ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలు కానున్న సీనియర్ ఐ ఏ ఎస్ అధికారిణి నీలం సహానీ కేంద్రం నుంచి రిలీవ్ అయ్యారు. సంక్షేమ మంత్రిత్వ శాఖ నీలం సహానీ ని రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు మళ్లీ అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీకి కొత్త సీఎస్ గా ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై ప్రభుత్వం వేటు వేసిన నాటి నుంచి నీలం సహానీ పేరు వినిపిస్తూనే ఉంది. 1984 బ్యాచ్ కి చెందిన నీలం సహానీ గతంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో ఎంతో కీలక పదవులలో పని చేశారు. ఏ పనిని అప్పగించినా.. దానిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, సమర్థవంతంగా చేయడంలో నీలం సహానికి మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఆమెకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇప్పటికే జగన్ కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉండగా..ఇప్పుడు సీఎస్ పదవి కూడా మహిళా అధికారికే ఇవ్వబోతుండటం విశేషం.
previous post