37.2 C
Hyderabad
May 6, 2024 11: 41 AM
Slider ప్రత్యేకం

మిమ్మల్ని ఏడిపించే రోజులు ముందున్నాయి

#masterplan

‘ఈ రోజు మా భూములు లాక్కుని మమ్మల్ని మీరు ఏడిపిస్తుండొచ్చు. కానీ రేపు అంటూ ఒకటుంది. దానికి ఎక్కువ సమయం కూడా లేదు. అప్పుడు మాదే సమయం. మమ్మల్ని పెయిడ్ వర్కర్లు అంటున్నారు. మా భూములు తీసుకోవడం లేదంటూనే అంతా చేస్తున్నారు. ముందుంది అసలు పండగ. మిమ్మల్ని ఎంతలా ఏడిపిస్తామో భవిష్యత్తు చూసుకోండి. అప్పుడు మీరెక్కడ ఉంటారో చూసుకోండి. మిమ్మల్ని ఏడిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అంటూ రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేయడానికి మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేపట్టారు.

రైతుల ధర్నా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఉంటుందని, ధర్నా శాంతియుతంగా చేస్తామని కమిటీ ప్రకటించినా పోలీసులు నమ్మలేదు. ధర్నా సమాయనికి ముందే మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ స్థాయిలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ర్యాపిడ్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. కార్యాలయ గేటును మూసివేశారు. మున్సిపల్ సిబ్బంది, మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలిపే రైతులు, ఇతర ఎమర్జెన్సీ పనులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. అల్లర్లు జరిగితే అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అందుబాటులో రెండు డిసిఎం వ్యానులను కూడా ఉంచారు.

ఇటీవల కలెక్టరేట్ వద్ద జరిగిన ఘటనలు జరగకుండా ఉండేందుకు పక్కాగా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ పోలీసులు ఊహించింది ఏమి జరగలేదు. అనుకున్న సమాయనికి రైతులు ధర్నా విరమించారు. రైతుల ధర్నాకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు పలికాయి. అడ్లూర్ ఎల్లారెడ్డి టిఆర్ఎస్ నాయకులు సైతం ధర్నలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాము చేసే ఉద్యమం తమ పిల్లల భవిష్యత్తు కోసమేనన్నారు. ఉన్న భూమిని కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందన్న ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడం కోసమేనన్నారు. కోట్ల విలువైన భూములు ధరలు కోల్పోకుండా ఉండటం కోసమన్నారు.

తమకు జీవనాధారంగా ఉన్న భూమిని కాపాడుకోవడం కోసమన్నారు. అంతేకాని రాజకీయంగా తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. నాయకులే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు మద్దతు తెలిపి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సిన నాయకులు భిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి మద్దతివ్వాల్సింది పోయి పెయిడ్ వర్కర్లు అంటూ హేళన చేసి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రైతులం కాదా.. తమ వద్ద ఓట్లు అడుక్కోలేదా అని నిలదీశారు.

న్యాయం కోసం రోడ్డెక్కితే పెయిడ్ వర్కర్లుగా కనిపిస్తున్నమా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకరేమో పెయిడ్ వర్కర్లు అంటారు. మరొకరేమో ఇది మున్సిపల్ చేసిన తీర్మానం కాదని, అధికారులు, కన్సల్టెన్సీ వాళ్ళ తప్పిదమంటారు. తప్పిదమని రైతులు రోడ్డెక్కిన నెల రోజులకు గుర్తించారా అని ప్రశ్నించారు. మీ తప్పిదం లేకపోతే.. వాళ్లదే తప్పిదం అయితే ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని రైతులకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

మొదటి రోజే మున్సిపల్ ముట్టడి సమయంలో ఈ విషయం చెప్పి ముసాయిదా డ్రాఫ్ట్ ను మారుస్తామని, ఇండస్ట్రియల్ జోన్ ను ప్రభుత్వ భూముల్లోకి మల్లిస్తామని ఎందుకు చెప్పలేకపోయారని నిలదీశారు. ఇప్పటికైనా మీ మాట నిలుపుకోవాలని, మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్టు తీర్మానించాలని డిమాండ్ చేశారు. రేపు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, ఇకపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రాణం పోయినా గుంట భూమి కూడా వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు.

రైతు ఉద్యమానికి ఆర్థిక సహాయం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి బాసటగా నిలిచారు. రైతుల ఉద్యమానికి అండగా ఉంటానని చెప్తూ ఉద్యమానికి ఆర్థిక చేయూత కోసం 50 వేల రూపాయలను రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులకు అందజేశారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి తాము అండగా ఉంటామని ప్రకటించారు.

రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న సుభాష్ రెడ్డి

Related posts

నాగర్ కర్నూల్ ప్రజలకు జిల్లా కలెక్టర్ దసరా శుభాకాంక్షలు

Satyam NEWS

ఉచితంగా రేష‌న్ ఇస్తున్న ప్ర‌భుత్వం మాదే

Satyam NEWS

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment