29.7 C
Hyderabad
May 4, 2024 06: 00 AM
Slider ప్రత్యేకం

వివేక హత్య సాక్ష్యాలను మాయం చేసింది అవినాష్ రెడ్డే

#raghurama

మాజీమంత్రి  వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఈ ఇద్దరి అరెస్టుతోనే ఆగకపోవచ్చు. విచారణ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈనెల 30వ తేదీ లోగా విచారణ పూర్తి చేస్తారా?, ఇంకా కొంచెం సమయం అడుగుతారా?? అన్నది తేలాల్సి ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. వైఎస్ వివేక హత్య కోసం హత్యలో పాల్గొన్న వారికి ఇచ్చిన నాలుగు కోట్ల రూపాయల లావా దేవీల, 40 కోట్ల డీల్  వివరాలు తమ వద్ద ఉన్నాయని సిబిఐ చెప్పింది.

నాలుగు కోట్ల లావాదేవీల వివరాలు బయటకొస్తాయనే సాక్షి యాజమాన్యం గజ, గజ లాడిపోతోందని అన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సిబిఐ తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఏ న్యాయమూర్తి కూడా  స్టే ఇవ్వరని తెలిపారు. మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు సిబిఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావాలి. ఆయన అరెస్టు ఖాయం.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక విమానంలో  వచ్చిన విజయ్ కుమార్ కూడా  ఏమి  చేయలేరు. న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుంది. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ చెప్పిన తర్వాత,  న్యాయస్థానంలో తీర్పు వెలువడం ఆలస్యం కావచ్చు కానీ ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

విస్తృత కుట్ర కోణం …

వైఎస్ వివేక హంతకులకు ఇచ్చిన డబ్బులు ఏ బ్యాంకు నుంచి డ్రా చేశారో తెలిస్తే, విస్తృత కుట్ర కోణం వెలుగులోకి వస్తుందని  రఘురామకృష్ణం రాజు అన్నారు. వాచ్మెన్  రంగయ్య ఇచ్చిన వాంగ్మూలాన్ని పట్టించుకోలేదని సాక్షి దినపత్రికలో రాయడం  విస్మయాన్ని కలిగించింది. వాచ్మెన్ రంగయ్య  తాను ముగ్గురు వ్యక్తులను గుర్తుపట్టానని అందులో గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్ ఉన్నారని వారి పేర్లను చెప్పి, ఒక వ్యక్తి పొడుగ్గా, సన్నగా ఉన్నాడని పేర్కొ న్నారు. సన్నగా పొడుగ్గా ఉన్న వ్యక్తిని  అవినాష్ రెడ్డి అని సిబిఐ ఏమీ భ్రమ పడలేదు.

సన్నగా పొడుగ్గా ఉన్న వ్యక్తి  జయప్రకాశ్ రెడ్డి అని తేల్చారు. ఆ ముగ్గురి కంటే సన్నగా పొడుగ్గా ఉన్న వ్యక్తి అతనే. రంగయ్య వాంగ్మూలాన్ని పట్టించుకోలేదని సాక్షి దినపత్రికలు రాస్తే, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయడం సిగ్గుచేటు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. తనలాగే ఎంతో మంది ఇది ఒక మంచి పార్టీ అని నమ్మి వచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి మంచివాడు కాదని, కనిపించిన ఆడవారితో సంబంధాలు పెట్టుకునే రకం అని రాస్తారా?, అసలు బుద్ధుందా?,  సిగ్గుందా??.

70 ఏళ్ల వయసులో రెండు స్టెంట్లు పడిన, పైల్స్ కలిగిన వ్యక్తి లో కనిపించిన ప్రతి మహిళతోనూ లైంగిక సంబంధం పెట్టుకునే సామర్థ్యం ఉంటుందా? సాక్షి ప్రస్తుత యాజమాన్యానికి వైఎస్ కుటుంబం అంటే  అంత కోపమా?, మంగమ్మ కుటుంబం అంటే  అంత కోపం ఎందుకు?, మంగమ్మ, లచ్చమ్మ కుటుంబానికి పడకపోతే, పడకపోవచ్చు. కానీ వెంకటరెడ్డి రెండవ భార్య  మంగమ్మ కుటుంబ సభ్యులను ఇంతలా అవమానిస్తారా? అంటూ రఘురామకృష్ణం రాజు ఫైరయ్యారు. వైఎస్ వివేక హత్య కేసులో  వైయస్ భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు  సాక్షాధారాలు ఉన్న కారణంగానే  ఆయన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో సాక్షాధారాలను  అవినాష్ రెడ్డి తారుమారు చేసినట్లు  పక్కా ఆధారాలు ఉన్నాయని సిబిఐ పేర్కొందని ఆయన తెలిపారు.

సాక్షి దినపత్రిక వేరు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరని  ఎవరు అనుకోవడం లేదని  రఘురామకృష్ణం రాజు తెలిపారు. వివేక హత్య కేసులో తనకు వ్యతిరేకంగా సిబిఐ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొనడం హస్యాస్పదంగా ఉంది. సిబిఐ వద్ద ఆధారాలు లేవని  అవినాష్ రెడ్డికి ఎలా తెలుసు. సాక్ష్యాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారు?. రాష్ట్ర సిఐడి లాగా  ఆధారాలు లేకపోయినా ఎవరిని పడితే వారిని సిబిఐ అధికారు  అరెస్టు చేయరు. వైయస్ వివేకాను హత్య చేసిన వారిని తొలుత అరెస్టు చేసిన సిబిఐ అధికారులు, ఇప్పుడు సూత్రధారులను అరెస్టు చేసే పనిలో ఉన్నారు. సూత్రధారుల వరకు వచ్చేసరికి  సాక్షి దినపత్రికలో అడ్డగోలు రాతలు రాయడం మొదలుపెట్టింది . విచారణ తమ దగ్గరకు వస్తుందని భయమా?, ఈ హత్య కేసుతో మీకేమైనా సంబంధం ఉందా?, అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

అసలు సూత్రధారులు వీరేనని ప్రజల అనుమానం

సాక్షి దినపత్రిక కథనాలు, శృంగార వర్ణనలను చూస్తుంటే, అసలు సూత్రధారులు వీళ్లేనా అని అనుమానం ప్రజల్లో కలుగుతుంది. సాక్షి దినపత్రిక కథనాలను చూస్తుంటే, ప్రజల అనుమానం కూడా  నిజమేనేమో అనిపిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు  వినూత్న పంథా ను అనుసరిస్తున్నారు. మార్గదర్శి సంస్థ ఎటువంటి తప్పు చేయలేదని మాట్లాడి చార్టెడ్ అకౌంటెంట్లను  ఏ చట్టం ప్రకారం అరెస్టు చేశారు. మార్గదర్శి సంస్థకు అనుకూలంగా మాట్లాడి వారిని విచారణకు పిలుస్తున్నామని బెదిరిస్తున్నారు.

వైఎస్ వివేక హత్యపై అడ్డగోలు కథనాలు రాస్తున్న  సాక్షి దినపత్రిక యాజమాన్యానికి సిబిఐ అధికారులు నోటీసులు ఇస్తే, ఏపీ సిఐడి పోలీసులకు బుద్ధి వస్తుందేమో.  వైయస్ వివేక హత్య కేసులో తండ్రి, కొడుకుల అరెస్టు తరువాత సిబిఐ అధికారులు సాక్షి యజమానిని పిలుస్తారేమో. సిబిఐ దర్యాప్తు అసమగ్రంగా ఉందని, అందుకే దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు మార్చిందని  సాక్షి దినపత్రిక తప్పుడు కథనాన్ని రాసింది. వైఎస్ వివేక హత్య కేసు విచారణ అధికారిగా రామ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసు విచారణ వేగం పుంజుకుంది.

దీనితో, రామ్ సింగ్ కు వ్యతిరేకంగా  గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి చేత  పిటిషన్ వేయించి, ఆయనపై కేసు నమోదు చేసి  విచారణ జ్యాప్యానికి కారణమయ్యారు. ఆరు నెలల పాటు కేసు విచారణలో పురోగతి కనిపించకపోవడంతో డాక్టర్ వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల, సుప్రీంకోర్టు ఆదేశాలతో  తెలంగాణ హైకోర్టుకు విచారణను  మార్చడం జరిగిందని రఘు రామకృష్ణంరాజు తెలిపారు.

వైయస్ వివేక హత్య కేసు పై  ప్రతిపక్ష నేత హోదాలో  సిబిఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబిఐ  విచారణ అక్కరలేదని పేర్కొన్నారు. రాష్ట్ర సిఐడి పోలీసులు  అర్ధరాత్రి కళ్యాణి ని అరెస్టు చేయవచ్చు కానీ, తెల్లవారుజామునే  భాస్కర్ రెడ్డి ని సిబిఐ  అరెస్ట్ చేస్తే సాక్షి దినపత్రికలో చెత్త రాతలు రాస్తారా?., సాక్షిలో రాసిన రాతలను పార్టీ అధికారిక వెబ్సైట్లో  పెడుతున్నారు. సాక్షి దినపత్రిక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కరపత్రము అని మరోసారి రుజువయ్యిందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఆధారాలు ఉన్నాయంటే  సాక్షిని ఉంచుతారో ..చంపుతారో?

విచారణ జరుగుతుండగా ఏ ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థను అడగడానికి వీలులేదు. అయినా వివరాలను రాబట్టేందుకు, దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలమే సిబిఐ అధికారుల వద్ద ఉందని  అంటున్నారు. తమ వద్ద పలానా ఆధారాలు ఉన్నాయని  దర్యాప్తు సంస్థ పేర్కొంటే, ఆ ఆధారాలకు సంబంధించిన సాక్షిని సజీవంగా ఉంచుతారో చంపుతారో తెలియదని రఘురామకృష్ణంరాజు  అన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో నిందితులను అరెస్టు చేసిన తర్వాత  రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు సంస్థ వివరాలను వెల్లడిస్తుంది.

వీళ్లు అత్యుత్సాహం కొద్దీ అడుగుతున్నా, తగుదునమ్మా అంటూ న్యాయమూర్తి కూడా  వివరాలు చెప్పండి అనడం సరికాదన్నారు. గతంలో వివరాలను న్యాయమూర్తి లక్ష్మణ్  సీల్డ్ కవర్లో అడిగారని, ఆయన చూసుకున్న తర్వాత తీర్పును ఇచ్చారు. ఇప్పుడు కేసు ఆయన  కాకుండా మరొక న్యాయమూర్తి విచారిస్తున్నారు. తాను ఎంతోమంది రిటైర్డ్ న్యాయమూర్తులతో మాట్లాడాను. ఈనెల 30వ తేదీ లోపు  కేసు విచారణను పూర్తి చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఇప్పటికే కేసులు వేసి విచారణను ఆలస్యం చేస్తున్నారన్న  అభియోగాలు ఉండడంతో, ఈ కేసులో స్టే ఇస్తానంటే, ఏపీ హైకోర్టులో ఏమయిందో… అదే ఇక్కడ రిపీట్ అవుతుందని  తెలిపారు.

ఆ జీవోను ఉపసంహరించుకుంటే మంచిది

ప్రభుత్వ సొమ్ముతో నాలుగు లక్షల సాక్షి దినపత్రిక ప్రతులను విక్రయించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ను తక్షణమే ఉపసంహరించుకుంటే  మంచిది. లేకపోతే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో పై  ఉషోదయ పబ్లికేషన్స్  రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచడంతో, ఉషోదయ పబ్లికేషన్ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది.

సుప్రీం కోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుంటూ, కేసును ఢిల్లీ హైకోర్టుకు  బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇవ్వడం లేదు అంటే, ప్రధాన న్యాయమూర్తి బిజీ  గా ఉండి ఉంటారని, మీరు అర్జెంటుగా కేసును తేల్చేయమని కోరడం భావ్యం కాదని  ధర్మాసనం  చమత్కర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ హైకోర్టు మద్యంతర స్టే ఇచ్చే లోపు గానే రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో  ను వెనక్కి తీసుకుంటే మంచిదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.  ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, వాదనలు విని గత నాలుగు నెలలుగా తీర్పు రిజర్వులో ఉంచడం వల్ల, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈనెల 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో  కేసు లిస్ట్ కావడం శుభపరిణామం.   ఈలోగానే ప్రాథమిక హక్కుల పరిరక్షణకు హైకోర్టు  చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ప్రాథమిక హక్కులను కోర్టులు పరిరక్షించకపోతే, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచడం ఎందుకు?. ప్రాథమిక హక్కులను ఏ కోర్టులోనూ కొట్టి వేసిన దాఖలాలు లేవు కాబట్టే   గత నాలుగు నెలలుగా తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరిగి ఉంటుందని ప్రజల భావన. ప్రజల భావనను  న్యాయమూర్తులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చిక్కటి జీవో నెంబర్ 1  ఇచ్చిందని ఏ న్యాయస్థానము అనదన్నారు.

Related posts

కాలనీలలో ఎలాంటి సమస్యలున్నా సత్వరమే పరిష్కరిస్తా

Satyam NEWS

విద్యార్థుల ముందే డీఈఓ ను కడిగిపారేసిన ప్రవీణ్ ప్రకాష్

Satyam NEWS

సిఎం శివసేనకు ముఖ్యపదవులు మిత్రులకు

Satyam NEWS

Leave a Comment