27.7 C
Hyderabad
May 11, 2024 08: 03 AM
కవి ప్రపంచం

స్వేచ్ఛాగీతం

#Chokkapu Laxmunaidu

ఈ మట్టిపై మూడు రంగుల పావురం ఎగురుతున్నపుడల్లా

రెక్కల చప్పుడులోంచి స్వేచ్ఛాగీతమొకటి జన్మిస్తుంది.

బడలిన పగటిదేహంపై సాయంత్రపు పరిమళాన్ని వెదజల్లి

సమస్త దుఃఖాన్ని వెన్నలా కరిగించే వెన్నెలరాత్రిలా విప్పారుతుంది.

శృతిజ్ఞానం అసలే తెలియని మా అమ్మ పాటంత అందంగా ఉంటుందది!

మనోవల్మీకపు అనంత లోతుల్లో నిద్రాణమైన చైతన్యం ..

పాట స్పర్శకు పులకించి దిగ్గున మేల్కొంటుంది!

ఐకమత్యం చీలికలవుతున్న ప్రతిసారీ.. పాట

శాంతి గీతమై సంధి మార్గం నిర్దేశిస్తుంది.

ఆలపించబడుతున్న ఆ అమర గానాన్ని శ్రద్దగా ఆలకిస్తే..

సన్నని సరిహద్దు రేఖపై నిలబడి,

సర్వావస్థల్లో ..నన్ను, నా భరత కుటుంబాన్ని

కంటికి రెప్పలా కాపుకాస్తున్న నా సైనిక సోదరుడు

శతృదేశం పై పూరించిన శంఖారావం లా విన్పిస్తోంది.

మంగళకరమైన ఆ పాట ప్రవాహం లోంచి

కోట్ల జీవితాల జీవాత్మ తొణికిసలాడుతుంది.

జన గణ మన….అని మొదలౌతున్నపుడు..

నా దేశం, రొమ్ము విరిచి నిటారుగా నిలబడుతుంది.

పిడికిలి బిగిసిన జయహే నినాదం తో…

జాతి గుండె నిండిన కలల గీతం గా విశ్వవ్యాప్త మౌతున్నపుడు..

విను వీధుల్లో ధర్మచక్రధారియై మూడురంగులపతాకం

శాంతి చిహ్నమై సగర్వంగా రెపరెపలాడుతున్న దృశ్యం..

మనోఫలకం పై అతి సుందరంగా ఆవిష్కృతమౌతుంది.

చొక్కాపు లక్ష్మునాయుడు, గజపతినగరం, విజయనగరం జిల్లా, 9573250528

Related posts

ప్రశ్నించుకో

Satyam NEWS

ఆర్ధిక యోధుడు

Satyam NEWS

మేరు కరుణ ధీరణి

Satyam NEWS

Leave a Comment