39.2 C
Hyderabad
May 4, 2024 21: 07 PM
Slider ప్రత్యేకం

విశ్లేషణ: కోవిడ్ 19 సరే…ఆ తర్వాత మన బతుకు ఎలా?

#Lifestyle after Covid 19

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

కోవిడ్-19  మహమ్మారి  ప్రపంచ మానవాళికి ఒక నూతన జీవన విధానాన్ని అందించనుందా? అవుననే అంటున్నారు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విశ్లేషకులు. ఇప్పటి వరకు ప్రజారోగ్యం , కుటుంబ సంక్షేమ రంగాలను చిన్నచూపు చూసిన ప్రభుత్వాలు  సమీప భవిష్యత్తులో వాటికి పెద్దపీట వేయడం తప్పదని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు.

 ఎన్నికల ప్రణాళికలలో సైతం ప్రజారోగ్యం కోసం హెచ్చు మొత్తంలో నిధుల కేటాయింపునకు అన్ని రాజకీయ పార్టీలు మొగ్గు చూపడం అనివార్యమవుతుంది. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత సహజంగానే పెరిగింది. విపత్తుల రాకను ముందుగానే గ్రహించి తీసుకోవలసిన జాగ్రత్తలు, సమకూర్చుకోవాల్సిన వివిధ పరీక్ష పరికరాలు, అవసరమైన వైద్య బృందాలు, నర్సులు, సంబంధిత సహాయక సిబ్బంది వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టడం ఆవశ్యకమౌతుంది.

ప్రపంచ దేశాలు కలిసి పని చేయాల్సిన అనివార్యత

ప్రస్తుత సంక్షోభం లో తగుమొత్తంలో మాస్కులు, పీపీఇ కిట్స్ ఇతర అవసర సాధనాలు అందించడంలో ప్రభుత్వయంత్రాంగం విఫలం కావడం ప్రత్యక్ష ఉదాహరణ. సొంత అజెండాలను తాత్కాలికంగా విడిచి…ప్రపంచ మంతా ఒక్కటై  ఉమ్మడి లక్ష్యం కోసం శ్రమిస్తున్న వివిధ దేశాల కు ఆయా దేశాల ఎన్నికల సమయంలో ప్రజారోగ్యం ప్రధాన భూమిక కానుంది.

సాంకేతిక, రక్షణ రంగాలకు ధీటుగా ఆరోగ్య రంగానికీ నిధుల కేటాయింపులు ఉండగలవని అంచనా. వర్తమాన ఆర్ధిక సంక్షోభంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దేశీయ, విదేశీయ విమాన రంగాలు పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి, దివాళా దశ లోఉన్నట్లు  గణాంకాలు చెబుతున్నాయి.

విమానయానం మళ్లీ గగనమే అవుతుంది

కోవిడ్-19 మహమ్మారి ఆకాశయానాన్ని మరింత జఠిలం చేస్తోంది. భౌతిక దూరం, పరిశుభ్రత,తప్ప నిసరి  మాస్కుల వాడకం వంటి జాగ్రత్తలు వంటి అంశాలు నిర్వాహకులకు భారంగా మారనున్నాయి. అంతిమంగా విమాన ఛార్జీల  పెంపుకు దోహదం చేస్తాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప విమానయానాన్ని సాధారణ ప్రజలు వినియోగించని పరిస్థితి రావచ్చని అంతర్జాతీయ విమానయాన యాజమాన్యాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక చాలా రంగాల్లో ఇంటి నుంచి పని సంస్కృతి

అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత  బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. కోవిడ్-19  తీవ్ర ప్రభావం తో ‘ ‘ఇంటినుంచి పని ‘  సంస్కృతి ఐటీ సహా సాధ్యపడిన ప్రతీ రంగంలో అమలులోకి రావడం శుభపరిణామం అంటున్నారు నిపుణులు.

దీనివల్ల ఆయా రంగాల్లో ఉత్పాదకత అనూహ్యంగా పెరిగినట్లు తెలుస్తోంది. యాజమాన్యాలకూ అనవసర వ్యయం తగ్గి ఆర్ధిక ఉపశమనం కలుగుతుంది. రానున్న రోజు ల్లో దాదాపు అన్ని రంగాలలో ఇంటినుంచి పని సంస్కృతికి పలు దేశాలు ఆసక్తి చూపవచ్చు.

విద్యారంగంలో విశేషంగా మార్పులు తప్పదు

ఇక విద్యారంగంలో కూడా పలు పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కిక్కిరిసిన తరగతి గదుల లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించడం ఆచరణ సాధ్యం కాదు. ఇప్పటికే కొన్ని దేశాలు అమలుచేస్తున్న ఆన్ లైన్ విద్యావిధానం మంచి ఫలితాలు ఇవ్వగలదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు.

కానీ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దే శాలలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయి అందుబాటులో లేదు. కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయ విద్యా విధానానికి అలవాటుపడిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్ లైన్ శిక్షణ కు సిద్ధపడటానికి సమయంపడుతుంది.

ఐతే…. విద్యార్థుల బహుముఖ వికాసానికి ఈ తరహా విద్యావిధానం సహకరించగలదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచం కుగ్రామమైన వాస్తవాన్ని గుర్తిస్తే  విద్యార్థులు విశేష పాఠ్య అంశాలను నేర్చుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్-19 తో అత్యధికంగా నష్టపోయిన మరో రంగం హోటల్స్, రెస్టారెంట్లు ఇతర ఆతిధ్య విభాగాలు.

హోటల్స్ తీరు ఇక మారుతుంది

వ్య క్తిగత పరిశుభ్రత, వినియోగదారుల మధ్య విధిగా పాటించాల్సిన భౌతిక దూరం, చెఫ్ లు, వెయిటర్లు,హౌస్ కీ పింగ్ సిబ్బంది అనివార్యంగా మాస్కులు ధరించడం వంటి అంశాలపై ఆయా వ్యవస్థ ల యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

వినియోగదారుల సంక్షేమం కోసం నిబంధనలు పాటించే క్రమంలో పెద్దఎత్తున వ్యయం చేసేందుకు యాజమాన్యాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు రంగంలో నిర్వహిస్తున్న హాస్పిటల్స్ కూడా ఇదే తరహా లో యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరగడంతో ఇప్పటికే పలు హాస్పిటల్స్ మూతపడ్డాయి. దీనికి తోడు ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో  ప్రైవేటు రంగ హాస్పిటల్స్ నిలదొక్కుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు వైద్య ఆరోగ్య రంగ నిపుణులు.

కోవిడ్-19 పంజాదెబ్బ కు ప్రపంచవ్యాప్తంగా కుదేలయిన ఆర్ధిక వ్యవస్థ కు జవజీవాలందించడానికి సత్వర  నూతన ఆవిష్కరణల అవసరాన్ని గుర్తించాల్సిన కీలక తరుణమిది.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

ఫ్లెక్సీ వార్: బీఆర్ఎస్ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ

Satyam NEWS

మైనారిటీ అమ్మాయిలపై అత్యాచారం చేసేవారిని ఎన్ కౌంటర్ చేయాలి

Satyam NEWS

Leave a Comment