తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత విజయవంతమవుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన గ్రామాలను ప్రగతి బాట పట్టించే బృహత్తర పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమాన్ని దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో మంత్రి అల్లోల ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పల్లెల్లో పచ్చదనం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు నిబద్ధతతో, కార్యదీక్షతో పనిచేయాలని సూచించారు.
పల్లె ప్రగతిని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలోనాటిన మొక్కలను సంరక్షించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొన్ని చోట్ల నాటిన మొక్కలు ఎండిపోవడాన్ని చూసిన మంత్రి స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాటిన మొక్కలకు నీటి వసతి, రక్షణ వలయాలు, నర్సరీలను తెలిపే బోర్డులు, నర్సరీల నిర్వాహణ రిజిస్టర్లు సక్రమంగా ఉండాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై తగు చర్యలు తప్పావన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భాస్కరరావు, ఎంపిపి అమృత చిన్నారెడ్డి, సర్పంచ్ ఈ గంగారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు సుభాష్ రావు, మండల్ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, నాయకులు మురళీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.