42.2 C
Hyderabad
May 3, 2024 15: 04 PM
Slider ఆదిలాబాద్

కుమరం పులి:సామాన్యుడి అసామాన్య పోరాటం

అదివాసీ బిడ్డలపై అమానుష నిర్బంధానికి వ్యతిరేకంగా కర్షక నిజాం సర్కార్‌పై జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదంతో జంగు సైరన్‌ ఊదిన ఆదివాసీ నిప్పుకణిక కుమరం భీం ఈ లోకాన్ని విడిచి నేటికి సరిగ్గా 82 ఏళ్లు పూర్తయ్యాయి. అడవి బిడ్డల ఆత్మస్థైర్యాన్ని శిఖర స్థాయికి చేర్చి తను కనుమరుగైపోయినా తను నింపిన స్ఫూర్తిని, ధైర్యాన్ని అడవి బిడ్డలు నేటికీ తలుచుకుంటూనే ఉన్నారు. యేటా ఆశ్వయుజ పౌర్ణమి రోజున ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

చిన్నతనం నుంచే తిరుగుబాటు

భీం స్వగ్రామం ఆసిఫాబాద్‌ మండలం సంకెపల్లి గ్రామం. భీం తండ్రి తన బాల్యంలో మరణించడంతో పదిహేనవ యేటా కుటుంబం, గ్రామ పెద్దగా బాధ్యతలు చేపట్టాడు. శిస్తు(పన్నులు) పేరుతో ఆదివాసీలపై నిజాం అనుచరులు చేస్తున్న ఆగ డాలను సహించలేక 1940కి ముందే జోడేఘాట్‌పోరాట గడ్డపై తుపా కీ ఎక్కు పెట్టాడు. నిజాం పోలీసుల, అటవీ అధికారుల ఆగడాలను సహించలేక పోయారు. తన చిన్నతనంలో భీం సోదరులు అటవీ శాఖ సిబ్బందితో పడుతున్న గొడవలకు కారణాలను తెలుసుకున్నాడు. వారిని ఎదురించడం ప్రారంభించాడు.

ఇదే క్రమంలో అక్కడి సమకాలిక సమస్యలు, కారణాలపై అవగాహన పెంపొందించుకున్నాడు. శతాబ్దాలుగా తాము అనుభవిస్తున్న అటవీ, సహజ సంపదలపై నిజాం సర్కారు పన్నులు వసూలు చేయడం, ఈ నెపంతో చౌకీదార్లు, పట్వారీలు గోండు గూడేల పైబడి దోచుకోవడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం భీంను కలచి వేశాయి. దీంతో ఆయన స్థానికంగా ఉన్న జమీందార్లు, చౌకీదార్లపై నిజాం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్‌ వెళ్లాడు. కానీ నిజాం ప్రభువు అతడిని కలవక పోవడంతో ఇక్కడికి తిరిగి వచ్చి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పోరుబాట పట్టారు.

గెరిల్లా దళం ఏర్పాటు..

ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాడేందుకు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో గిరిజన యువకుడిని చేరదీసి సైన్యాన్ని ఏర్పాటు చేశాడు కుమరం భీం. వెదురు కొట్టడం, విల్లంబులు, బాణాలు తయారు చేయడం వారికి నేర్పించాడు. ఉచ్చులు పెట్టడం, గెరిల్లా దాడులపై శిక్షణ ఇచ్చాడు. బర్మారా (ఒకరకమైన నాటు తుపాకులు) ఇంటికోటి ఉండాలని చెప్పేవాడు. అరక(నాగలి), పొరక, మేకలు, కంచె, కంచెలపై నిజాం ప్రభుత్వం తరపున పట్వారీలు, చౌకీదార్లు పట్టీలు(పన్నులు) వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారిపై దాడులు చేసేవారు. నైజాం కాలంలో పట్టేదారులు గిరిజన మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడేవారు. ఈ క్రమంలో వారిపై కుమరం భీం దాడులు చేసేవాడు. భూస్వామి సిద్దిక్‌తో గొడవకు దిగాడు. ఈ గొడవలో సిద్దిక్‌ తీవ్రంగా గాయపడడంతో ఈ వార్త నిజాం ప్రభువు చెవిన పడింది.

దాంతో ఆగ్రోహోదగ్రుడైన నిజాం అసబ్‌జాహీ భీంను బంధించి తెమ్మంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో తన మద్దతు దారుల ఒత్తిడి మేరకు భీం అజ్ఞాత జీవితంలోకి వెళ్లాడు. అక్కడ మొదలైన ఆయన ధిక్కార స్వరం అంతకంతకు పెరుగుతూ నిజాం అధికారాన్ని శాసించే స్థాయికి చేరింది. ఆదివాసీలందరిని ఐక్యం చేసి నిజాం పాలను అంతమొందించేందుకు ఆదివాసీ బిడ్డలను పోరాటం వైపు నడిపించాడు.

జోడేఘాట్‌ కేంద్రంగా..

గిరిజన గూడాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి జరుగుతున్న అన్యాయాలను వివరించి కెరమెరి మండలంలోని జోడేఘాట్‌ కేంద్రంగా కుమరం భీం ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. అక్కడికి వచ్చే పోలీసులు, అటవీ అధికారులను బంధించారు. దీంతో ఆ ప్రాంతానికి వచ్చేందుకు పోలీసులకు సైతం వెన్నులో వణుకు పుట్టిందంటే ఆయన ప్రతిఘటన ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. జోడేఘాట్‌ ప్రాంతంలోని 12 గ్రామ పంచాయతీల విముక్తి కోసం తీవ్రంగా సాయుధ పోరాటం సాగించిన భీం నిజాం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారాడు.

ఆయన శక్తిని గ్రహించిన నిజాం సర్కార్‌ మొదట దూతలతో రాజీ కోసం ప్రయత్నాలు చేసింది. కానీ భీం ఉక్కు సంకల్పం ముందు నిజాం పాచికలు పారలేదు. దాంతో కుమ్రం భీం బల పడితే మొత్తంగా ఈ ప్రాంతంలోనే తన అధికారానికి బీటలు వారుతాయని భయ పడిన నిజాం ప్రభువు అతన్ని భౌతికంగా అంత మొందించేందుకు ప్రత్యేక దళాన్ని హైదరాబాద్‌ నుంచి జోడేఘాట్‌కు పంపారు.

అయితే ఆ ప్రయత్నం ఫలించక పోవడంతో కుట్ర చేసైనా ఆయనను అడ్డు తొలగించుకోవాలని ఆయన సహచరులను లోబర్చుకుంది. దీంతో కుమరం భీం అనుచరుడైన మడావి కొద్దు అనే వ్యక్తి 1940 అక్టోబరు 6న ఇచ్చిన సమాచారం మేరకు నిజాం ప్రభుత్వం అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున సైనికులను మోహరించి భీం సైన్యం కోసం గాలింపులు చేపట్టింది. అర్ధరాత్రి నిజాం పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి కుమరం భీంను చుట్టు ముట్టి గుండ్ల వర్షం కురిపించారు. నిజాం పోలీసులను విరోచితంగా ఎదుర్కొని చివరకు మృత్యుదేవత ఒడిలో తుది శ్వాస విడిచాడు. భీం నిజాం సైన్యం కాల్పుల్లో మరణించడంతో ఆయన అనుచరులు చెల్లా చెదరయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకమొట్ట మొదటి సారిగా 2014లో కుమరం భీం 74వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా హాజరై దర్బార్‌లో పాల్గొన్నారు. జోడేఘాట్‌ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. ఇచ్చినమాట ప్రకారం రూ.25 కోట్లను మంజూరు చేశారు. దీంతో జోడేఘాట్‌ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్నది.

Related posts

విజయనగరం జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Satyam NEWS

పల్నాడు ప్రాంత రైల్వే సమస్యలు సత్వరమే పరిష్కరించండి

Satyam NEWS

పరిసరాల పరిశుభ్రత డెంగ్యూ నివారణకు మార్గం

Satyam NEWS

Leave a Comment