23.2 C
Hyderabad
May 7, 2024 23: 27 PM
Slider సినిమా

తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన రావి కొండలరావు

#Raavi Kondalarao

మనల్నందరినీ సైలెన్స్ అంటూ… సైలెంట్ గా తిరిగిరాని లోకాలకు రావి కొండలరావు వెళ్లిపోయారు … 20 ఏళ్ళ క్రితం ఆయనతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఏర్పడింది. ఇద్దరం కలిసి చాలా రోజులు దగ్గరగా పనిచేసే అవకాశం వచ్చింది. గురజాడ అప్పారావుగారి సుప్రసిద్ధ  నాటకం కన్యాశుల్కం బుల్లితెరకెక్కించే సందర్భం అది.

నాకు ఆత్మీయులైన వ్యక్తి దీనికి నిర్మాత. రావికొండలరావుగారు దర్శకత్వం. గొల్లపూడి మారుతిరావు గిరీశం. జయలలిత మధురవాణి. పీసపాటి నరసింహమూర్తి లుబ్ధావధానులు. ఇలా చాలా స్టారింగ్ ఉంది. ఈ సీరియల్ నిర్మాణం ముందు నుండి ఇంకో నిర్మాతకు అమ్మేవరకూ  ముఖ్యమైన దశల్లో నేను ఉన్నాను. కన్యాశుల్కం మాటీవీలో టెలికాస్ట్ అయ్యింది. నంది అవార్డులు వచ్చాయి.

డబ్బులు ఖర్చు పెట్టిన నిర్మాత చాలా వరకూ సేఫ్ గానే బయటపడ్డాడు. ఈ నిర్మాణ సందర్భంలో ప్రతి రోజూ కొన్ని గంటలపాటు ఆయన్ను చూస్తూ, వింటూ, పరిశీలీస్తూ ఉండేవాడిని. సినిమాలకు సంబంధించిన తెరవెనక భాగోతాలు బోలెడు చెప్పేవారు. అవ్వన్నీ కలిపితే, పెద్ద పుస్తకం అవుతుంది. ఎంతో క్రమశిక్షణగా ఉండేవారు. జోకులు వేస్తుంటారు కానీ కొంచెం strict టైపే. అప్పుడు నాకు 32ఏళ్ళు ఉంటాయి.

నేనేమో యమా స్పీడ్.

ఆయనేమో వయస్సులో, అన్నింటా పెద్దవారు.నాకు  సహనం ప్రాక్టీస్ కొంచెం అక్కడే మొదలైంది. ఆప్యాయంగా పలకరించేవారు. మళ్ళీ, సైలెన్స్!అన్నట్లుగా ఉండేవారు. ఈ కన్యాశుల్కం నిర్మాణం దశలోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, మాధవపెద్ది సురేష్ గారు నాకు పరిచయమయ్యారు. ఆ స్నేహం దిన దిన ప్రవర్ధమానమై ఇప్పటికీ పచ్చగా పదిలంగా ఉంది.

ఈ సీరియల్ కు టైటిల్ సాంగ్ ఉండాలి అని రావి కొండలరావుగారు ప్లాన్ చేశారు. మిత్రుడు రాంభట్ల గీత రచన. మాధవపెద్దిగారి స్వర రచన. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు గానం. ఆ సీరియల్ ఎలా ఉన్నా, నాకేమో పాటలపిచ్చి కదా!! వీరందరితో బాగా కనెక్ట్ అయిపోయాను. ఈ పాటకు నంది అవార్డు వచ్చింది.

తెలుగు కథకు శ్రీకారం.. మెరిసే ముత్యాలసరం.. అక్షరాల అడుగుజాడ.. అతడే మన గురజాడ… ఇదీ పల్లవి. అద్భుతంగా వచ్చింది.అప్పటి నుండి రావి కొండలరావుగారికి నాకు మంచి అనుబంధం ఏర్పడింది. వయస్సులో చిన్నవారిని కూడా మీరే అని పిలుస్తారు.

ఏకవచన ప్రయోగం తక్కువ. బాపు రమణ, గుమ్మడి, ఆరుద్ర వీళ్ళందిరికీ రావి కొండలరావుగారంటే చాలా ఇష్టం. వి ఎ కె రంగారావుగారికి కూడా ఎంతో ఇష్టం. జీవితాంతం క్యారెక్టర్ రోల్స్ మాత్రమే వేశారు.క్యారెక్టర్ ఉన్న మనిషి కూడా.సింపుల్ లివింగ్. చందమామవారి విజయచిత్ర పత్రికకు చాలా కాలం సంపాదకులుగా పనిచేశారు.

నటుడు, ప్రయోక్త, దర్శకుడు, సినిమా పాత్రికేయుడు, కాలమిస్ట్. సితారలో వచ్చే వారి కాలమ్స్ ను మిస్ అవకుండా చదివేవాడ్ని. ప్రఖ్యాత జర్నలిస్ట్, సంపాదకులు కె.రామచంద్రమూర్తిగారు ఎన్టీఆర్ పై ఒక పుస్తకం రాస్తున్నారు. అందులో భాగంగా, ఇద్దరం రావి కొండలరావుగారి దగ్గరకు వెళ్లి చాలా విషయాలు రికార్డు చేసుకొని వచ్చాం.

చివరిగా కలిసింది తెలకపల్లి రవిగారి పుస్తకం ఆవిష్కరణ సభలో. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చిన సభ అది. 90కి దగ్గరలో ఉన్నారు. అయినా ఎంతో యాక్టీవ్ గా ఉన్నారే. జ్ఞాపకశక్తి తగ్గలేదు. చాదస్తం రాలేదు అనుకున్నా. షుగర్ ఉన్నప్పటికీ పెద్దగా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు.

ఆ మధ్య వారి సతీమణి రాధాకుమారిగారు కూడా వెళ్లిపోయారు. ఇంకా చాలా కాలం ఉంటారనుకున్నాం. అయ్యో! సడన్ గా వెళ్లిపోయారే!!  అక్కడకు వెళ్లి పాత మిత్రులనందరినీ standup on the bench అంటారేమో… ఒక సీనియర్, సిన్సియర్ నటుడు తెలుగు తెరపై నుండి కనుమరుగయ్యారు.

కథాకథన శిల్పం తెలిసిన ఒక రచయిత కలం  ఆగిపోయింది. ఒక పాత్రికేయుడు సైలెంట్ అయిపోయాడు.భావి చరిత్రలో గురుతు పెట్టుకోవాల్సిన రావి కొండలరావుగారికి అక్షరాంజలి సమర్పిస్తూ

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

నెక్స్ట్ జెన్: తెలుగుదేశం పార్టీ యువ నేతలకు లోకేశ్‌ విందు

Satyam NEWS

కొమర శంకర నారాయణ ను స్మరించుకున్న శ్రీకాకుళం

Satyam NEWS

బాలిక అని కూడా చూడకుండా పైశాచికత్వం

Satyam NEWS

Leave a Comment