28.7 C
Hyderabad
May 5, 2024 09: 56 AM
Slider జాతీయం

రాజకీయ నాయకుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న బిహారీ

#prashantkishore

ప్రస్తుతం దేశ రాజకీయాలలో ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాండే పేరు ప్రధాన ఆకర్షణీయ కేంద్రంగా వినిపిస్తోంది. ఒక్కసారి ఈ బీహారీ రాజకీయ వ్యూహాత్మక కార్యాచరణ వల్ల పలు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తీరు గమనిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

2012 గుజరాత్ ఎన్నికలతో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా రంగప్రవేశం చేశారు. ఆయన ఆలోచనలనుంచి పుట్టిన చాయ్ పే చర్చా, 3 డీ రాలీలు, సామాజిక మాధ్యమాలను సాధనాలుగా మార్చుకోవడం వంటి వినూత్న ప్రక్రియల సహకారంతో నరేంద్ర మోదీ గుజరాత్ ఎన్నికలలో విజయం సాధించారు. తరువాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికలలో కూడా భారతీయ జనతాపార్టీ గెలుపుకు ప్రశాంత్ కిశోర్ పన్నిన వ్యూహాలు ప్రముఖ పాత్ర వహించాయి.

అన్ని చోట్లా గెలిపించిన ప్రశాంత్ కిషోర్

ఆ తరువాత జరిగిన 2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో జేడీ (యూ)ను, 2017 పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ ను 2019 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో వై ఎస్ ఆర్ సీపీ ని, 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీని, 2021 పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ ను, 2021 తమిళ్ నాడు అసెంబ్లీ ఎన్నికలలో డీ ఎమ్ కే పార్టీని గెలిపించి  ప్రశాంత్ కిశోర్ దేశ  రాజకీయాలను ప్రభావితం చేశారు. ఒక్క 2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రమే ఈ వ్యూహకర్త మంత్రం పనిచేయక పోవడం పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది.

తాజాగా … ఆయన అత్యంత దీనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే బృహత్తర యత్నానికి  ఉపక్రమించడం విశేషం. ఒక్కో రాష్ట్రాన్ని చేజేతులా కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో చికిత్స అందించాలన్నదే పెద్ద ప్రశ్న.

వరుస ఓటమితో కూనారిల్లుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ లో అసమ్మతి వర్గం ఎప్పుడూ ఉంటుంది. అది ఆ పార్టీలోని హద్దులు లేని మితిమీరిన ప్రజాస్వామ్య లక్షణం. దానివల్ల పార్టీకి ఎక్కువనష్టం జరుగుతున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోక పోవడంతో కొందరు యువ నేతలు పార్టీని విడిచి పోతున్నారు. వరుస ఓటముల వల్ల ప్రజలకు దూరమవుతున్న వాస్తవాన్ని పార్టీ అగ్రనేతలు కూడా గుర్తించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇటువంటి నేపథ్యంలో … ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తే ఫలితాలు ఎలా ఉండగలవు అనేది ఇప్పుడే ఊహించడం సహేతుకం కాదు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో వరుసగా జరుగుతున్న భేటీలలో ఆయన పార్టీ మనుగడకోసం చాలా సూచనలు చేశారు.

ప్రచార మాధ్యమాలను బాగా వాడుకోవాలి

2024 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ సొంతంగా 370 స్థానాలలో పోటీ చేయాలని, మిగిలిన చోట్ల భావ స్వారూప్యత  ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు లకు సిద్ధపడాలని ఆయన  కాంగ్రెస్ అధిష్టానానికి వివరించారు. భాజపా ప్రచార ధోరణులకు దీటుగా సామాజిక మాధ్యమాలను, ఇతర ప్రచార సాధనాలను ఇప్పటినుంచే వినియోగించాలని ఆయన తెలిపారు.

ఒక వైపు భాజపా రాష్ట్రాలలో ఇప్పటికే బలమైన ప్రభుత్వాలను ఏర్పరచిన ఉత్సాహంతో 2024 ఎన్నికలలో ఏక పక్ష విజయసాధన లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా హిందుత్వ అజెండాను ముందుంచి ఎన్నికల రణ రంగానికి సమాయత్తం అవుతోంది. మరో వైపు… భాజపా వ్యతిరేక రాజకీయ పార్టీలు 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు అవసరమైన కూటమిగా ఏర్పడేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

శత్రువులతో కలవమంటున్న ప్రశాంత్ కిషోర్

అయితే…శివసేన వంటి పార్టీలు కాంగ్రెస్ లేకుండా ఐక్య కార్యాచరణ సాధ్యం కాదని అంటోంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెసు, తెరాస వంటి పార్టీలు కాంగ్రెస్ ను నమ్ముకోవడం అనవసరం అనే ఆలోచనతో ఉన్నారు. ఇదిలా ఉండగా… ప్రశాంత్ కిశోర్ మాత్రం తెరాస, తృణమూల్ కాంగ్రెస్, వై ఎస్ ఆర్ సీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చని కాంగ్రెస్ పార్టీకి సలహా ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నది ఆయన ఆంతర్యం అని విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలలో జంప్ జిలానీల విన్యాసాలు మొదలుకావడం సహజం. అటువంటివారిలో ఓటు బ్యాంక్ గణనీయంగా ఉన్నవారిని పసిగట్టి వారికి పార్టీలో ప్రాతినిధ్యం కల్పిస్తే కాంగ్రెస్ పుంజుకోవడానికి మార్గం దొరుకుతుందని పీకే సలహా ఇచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.

ఇటీవల ఒక జాతీయ స్థాయి మీడియాలో మాట్లాడుతూ… తాజాగా 4  రాష్ట్రాలలో బీజీపీ  సాధించిన విజయాన్ని 2024 సార్వత్రిక ఎన్నికలకు భావి సూచిక అనడం సహేతుకం కాదని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న వివాదాస్పద  రైతు వ్యతిరేక చట్టాలు వంటి అనేక అంశాలు ఎన్నికలలో ఫలితాలను శాసించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

స్థూలంగా ఆలోచిస్తే… ప్రశాంత్ కిశోర్ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? లేక భాజపా పై ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ తో కలిసి వెళ్లాల్సిన అవసరం ప్రశాంత్ కిశోర్ కి ఉన్నదా? అనే అంశంపై రాజకీయ విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం క్రితం ఆయనే మీడియాతో మాట్లాడుతూ … ప్రస్తుతం చేస్తున్న పని నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు అన్నారు. దీని వెనుక ఏదైనా కొత్త వ్యూహం పీకే మనసులో రూపు దిద్దు కుంటోందా అనే చిక్కు ముడి వీడాలంటే కాంగ్రెస్ తో ఆయన మొదలు పెట్టిన ప్రయాణం ఏ తీరాలకు దారి తీస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం నిరీక్షించక తప్పదు.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు

Related posts

తెలంగాణ తల్లి ప్రత్యేక రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీనే

Satyam NEWS

పెందుర్తి లో భారీగా పట్టుబడ్డ గంజాయి…

Bhavani

అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు

Satyam NEWS

Leave a Comment