దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయిని అయిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐ డి వి ప్రసాదరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ దేశంలోని నిమ్న వర్గాలకు అద్వితీయమైన సేవలు అందించిన వారిలో సావిత్రిబాయి ఒకరని అన్నారు. మహిళలకు సమాజంలో సముచిత స్థానం కల్పించేందుకు ఆమె జీవితాంతం కృషి చేశారని ఆయన వివరించారు. ముఖ్యంగా మహిళలకు విద్య అవసరమనే విషయాన్ని ఆమె విస్తృతంగా ప్రచారం చేశారని ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో పని చేస్తున్న సాంఘిక శాస్త్రం టీచర్ బి ఏ వి అరుంధతి దేవిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కె. శ్రీహరి, బి. ప్రభాకరరావు, బి అప్పారావు, బి అర్పుల నాయుడు, పి వసంతరావు, ఆర్ సతీష్ రాయుడు, జి వినయ్, సి ఆర్ పి పి మోహన్ రావు, టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.