27.7 C
Hyderabad
May 12, 2024 04: 00 AM
Slider కవి ప్రపంచం

కటీ పతంగ్

#K.Haranath New Photo

ఆకాశంలో

గాలిపటాల కొలాహలాలు

కరువై ‘కరోనా’ గగన తలాన్ని

కాటేసినట్లు

నగరాకాశం

ఎలా వెల వెల బోయిందో చూడు –

చేతి వేళ్ళను

‘మాంజా’తో కఠినంగా

కోసేసినట్లు ‘సులేమాన్’ పతంగ్ ధర

మొండిగా

ఆకాశానికంటుకుని

ఎలా వెక్కిరిస్తుందో చూడు –

వృక్షజాతుల్ని కూల్చే

దుష్టఖడ్గ శక్తుల ధాటికి

తట్టుకోలేక

‘చరఖా’

ఎలా చిక్కిపోయిందో చూడు –

ఎక్కడో

మిణుగురు పురుగుల్లా

 ‘కాగితం’ కరువై

ఆకాశంలో

ఎగరలేక ఎగురుతూ

‘పట్టీదార్’ పతంగ్ ఎన్ని పల్టీలు కొడుతుందో చూడు-

పదవీ వ్యామోహాల

పాకులాటలో

‘పావు’లై

అధికారులు పాకులాడినట్లు

తెగిన గాలిపటాన్ని చుట్టుకునే

దురాశతో

‘తార పతంగ్’ ఎలా

తాపత్రయపడుతుందో చూడు –

డూడూ బసవన్నల

మువ్వల సవ్వడులు వినబడక

గజానికో రాజకీయాన్ని

సృష్టించే

పరాన్న భుక్కుల

పట్టాభిషేక

సన్నాయి

చప్పుళ్ళేలా

చెవుల్ని

తూట్లు పొడుస్తున్నాయో చూడు –

అలనాటి హరిదాసుల

చిడతల చప్పుళ్ళు

మచ్చుకైనా వినబడక

క్షణ క్షణం

విషవాయువుల్ని కక్కుతూ

వాహనాల

రణ గణ ధ్వనులతో

నగరం ఎలా వెలవెలబోయిందో చూడు –

‘గోధూళి’ కరువై

గోడకున్న పిడకలే

గొబ్బిళ్ళై

రాయి ముగ్గులో

కల్తీ పిండి కలిసి

ముంగిళ్ళలో

రంగవల్లులెలా

ముడుచుకు పోయాయో చూడు –

చివరికి

సంక్రాంతి ‘లక్ష్మి’ని సైతం

ఒమిక్రాన్ మింగేసినట్లు

సామాన్యుణ్ణి పోటుపొడిచే

మహానగరం

దారం తెగిన గాలిపటం

నిజంగా ఈ నగరం

‘ ఒక ‘కటీపతంగ్

కె.హరనాథ్, 9703542598

Related posts

మూసి ఉన్న స్కూలుకు ముఖ్యఅతిధి

Satyam NEWS

నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే అనిల్ ఔట్ ?

Bhavani

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘సుందరాంగుడు’ టైటిల్ సాంగ్ రిలీజ్

Bhavani

Leave a Comment