27.7 C
Hyderabad
May 12, 2024 04: 05 AM
Slider ఖమ్మం

గ్రీవెన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత

#Grievance Day applications

గ్రీవెన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. ‘‘గ్రీవెన్స్‌ డే’’ ను పురస్కరించుకుని ఐడిఓసి లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశాలిస్తూ, ఆయా శాఖాధికారులకు కలెక్టర్ ఫార్వార్డ్ చేశారు.

ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం నుండి నల్లగట్ల నాగరాజు, తాను వికలాంగుడినని, ఆర్థికంగా చాలా బాధలో ఉన్నట్లు, తన పిల్లలు ఇద్దరికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం క్రింద అడ్మిషన్లు ఇప్పించగలందులకు కోరగా, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారిని పరిశీలనకై కలెక్టర్ ఆదేశించారు.

వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ పరిధిలోని త్రాగునీటి బోర్ ను ఒక వ్యక్తి ఆక్రమించి, మోటార్ ను ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని చర్యలకై కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని పరిశీలించి, తగుచర్య తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మధిర మండల కేంద్రం నుండి షేక్ గౌసుద్దీన్, తనకు వికలాంగుల కేటగిరీ ఆసరా పెన్షన్ వచ్చేదని, తన ఆధార్ కార్డ్ లింక్ చేసిన నాటి నుండి నిలిపివేశారని మంజూరుకు కోరగా, డీఆర్డీఓ ని విచారణ చేసి, తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తల్లాడ మండలం ముద్దునూరు గ్రామం నుండి ఇమ్మడి రామకృష్ణ, తాను గతంలో ఎంపిడబ్ల్యు గా పనిచేసేవాడినని, తనను అకారణంగా, సమాచారం ఇవ్వకుండా విధుల నుండి తొలగించారని, విధుల్లో తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని విచారణకై ఆదేశించారు.

తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామం నుండి సూదా నర్సింహారావు, తమ కుటుంబ సభ్యుల పేరా, సర్వే నెంబర్ 211అ/1 లో 0.35, 212 లో 1.16, 178 లో 2.04 ఎకరాలు పట్టాదారు పాస్ బుక్ కలిగియున్నామని, కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకొని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరగా, తల్లాడ తహసీల్దార్ ను తగుచర్యలకై కలెక్టర్ ఆదేశించారు.

కొనిజర్ల మండలం పెద్దగోపతి గ్రామ వ్యవసాయదారులు సర్వే నెం. 356, 357 లలో ఇర్రిగేషన్ అధికారులు రియల్ ఎస్టేట్ కు ఇచ్చిన ఎన్ఓసి ని రద్దు పరచాలని, స్లాబ్ కల్వర్ట్ నుండి సాఫీగా యధావిధిగా చెరువులోకి నీరు వెళ్లే విధంగా చేయాలని కోరగా, పరిశీలించి, తగుచర్యలు తీసుకోవాలని ఇర్రిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేలకొండపల్లి మండలం అనాసాగరం నుండి రాయపాటి నిశాంత్ తనకు గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసి సీటు ఇప్పించగలందులకు కోరగా, గురుకులాల ఆర్సీవోను పరిశీలించి తగుచర్యలకై కలెక్టర్ ఆదేశించారు.

కొనిజర్ల మండలం మల్లుపల్లి నుండి గుగులోతు నర్సింహారావు, తాను 7 సంవత్సరాల నుండి అడవి భూమిని సాగు చేసుకుంటున్నట్లు, ఆర్వోఎఫార్ క్రింద దరఖాస్తు చేసుకున్నట్లు, పట్టా ఇప్పించాలని కోరగా, జిల్లా అటవీ అధికారిని విచారించవలసినదిగా కలెక్టర్ ఆదేశించారు.

చింతకాని మండలం కొడుమూరు నుండి ఎన్. తిరవయ్య, తాను దళితబంధు క్రింద రూ. 5 లక్షలతో ఫోటో కెమెరా తీసుకున్నట్లు, మిగతా రూ. 5 లక్షలు రెండో విడత మంజూరుకు కోరగా, ఇడి, ఎస్సి కార్పొరేషన్ కు తగుచర్యలకై కలెక్టర్ ఆదేశించారు. మధిర మండలం మాటూరుపేట గ్రామ రైతులు, వర్షపు నీరు క్రిందకు వెళ్లక, భూములు చెరువుల్లా తయారు అయ్యాయని, పైన కట్టలను తొలగించి, వర్షపు నీరు క్రిందకు వెళ్లేలా చేయాలని కోరగా, ఇర్రిగేషన్ అధికారులు పరిశీలించి, తగుచర్య తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

కొనిజర్ల మండలం చిన్న మునగాల నుండి పాపగంటి బజారు, తాను గత 4 సంవత్సరాల క్రింద నిర్మించుకున్న రేకులషెడ్డు కు జీవో 58, 59 క్రింద దరఖాస్తు చేసుకున్నట్లు, ఇంటి నెంబర్, నీటి కనెక్షన్ ఇప్పించుటకు కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని తగుచర్యలకై ఆదేశించారు. నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి గ్రామం నుండి జిడుగు సాంబశివరావు, తనకు సర్వే నెం. 214/1/2/2, 215/ఇ/1/1 లో పాస్ బుక్ లో ఇనాం అని వస్తే, ధరణి ద్వారా క్లియర్ చేసుకున్నట్లు, తర్వాత బ్యాంక్ లోన్ కొరకు దరఖాస్తు చేయగా, నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుందని తగుచర్యకై కోరగా, ధరణి సూపరింటెండెంట్ పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

Related posts

సింహాద్రి అప్పన్న కే శఠగోపం పెట్టిన భక్తుడు

Bhavani

సర్పంచ్ లు ఇక విద్యుత్ బిల్లులు చెల్లించవద్దు

Satyam NEWS

ఘనంగా హోలీ సంబురాలు

Murali Krishna

Leave a Comment