33.2 C
Hyderabad
May 14, 2024 11: 56 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు….

#Shri Soumyanadha

భారత ప్రాచీన సంస్కృతికని ప్రతిబింబిస్తూ చారిత్రకవికాశానికి నిదర్శనంగా నిలిచి హరిహరుల ఒకేచోట నిలిచి వెయ్యి సంవత్స రాల పుణ్యక్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు గడించిన ఆలయం

శ్రీవేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటిగా ‘నందలూరు’ వెలుగొందుతోంది. తిరుమల శ్రీనివాసుడు కటి హస్తంతో దర్శనమిస్తే, ఇక్కడి స్వామి అభయ హస్తంతో కనిపిస్తాడు. ఈ తేడా మినహా ఈ రెండు ధృవమూర్తులు ఒకేలా అనిపిస్తుంటాయి.

నారద మహర్షిచే ప్రతిష్టించబడి.సంతాన సౌమ్యనాథుడిగా, వీసాల సౌమ్యనాథుడిగా,కలియుగ దైవంగా విరాజిల్లుతున్న సౌమ్యనాథ స్వామి అన్నమయ్య జిల్లాలోని నందలూరులో వెలిశాడు. ఒక్కసారి దర్శిస్తేనే కలలో దర్శనమిచ్చే సౌమ్యనాథుడు.కోరిక కోర్కెలు తీర్చే దైవంగా, ఇంటి ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు.

బహుద తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం ప్రత్యేకత సూర్యకాంతి లేకుండా సౌమ్యనాథస్వామి దేదీప్యమానంగా ప్రకాశిం చడం అద్బుతంగా చెప్పవచ్చు.

11వ శతాబ్దంలో చోళవంశ రాజులచేత నిర్మించబడ్డ సౌమ్యనాథ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడు తుంటుంది. జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విశేషంగా తరలివస్తుంటారు.

ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పురాతన దేవాలయాల్లో ఒకటిగా వెలుగొందుతున్న సౌమ్యనాథ స్వామి ఆలయం.నాటి శతాబ్దాల ఘన వైభవాన్ని దశదిశలా వ్యాపింపజేస్తోంది. అభయ హస్తీశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చే సౌమ్యనాథ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూల విరాట్టుకు ఏ మాత్రం తీసిపోని విధంగా స్వామివారి మూలవిరాట్టు రూపుదిద్దుకుంది.

అన్నమయ్య గీతాలాపన..

ఆ రోజుల్లో అన్నమయ్య సౌమ్యనాథుడి ఆలయాన్ని దర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిపై శృంగార కీర్తనలు ఆలాపించి, రచించినట్లు పలు ఆధారాలున్నాయి. ఇక.. సౌమ్యనాథుడు అంటే సౌమ్యకే (లక్ష్మీదేవి) నాథుడనీ, ప్రశాంత స్వరూపుడనీ అర్థం…

ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి ప్రతీక. 11వ శతాబ్దపు పూర్వా ర్థంలో చోళరాజులు నిర్మించి స్వామివారికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాల్లో లిఖించబడి ఉంది. అప్పటి నుండి చోళపాండ్య కాకతీయ మట్లి మున్నగురాజులు 17వ శతాబ్దం వరకు దశలవారీగా ఆలయనిర్మాణం చేపట్టి పలు రాజుల పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధికెక్కింది.

12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి నందలూరు,ఆడపూరు, మందరం, మన్నూరు, హస్త వరం అయిదు గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. అయితే బ్రిటీష్ పాలన తర్వాత దేవాలయాలకు శిస్తును నిలిపివేశారనీ, ఆ తరువాత మద్రాస్ గవర్నర్ లార్డ్ మన్రో శిస్తులివ్వటాన్ని పునరుద్ధరించాడనీ చరిత్ర చెబుతోంది.

అన్నమయ్య జన్మస్థానమైన తాళ్ళపాక గ్రామం నందలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి, ఆ గ్రామానికి మధ్యలో బాహుదా నది గతంలో గలగలా పారుతూ ప్రవహిస్తుండేదని తెలుస్తోంది. ఆ రోజుల్లో అన్నమయ్య సౌమ్యనాథుడి ఆలయాన్ని దర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిపై శృంగార కీర్తనలు ఆలాపించి, రచించినట్లు పలు ఆధారాలున్నాయి.

శ్రీ సౌమ్యనాథున్ని చొక్కానాథుడని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణానికి ఎర్ర రాయిని వినియోగించారు. ఆలయ కుడ్యాలపై వివిధ రాజుల సంకేతాలుగా మత్య్స, సింహ, అర్థచంద్రాకారపు చిహ్నాలున్నాయి. తమిళ శాసనాలు అధికంగా ఉండగా, తెలుగుశాసనాలు కొన్నిమాత్రమే. దేవస్థానంలో గోడలపైన కాకుండా నిలువు బండలపై 11వ శతాబ్దం నుండి విజయనగర పాలన వరకు ముఖ్యమైన అనేక వివరాలతో 54 శాసనాలు ఉన్నాయి.

16వ శతాబ్దంలో నందలూరుకు ఐదు మైళ్ల దూరంలో పొత్తపి రాజధానిగా వెలుగొందుతుండేదట. ఈ రాజధానిని పరిపాలించిన తిరు వెంగళనాథుని రాణి చెన్నమణి సౌమ్యనాథుడికి రత్నాల కిరీటం, శంఖు చక్రాలను సమర్పించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే జక్కల తిమ్మసాని రత్నాల పందిరం, జువ్వల కమ్మలు, ఇతర స్వర్ణాభరణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండియేగాక, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు.

గాలి గోపురం (సింహద్వారం):

సర్పజగాలనేలే శ్రీ సౌమ్యనాథుస్వామి ఆలయం వెలుపల ఆకారం తూర్పున ఉన్న పెద్దగోపురం ఈ ప్రాంతంలో ఆకర్షిణీయమైన కట్టడంగా గుర్తింపుపొందింది. ఈ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మహద్వార గోపురమని, ముఖ ద్వారమంటుంటారు. ఈ ద్వారంపై ఎతైన గోపురం నిర్మించడానికి అనువుగా బలీయమైన రాతిదూలాలతో ద్వారానికి ఇరువైపుల చౌకట్టు నిర్మింపబడింది. మహద్వార గోడలు మకరతోరణాలతో చోళ సాంప్రదాయ స్థంభంలతో అలరారుచుంది. ఈ గోపుర ద్వారంలో 12వ శతాబ్దంలో వేయించిన శాసనంలో ఈ గాలి గోపురం విమలాదిత్యుని కుమారుడు 3వ సోమేశ్వరరాజు నిర్మించినట్లు తేటతెల్లమవుతుంది.

ఉత్తర గోపురం:

ఉత్తర గోపురం మహప్రాకారానికి అనుసంధానింపబడి ఉత్తర దిక్కున ఉన్న గోపురం. ఈ గోపురం ద్వారం లో ద్వారబంధంపై లతలు, కింద ఓ స్ర్తిమూర్తి నిలిచి లతను పట్టుకున్నట్లు ఉంది. లతలు, ముఖవైఖరులు విజయనగర కాలాన్ని తలపింపచేస్తుంది.

దక్షిణ గోపుర ద్వారం:

ఈ గోపురద్వారం కూడా మహప్రాకారానికి అనుసంధానింప బడిన గోపురమే. ప్రస్తుతం దక్షణం వైపు గోపురం లేదు. దాదాపు వంద సంవత్సరాలకు ముందు పెద్ద గాలివాన వచ్చిందని అపుడు దేవాలయ ఆవరణలోని పెద్ద చింతచెట్టు విరిగి ఆ గోపురంపై పడగా, గోపురం మధ్యకు చీలి పోయిందని పూర్వీకులు పేర్కొనేవారు. అప్పట్లో విరిగిన చెట్టును తొలగించారు. తర్వాత గోపురం మాత్రం కాలగమనంలో పూర్తిగా లేకుండా పోయింది. మిగిలిన ద్వారం కూడా నేడు శిథిలావస్థకు చేరుకోగా కేంద్ర పురావస్తు శాఖ వారు పై భాగాన్ని తీసివేసి మళ్లీ అమర్చి మరమత్తులు చేపట్టారు.

దీప స్తంభం:

సర్వ దేవాధిదేవుడైన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో మహాగోపుర ద్వారం ద్వారా ప్రవేశించగానే మనకు ముందుగా కానవచ్చేది 8 అడుగుల ఎత్తుగల రాతి దీపస్థంభం. పునాది వద్ద నాలుగు సింహముఖాలు మోస్తుండగా ఈ రాతిస్థంభం నిట్టనిలువుగా అమర్చబడి ఉంది. బహుశా ఆ రోజుల్లో ఉత్సవ, పండుగ, ఊరేగింపుల సమయాల్లో వెలుతురు కోసం పెద్ద ప్రమిదలు వెలగించేందుకు ఈ రాతిస్థంభం ఉంచినట్టుగా చెపుతారు.

బలిపీఠం:

పెద్దరాతిదీప స్థంభానికి దగ్గరలో పడమటి వైపు ఉన్నదే బలిపీఠం. కరుణాసాగరుడైన శ్రీ సౌమ్యనాథస్వామికి నైవేధ్యం, పరివార దేవతలకు బలిని సమర్పించిన తరువాత ఈ ఎతైన బలిపీఠంపై బలి అన్నాన్ని సమర్పిస్తారు. ఈ బలిపీఠంపై ఉంచిన ఆహారాన్ని రాత్రింబవళ్ళు సంచరించే గణాలు స్వీకరిస్తాయని ప్రతీక.

ధ్వజ స్తంభం:

బలిపీఠం ప్రక్కనే పడమర వైపున ఎతె్తైన పీఠంపై ప్రతిష్టించిబడి ఉన్న ఎతె్తైన స్తంభమే ధ్వజస్థంభం. ఈ స్థంభానికి కింది నుండి పై వరకు ఇత్తడి రేకు తాపబడి ఉంది. నవనీతచోరుడైన శ్రీ సౌమ్యనాథస్వామికి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల తొలిరోజున ఈ స్తంభంపై ద్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణం జరిగిన నాటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

గరుడ మందిరం:

ధ్వజస్తంభానికి ప్రక్కనే పడమటి వైపున లోపలి ప్రాకార ద్వారానికి ఎదురుగా అనగా సర్వ జగద్రక్షకుడైన శ్రీ సౌమ్యనాథస్వామికి ఎదురుగా గర్భగృహం లాంటి ఒక చతురస్రాకార చిన్న గుడిలో మనోహరమైన 4.5 అడుగుల గరుత్మంతుడు రెండుచేతులు జోడించి అంజలి ఘటిస్తున్నట్టు విగ్రహం ప్రతిష్టించబడి ఉంది.

శ్రీ ఆంజనేయస్వామి మండపం:

గరుడాళ్వారుకు దక్షిణం వైపున ఓ మండపం గలదు. ఈ మండపంలో శ్రీ వీరాంజనేయస్వామివారిని ప్రతిష్టించి ఉన్నారు. ఈ మండపం 12 స్థంభాలు కలిగి ఉత్తరం తప్ప మిగతా దిక్కుల్లో గోడ నిర్మించబడి ఉంది.

చిన్నకోనేరు:

సర్వపాప హరుడైన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ ఆవరణంలో గరుడ మందిరానికి ఉత్తరం వైపున చిన్న కోనేరు కలదు. ఈ కోనేరులో బ్రహ్మోత్సవాల చివరిరోజున ధ్వజారోహణ సమయంలో శ్రీ సౌమ్యనాథస్వామివారికి శ్రీదేవి భూదేవిలకు పంచామృతాభిషేకం గావించి చక్రతాళ్వారుతో సహా కోనేటి యందు అర్చక స్వాములు మునకలు చేస్తారు.

ప్రవేశ ద్వార గోపురం:

భక్తుల పాలిటి పెన్నిధి అయిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ ప్రకారం ద్వారానికి ఇరువైపులా పెద్ద అడుగులు నిర్మించి ఉన్నారు. ఇది కేంద్ర పురావస్తుశాఖ తొలగించారు.

బ్రహ్మోత్సవాలు:-

తిరుపతి-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల జూన్ -27 నుండి జులై 7వరకు నిర్వహించనున్నారు

27 అంకురార్పణ 28 ఉదయం ధ్వజారోహణం,రాత్రి యాలి వాహనం,29 ఉదయం పల్లకీసేవ గ్రామోత్సవం, రాత్రికి హంసవాహనం,30 వ తేదీన గ్రామోత్సవం, రాత్రికి సింహవాహనం, 1వ తేదీన పల్లకీ సేవ, రాత్రికి హనుమంతసేవ,2 వ తేదీన ఉదయం శేషవాహనం, రాత్రికి గరుడసేవ,3 వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ

వాహనం,04 వ తేదీన ఉదయం 9 గంటల నుండి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ సౌమ్యనాధస్వామివారి కల్యాణ మహోత్సవం,రాత్రి గజ వాహనం 05 వ తేదీ ఉదయం రథోత్సవంం రాత్రికి అశ్వవాహన సేవ,06 వ తేదీన చక్రస్నానం ధ్వజా అరోహణం 07 వతేది పుష్ప యాగం మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు.

Related posts

హాకీ టోర్నమెంట్లో తెలంగాణ మహిళలు సత్తా చాటాలి

Satyam NEWS

పత్రికా విలేకరులను బూతులు తిడుతున్న వైసీపీ ఎమ్మెల్యే

Bhavani

‘ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ బ్యానర్స్’ అంశంపై అవగాహన సదస్సు

Bhavani

Leave a Comment