మునిసిపల్ ఎన్నికలు పూర్తి కాగానే మళ్లీ కొల్లాపూర్ కోట చుట్టూ అక్రమ ఆక్రమణల సమస్య తెరపైకి వచ్చింది. కొల్లాపూర్ మునిసిపాలిటీ ఎన్నికలు ప్రధానంగా కొల్లాపూర్ కోట ప్రాంతం ఆక్రమణలపైనే జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆక్రమణలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గా ఉమ్మడిగా పోటీ చేసి మొత్తం 20 స్థానాలలో మెజారిటీ స్థానాలు 11 గెలుచుకుని సత్తా చాటింది.
ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో చైర్మన్ పీఠాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు తన్నుకుపోయినా కొల్లాపూర్ కోట విషయంలో మాత్రం తమ పోరాటం ఆగేది కాదని జూపల్లి వర్గీయులు అంటున్నారు. జూపల్లి వర్గానికి చెందిన 11 మంది కౌన్సిలర్లు కొల్లాపూర్ కోట ప్రాంతాన్ని కాపాడాలని కోరుతూ నేడు రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ కు ఒక లేఖ రాశారు. కొల్లాపూర్ కోట మూడు వైపులా తరచూ అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని వీటిని ఎన్ని సార్లు అడ్డుకున్నా ఆక్రమణదారులు మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారని వారు తమ లేఖలో పేర్కొన్నారు.
కొల్లాపూర్ పట్టణ ప్రజల అవసరార్థం ఉన్న కోట ప్రాంతం ఎంతో కీలకమైనదని, ఆ స్థలం లేకపోతే కొల్లాపూర్ లో పలు సమస్యలు తలెత్తుతాయని వారన్నారు. కొల్లాపూర్ గ్రామ పంచాయితీగా ఉన్నప్పుడు, మునిసిపాలిటీగా మారినప్పుడు కూడా కోటను సంబంధిత అధికారులు కాపాడారని అయితే గత ఏడాది నుంచి ఆక్రమణ దారులు బరితెగించి మరీ నిర్మాణాలు చేపడుతున్నారని కేటీఆర్ కు పంపిన లేఖలో వారు పేర్కొన్నారు.
ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సి కోట మూడు వైపుల ప్రాంతాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే పట్టణం ఇరుకుగా మారిపోతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని కూడా వారన్నారు. పురపాలక శాఖ మంత్రిగా కొల్లాపూర్ కోటను కాపాడాలని వారు కేటీఆర్ కు వినతి పత్రం పంపించారు.