41.2 C
Hyderabad
May 4, 2024 17: 01 PM
Slider కవి ప్రపంచం

అచ్చుల వందనం

#Manjula Surya New

అ ని దిద్దిస్తూ అమ్మలా చేరువవుతూ

ఆవు లోని క్షీరామృతాన్ని పలికించడం ద్వారా ఒలికిస్తూ

ఇంట్లోనే తన ఇంట్లోనే ఉన్నాననే భావనను కలిగిస్తూ

ఈగలా తూనీగలా ఆటపాటలతో చదువు నేర్పిస్తూ

ఉల్లిలా తల్లి గుర్తుకు రాగానే కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరగకుండా చూస్తూ

ఊయలలా కథలతో జోకొడుతూ ఊహలకు కొత్త రెక్కలను తొడుగుతూ

ఋషిలా ధ్యానము చేయిస్తూ ఏకాగ్రతను పెంచి మనసు శరీర సమన్వయానికి సహకరిస్తూ

ఎడారి లాంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి

జ్ఞానమనే ఒయాసిస్సులో నేర్చుకోవాలనే తృష్ణను కలిగిస్తూ ఆ దాహార్తిని తీర్చుకునేందుకు దారిని చూపిస్తూ

ఏనుగెక్కినంత సంబరాన్ని కలిగిస్తూ అంబరాన్ని తాకుతామనే ఆత్మవిశ్వాసాన్ని

కలిగేలా చేస్తూ

ఐదువేళ్ళ సాక్షిగా ఐకమత్యాన్ని బోధిస్తూ

ఒంటిగా నువ్వు లేవంటూ వెన్నంటి నేనున్నానంటూ

ఓటమి చీకటి కాదంటూ ఓరిమితో ప్రయత్నిస్తే వెలుగంతా నీదంటూ

ఔషధం మింగినట్లు కాదు చదువంటే ఔరా అనిపించే జ్ఞానామృత గుళికంటూ

అందరిలో ఒకరిగా కాక ఒక్కరంటే అందరనే భావన కల్పించేలా నిర్దేశిస్తూ

అః ఉహు అనక బడి అంటే ఆహా ఓహో అని అనుకునేలా అనేలా చేస్తూ

వర్ణమాలలోని అచ్చులుగా

ముచ్చటగా ముందడుగేసి

అన్నిటా ముందుండేలా చేసి

అందరి మెచ్చుకోలుకు పాత్రులను చేస్తున్న

గురువుకు వందనం అభివందనం

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

లాస్ట్ ఛేంజ్: రాజ్యసభకు కేకే సురేష్ రెడ్డిలకు లైన్ క్లియర్

Satyam NEWS

ప్లాస్టిక్ బ్యాగులకు బదులు కాటన్ బ్యాగ్స్ వాడండి

Satyam NEWS

మేళ్ళచెరువు మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment