34.7 C
Hyderabad
May 5, 2024 01: 39 AM
Slider ప్రత్యేకం

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య భవిష్యత్తుకు దిశ

#DEOnagarkurnool

నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటికే 254 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 22,187 మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్నారు. 11 మండలాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారే ఎక్కువగా ఉన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

అందుకే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాలి అని విద్యావేత్తలు అంటుంటారు. ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదువుకోవాలి. నానాటికీ విస్తరిస్తున్న పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలవాలి. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. ఈ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ  ప్రభుత్వ బడుల బలోపేతానికి చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్నీ అమలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రభుత్వ టీచర్లకు శిక్షణ తో పాటు అన్ని చర్యలు చేపట్టింది.

అన్ని వర్గాల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావుల నుంచి సానుకూల దృక్పథాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీ‘జులుం’ పోవాలి.. ప్రభుత్వ స్కూళ్లలో వందశాతం ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయాలి.. విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపే మళ్లాలి.. అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ చేపట్టే పని చేస్తున్నది.

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అనేకచోట్ల ఇంగ్లిష్‌ మీడియం అమలు జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని 20 మండలాల్లోని పాఠశాలల్లో 40 శాతం ఇంగ్లిష్‌ మీడియం అమలవుతున్నది. 2008 నుంచి 55 ఉన్నత పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం సక్సెస్‌ స్కూళ్ల గా పనిచేస్తున్నాయి.

తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం) విధానాన్ని అమలు చేస్తూ సక్సెస్‌ పాఠశాలలను కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 825 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 7, 8, 9, 10 తరగతులు మినహా మిగిలిన అన్ని తరగతుల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్న వారే ఎక్కువ అని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి యం.గోవిందరాజులు తెలిపారు.

సమస్యల లోగిళ్ల నుంచి ప్రభుత్వ బడులు క్రమంగా బయటపడుతున్నాయి. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుంది. దీంతో మూడేళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టి అందుకు తగిన వనరులు ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రుల ఆసక్తితో విద్యార్థులు ఇష్టంగా చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం తో పాటు ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రకటించడంతో ప్రభుత్వ బడుల బలోపేతానికి నాంది పలుకుతుంది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం..

ఉదాహరణకు తాడూర్ మండంలో 37 పాఠశాలలు ఉండగా ఇప్పటి 34 పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియం అమలవుతున్నది. కేవలం 3 పాఠశాలల్లోనే తెలుగు మీడియం, 3 ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో అమలవుతున్నాయి.

అదేవిధంగా నాగర్ కర్నూల్ మండలంలో 59 పాఠశాలలు ఉండగా 28 పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో జిల్లాలో ఇలా వెల్దండ, కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి, వంగూరు, ఉర్కొండ, కల్వకుర్తి, చారగొండ, అచంపేట్ మండలాల్లో ఈ చొప్పున జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 40శాతానికి పైగా ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్న వారే.

ఒక్క నాగర్ కర్నూలు, తాడూర్ 2 మండలాల్లోనే 6,637 మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్నారంటే ఆంగ్లానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించవచ్చు. జిల్లావ్యాప్తంగా ఉన్న 825 ప్రభుత్వ పాఠశాలల్లో 71,079 మంది విద్యార్థులు తెలుగు, ఆంగ్ల, ఉర్దూ 3 భాషల్లో చదువుతుంటే అందులో ఆంగ్ల మాధ్యమంలో అమలవుతున్న 254 పాఠశాలల్లో 2,21,87 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు.

ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివిస్తున్నా.. అలివేలు, విద్యార్థిని తల్లి, తాడూర్ మండలం, అల్లాపూర్

మా ఊర్లో అందరూ తాడూర్ కు పంపి ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నారని, మా పాప హేమలత తాడూర్ సిద్ధార్థ పాఠశాలలో యూకేజీ నుండి నాలుగో తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివించా. అల్లాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఉపాధ్యాయులు చదువులు నిర్వహిస్తున్నారని తెలుసుకొని హేమలత ను 5వ తరగతి, బాబు ను రెండో తరగతి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశాను. ప్రైవేట్ పాఠశాల కన్నా మంచిగా చదువు చెప్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఆర్థిక స్తోమత లేని మాలాంటి పేద తల్లిదండ్రులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ప్రైవేట్‌ పాఠశాలలో చదివించా. ఫీజులు, రవాణా ఇతర ఫీజులు చెల్లించే స్తోమత లేకపోయింది. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా పిల్లలిద్దర్నీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో  చదివిస్తున్నా.

పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే ఆంగ్లం తప్పనిసరి: జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు జే శ్రీనివాస్ రెడ్డి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో రాణించాలన్నా ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించాల్సిందే. ప్రతిభ కనబరచాలన్నా.. ఆంగ్లపై పట్టు ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాషలో అరితేరాల్సిందే. ఆంగ్లం రాకపోతే అవకాశాలు ఆమడ దూరంలోనే ఆగిపోతాయి. కార్పొరేట్‌ పాఠశాలల్లో సంపన్నుల పిల్లలకే పరిమితమైన ఆంగ్ల విద్యావకాశాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ బడుల విద్యార్థులకు దరిచేరనున్నది. ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో తరగతులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివి ఇంటర్‌లో ఒక్కసారిగా ఆంగ్లంలోకి మారి తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల భవిష్యత్‌ గురించి ప్రభుత్వం ఆలోచించింది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ బడులు మరింత బలోపేతం చెందుతాయి. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం.

ఆసక్తి ఉన్న మాధ్యమాల్లో  చదువుకోవచ్చు: నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి యం.గోవిందరాజులు

ఆధునిక కాలంలో ఏ రంగంలో రాణించాలన్నా ఆంగ్లంపై పట్టు ఉండడం అత్యంత అనివార్యం. పాఠశాల విద్యలోనే ఇందుకు బలమైన పునాది పడాలి. అందుకు అనుగుణంగానే ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమం పై శిక్షణ ఇస్తున్నాం.

జిల్లాలో ఆంగ్ల మాధ్యమం పటిష్టంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని విస్తృత అవకాశాలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అందిపుచ్చుకునే లా ఉండాలంటే ఇందుకు పాఠశాల విద్యే సరైన ఫౌండేషన్‌. తల్లిదండ్రుల అభీష్టం మేరకు ఏ మాధ్యమంలో చదివించాలన్న వారి ఆప్షన్ నిర్ణయాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇంగ్లీష్, తెలుగు 2 మాధ్యమాలతో ఒకవైపు తెలుగు మరోపుటలో ఆంగ్ల మాధ్యమంలో ఒకే పాఠ్యపుస్తకాలు ఉండేలా ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ముద్రింపు చర్యలు తీసుకుంది.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్  

Related posts

సంపదను సృష్టిద్దాం.. ప్రజలకు పంచుదాం

Bhavani

రైతుల అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు

Satyam NEWS

అంగన్ వాడి ద్వారా గర్భిణీలకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ…

Satyam NEWS

Leave a Comment