు సేకరించి హైదరాబాద్ పంపించారు.

ఇందులో వ్యాపారి కోడలు, వారి గోదాములో పని చేసే ఒకరికి, వ్యాపారి ఇంటి వద్ద ఉండే మరొకరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. జిల్లా కేంద్రంలో వృద్ధుడితో పాటు మొత్తం 6 కరోనా కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి

ఆందోళనలో మిగతా వ్యాపారులు

కరోనా సోకిన వ్యాపారి కిరాణా దుకాణం మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటాడు. అయితే కరోనా సోకాకముందు సదరు వ్యాపారి సంఘానికి సబందించిన చీటి నిర్వహణలో పాల్గొన్నారు. ఆ రోజు సుమారు 50 మంది వరకు చీటి కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది.

అలాగే వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సైతం ఉండటంతో వారితో సన్నిహితంగా కొనసాగే వారిలో కరోనా టెన్షన్ మొదలైంది. ఇంటిల్లిపాధికి కరోనా సోకడంతో మిగతా వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

రెండు రోజులు దుకాణాల బంద్

వ్యాపారికి కరోనా సోకడంతో మిగతా వ్యాపారులు అప్రమత్తమయ్యారు. ఎవరి వల్ల ఎవరికి కరోనా సోకుతుందోనన్న భయం అందరిలో నెలకొంది. దాంతో శని, ఆదివారాలు రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో వ్యాపారుల దుకాణ సముదాయాలు మొత్తం మూసివేశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో రేపటి నుంచి కూడా వ్యాపారాలు కొనసాగే అవకాశం కూడా కనిపించడం లేదు.

ప్రైమరీ కాంటాక్టులపై అధికారుల అన్వేషణ

మరోవైపు వ్యాపారి ప్రైమరీ కాంటాక్టులపై అధికారులు అన్వేషణ ప్రారంభించారు. ప్రైమరి కాంటాక్టులు అధికంగా ఉన్నట్టు సమాచారం రావడంతో అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఇప్పటికే 16 మంది శాంపిల్లలో కొన్ని మాత్రమే రిపోర్టులు వచ్చాయి. మరిన్ని రిపోర్టులు వస్తే తప్ప కేసుల ప్రభావం ఎలా ఉందో తెలిసే పరిస్థితి లేదు.

16 మందికి సబందించిన పూర్తి రిపోర్టులు వస్తే దాని ప్రకారం అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు వ్యాపారి కొడుకు కరోనా టెస్టుల కోసం వెళ్ళడానికి రెండు రోజుల ముందు సుమారు 300 మందితో గ్రాండ్ పార్టీ చేసుకున్నట్టు వినిపిస్తోంది.

ఇప్పటికే గెట్ టు గెట్ పార్టీ వల్ల ఇంతమందికి కరోనా రావడం జిల్లా ప్రజల్లో భయం నెలకొంది. జిల్లా కేంద్రానికి కిరాణా సరుకుల కోసం నిత్యం వందలాది మంది ప్రజలు కామరెడ్డికి వస్తుంటారు. ప్రస్తుతం కామరెడ్డికి రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మున్ముందు మరెన్ని కేసులు నమోదు కానున్నాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related posts

కాపుకులస్తుల్ని దారుణంగా తిట్టిన అంబటి రాంబాబు

Satyam NEWS

వేసవి పంటలలో నీటి యాజమాన్యం ఇలా చేయాలి

Satyam NEWS

పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment