రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మా నాయకులు చేసిన తప్పేంటి ? శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు .రాజధాని ప్రజలు ఆమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నారని పేర్కొన్న లోకేష్ రాజధాని గ్రామాల్లో పోలీసుల లాఠీఛార్జీలు, ముళ్ల కంచెలతో ఉద్యమాన్ని అణచివేయలేరని ఫైర్ అయ్యారు.
రాజధాని ఉద్యమాన్ని వైసీపీ ప్రభుత్వం ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకి పదింతలు ఉద్యమం ఉధృతం అవుతుందన్నారు.మూడు రాజధానుల ప్రతిపాదన గొప్ప నిర్ణయమని వైసీపీ నాయకులు డప్పు కొడుతున్నారు ఆ నిర్ణయం అంత గొప్పది అయితే సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు . 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అని నిలదీశారు.
నిన్నటికి నిన్న రాజధాని రైతులను చంపిన పాపం జగన్ సర్కార్ దే అన్న లోకేష్ చేసేవి దొంగపనులు కావడంతో గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారని, ప్రజల మధ్యలోంచి కాకుండా దొంగదారిలో వెళ్లేందుకు జగన్ కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా ప్రభుత్వం రాజధాని అమరావతిని తరలించాలని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.