లోక్ సభలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కేవలం తాము మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకున్నామని ప్రచారం చేసుకోవడానికే తప్ప, మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు మరో రెండు ఎన్నికల వరకు ఆగాల్సి వస్తుందన్నారు.
నిజంగా ప్రధాని మోడీ ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చిత్త శుద్ది ఉన్నట్లయితే , ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల క్రితమే ఆమోదింపజేసేదని, అలా కాకుండా ప్రస్తుత బిల్లును పరిశీలిస్తే మరో ఆరేళ్ళ వరకు అమలు కాని పరిస్థితి నెలకొన్నదని, మొత్తం 15 ఏళ్ళు ఆలస్యం చేసిందని విమర్శించారు. చట్ట సభలలో ఉన్న సీట్లలోనే మూడవ వంతు రిజర్వేషన్ అమలు చేస్తారే తప్ప, అదనంగా స్థానాలు పెంచే విధంగా బిల్లులో పొందుపర్చలేదన్నారు. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన, కొత్తగా జనాభా లెక్కల అవసరం లేకుండానే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మహిళలకు మూడవ వంతు రిజర్వేషన్ అమలు అయ్యేలా బిల్లులో మార్పు చేయాలని కూనంనేని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించడమే కాకుండా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నదని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత గీతా ముఖర్జీదే
ఏ పార్టీ ఎంత చెప్పుకున్నా మహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత సిపిఐ సీనియర్ పార్లమెంటేరియన్ గీతా ముఖర్జీకే దగ్గుతుందని కూనంనేని అన్నారు. ఆమె దేశవ్యాప్తంగా తిరుగుతూ మహిళా లోకాన్ని చట్టసభల్లో మూడవ వంతు రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టారని, చివరకు ఆమె నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ దీనిని రూపొందించి 1997లో ఆమోదానికి విశ్వప్రయత్నం చేసారని గుర్తు చేశారు.
ఆనాడు సిపిఐ భాగస్వామిగా, కేంద్ర హోం మంత్రిగా ఇంద్రజిత్ గుప్తా, వ్యవసాయ మంత్రిగా చతురానన్ మిశ్రాలు ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఈ ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. దురదృష్టవశాత్తు లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టలేకపోవడంతో ఆమె కన్నీటి పర్యంతం అయిన విషయం దేశం అంతటికీ తెలుసునని పేర్కొన్నారు. ఇప్పుడు చాలా పార్టీలు, నాయకులు మహిళా రిజర్వేషన్ బిల్లు తమ ఘనతే అని చెప్పుకుంటున్నారని, వాస్తవానికి ఆ ఘనత దక్కాల్సింది గీతా ముఖర్జీకేనని , ఈ బిల్లు ఆమోదం పొందడమే ఆమెకు అసలైన నివాళి అని అన్నారు.