40.2 C
Hyderabad
May 6, 2024 18: 21 PM
Slider నల్గొండ

తెలంగాణ పోలీస్ కీర్తి పెంచేలా కృషి చేయండి

#SP Ranganath

విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకుంటూ పనిచేసి పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులంతా పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెంచేలా సమజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.

శనివారం పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన ఏ.ఎస్.ఐ.లు చలపతి రెడ్డి, అబ్దుల్ రషీద్, హెడ్ కానిస్టేబుల్ కె. ప్రభాకర్ రెడ్డి, ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ కె. లష్కర్, మహిళా హోమ్ గార్డు నాగరాణిల సేవలను ఎస్పీ రంగనాధ్ అభినందించారు.

శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అధికారుల పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా సేవలందించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందని, పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని పదవీ విరమణ తర్వాత ప్రజలలో పోలీసుల గౌరవం పెరిగే విధంగా వారితో మమేకం కావాలని ఆయన సూచించారు.

సామాజిక సేవలో నిమగ్నం కావాలి

పదవీ విరమణ పొందే ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉండకుండా, ఎదో ఒక సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అదే సమయంలో పదవీ విరమణ తరువాత  ప్రభుత్వం కల్పించే అన్ని రకాల లబ్దిని సక్రమంగా వినియోగించుకుంటూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఎస్పీ రంగనాధ్ ఆకాంక్షించారు.

పిల్లలంతా మంచి విలువలతో కూడిన జీవనం సాగించే విధంగా చేయాలని, క్రమశిక్షణాయుతమైన జీవనం ద్వారా సమాజంలో మంచి పేరు పొందే విధంగా మనతోటి వారికి సహాయం చేస్తూ ముందుకు సాగాలని, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.

విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురైనా నిత్యం ప్రజల కోసం పని చేయడంలో కలిగే సంతృప్తి అలాంటి వాటన్నింటిని మర్చిపోయేలా చేస్తుందని, పోలీస్ ఉద్యోగం లభించడం గర్వకారణమని అన్నారు. పోలీస్ ఉద్యోగం ద్వారా బాధిత ప్రజలకు న్యాయం చేసే అవకాశం, దాని ద్వారా కలిగే మానసిక సంతృప్తి జీవితంలో గొప్ప అనుభూతిని కలిగిస్తాయన్నారు.

పదవీ విరమణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద, సిఐలు రవీందర్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్, రాష్ట్ర నాయకులు సోమయ్య, కె.జంగయ్య, ఆర్.ఐ. భరత్ భూషణ్ లతో పాటు పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

చేయూత చెక్కుల పంపిణీ

ప్రమాదవశాత్తు మరణించిన పోలీస్ కుటుంబాలకు చేయూత పథకం కింద జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ మరణించిన పోలీసుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. కానిస్టేబుల్స్ లక్ష్మీ నారాయణ భార్య ఈదమ్మ, మరో కానిస్టేబుల్ జగన్నాధం భార్య లలితలకు ఆయన చేయూత చెక్కులు అందించారు. పోలీస్ శాఖ మొత్తం వారి కుటుంబాలకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన లబ్ది త్వరగా అందించేలా కృషి చేస్తామని ఆయన వారికి భరోసా కల్పించారు.

Related posts

పాముల పండుగ

Satyam NEWS

జనవరి 5న ప్రపంచ భారీ ఎలక్ట్రానిక్స్ షో

Sub Editor

మా గ్రామాల్ని తెలంగాణ రాష్ట్రం లో కలపండి

Satyam NEWS

Leave a Comment