39.2 C
Hyderabad
May 3, 2024 13: 01 PM
Slider విజయనగరం

ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డ దండుమారమ్మ టెంపుల్ నిందితులు

#vijayanagarampolice

మొత్తం ఆరుచోట్ల ఆఫెన్స్ చేసిన అంతర్రాష్ట్ర దొంగలు….!

ఆలయాల్లో చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి సిల్వరు, బంగారం, ఒక మోటారు సైకిలును రికవరీ చేసినట్లుగా విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు విజయనగరం సీసీఎస్ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ – జిల్లాలో మే, జూన్, జూలై మాసాల్లో గజపతినగరం, కోమటిపల్లి, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం, విజయనగరంలోని దండుమారమ్మ ఆలయాల్లో దొంగతనాలు జరిగి, ఆలయాల్లోగల వెండి, బంగారు ఆభరణాలను దొంగలు దోచుకొని పోగా, ఆయా పోలీసు స్టేషను పరిధిలో కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులను చేధించేందుకుగాను జిల్లా ఎస్పీ ఎం. దీపిక, సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారన్నారు. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన నేరస్థులు, జైలు శిక్ష అనుభవించి, జైలు నుండి విడుదల అయిన వారి వివరాలను సేకరించి, విచారణ చేపట్టి, ఈ తరహా నేరాలకు పాల్పడిన పాత నేరస్థులపై నిఘా ఏర్పాటు చేసారు.

విజిబుల్ పోలీసింగులో భాగంగా నగరంలో కామాక్షి నగర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, అయ్యన్నపేట నుండి పట్టణంలోకి ఇద్దరు వ్యక్తులు వారి ముందు ఒక సిమెంటు గోనె మూటను పెట్టుకొని వస్తుండగా, పోలీసులు ఆపి, వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, వారు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని పట్టుకొని, విచారణ చేసారు.

వారిలో (1) ఒకడు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, పొట్టిపాడు పంచాయతీ, ఆనందపురం గ్రామానికి చెందిన శిఖ ఆనంద్ అలియాస్ ఆడం (29 సం.లు) అని, (2) మరో వ్యక్తి గజపతినగరం షరాబుల కాలనీకి చెందిన పొన్నాడ కిరణ్ అలియాస్ నాని (28 సం.లు) అని తెలిపారు.

విచారణలో వీరిద్దరు మద్యం, వ్యభిచారం, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి, జులాయి గా తిరిగే వారని, వారి అవసరాలకు దొంగతనాలకు పాల్పడినట్లుగా అంగీకరించారన్నారు. శిఖ ఆనంద్ అలియాస్ఆ డం (ఎ-1) విజయవాడ జైలులో ఉన్నపుడు అక్కడ జైలులో గజపతినగరంకు చెందిన చలుమూరి వెంకట భాస్కరరావు అనే వ్యక్తి పరిచయం అయినట్లు, ఇద్దరు జైలులో స్నేహితులుగా ఉన్నట్లు, జైలు నుండి విడుదల అయిన తరువాత అతను గజపతినగరం రాగా, చలుమూరి వెంకట భాస్కరరావు పొన్నాడ కిరణ్ అలియాస్ నాని (ఎ-2)ను పరిచయం చేసినట్లుగా తెలిపారు.

వీరిద్దరు (1) గజపతినగరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనానికి పాల్పడిన రెండున్నర కిలోల వెండి వస్తువులను, 10 గ్రాముల పుస్తుల త్రాడును, అదే విధంగా

(2) కొత్తవలస మండలం దేశ పాత్రునిపాలెం గ్రామంలోని శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో నేరానికి పాల్పడి మూడున్నర కిలోల వెండి వస్తువులను,

(3) విజయనగరం వన్ టౌన్ పిఎస్ పరిధిలోని కాళీఘాట్ కాలనీలో శ్రీ దేవీ దండుమారమ్మఆలయంలో దొంగతనంకు పాల్పడి సుమారు ఆరు కిలోల వెండి వస్తువులను, ఒకటిన్నర తులాల బంగారు వస్తువులను

(4) పెద మానాపురం పిఎస్ పరిధిలో గల కోమటిపల్లి శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలోను దొంగతనంకు పాల్పడి 750 గ్రాముల వెండి వస్తువులను (5) భీమునిపట్నం పిఎస్ పరిధిలో గల చిల్లపేట శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఒక కిలో 800 గ్రాముల వెండి వస్తువులను (6) తగరపువలస ఫుట్ బాల్ గ్రౌండు వద్ద ఒక మోటారు సైకిలును దొంగతనం చేసినట్లుగా అంగీకరించారు.

దొంగిలించిన వస్తువులలో కొన్నింటిని విజయనగరం గూడ్సు షెడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన (ఎ-3) నలబంద సతీష్ (40 సం.లు) విక్రయించినట్లు, ఇంకనూ కొన్ని వస్తువులను అయ్యన్నపేట గ్రామ శివార్లలో తుప్పల్లో దాచి పెట్టినట్లు, వాటిని సతీష్ కు అమ్మేందుకు వెళ్ళుతుండగా పోలీసులకు పట్టుబడినట్లుగా నిందితులు అంగీకరించారని విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు మీడియా కు తెలిపారు.

అరెస్టుకాబడిన నిందితులు వద్ద నుండి సుమారు 8.5 లక్షల విలువైన 13.050 కిలోల వెండి, 27 గ్రాముల బంగారు వస్తువులను, ఎపి 39ఎ 3529 సుజుకీ ఏక్సేస్ మోటారు సైకిలును రికవరీ చేసామన్నారు. నిందితులు ఈ నేరాలతోపాటు ఇంకనూ విశాఖపట్నం సిటీ పరిధిలో గల అగనంపూడి జంక్షన్ వద్ద గల మరిడిమాంబ ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా వీరవసారంలోని గౌరీ జ్యువెలరీ షాపులోను, కోటమ్మ అమ్మవారి ఆలయంలోను, తెలంగాణ రాష్ట్రం రాచకొండ జిల్లా ఆలేరులోని సాయిబాబా ఆలయంలోను దొంగతనాలకు పాల్పడినట్లుగా విచారణలో వెల్లడించినట్లుగా డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కేసులో నిందితులను అరెస్టు చేయుటలో సీసీఎస్ ఇన్స్పెక్టరు ఎస్.కాంతారావు, వన్ టౌన్ సీఐ డా. బి. వెంటక రావు, గజపతినగరం సీఐ ఎల్. అప్పలనాయుడు, ఎస్ఐలు వి. లోవరాజు, వి. అశోక్ కుమార్, ఎఎస్ఐ ఎ.గౌరీ శంకర రావు, హెడ్ కానిస్టేబుల్స్ ఎం.డి. ఇమ్రాన్, డి.శంకరరావు, కానిస్టేబుళ్ళు కే. సత్యం, సి.హెచ్.వి. పైడిరాజు, జి. గౌరీ శంకరరావు, ఎస్.రామారావు, టి. ప్రదీప్ కుమార్ లు క్రియాశీలకంగా పని చేసారని, వారందరిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ప్రత్యేకంగా అభినందించారని, త్వరలో రివార్డులను ఇవ్వనున్నట్లుగా డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.

Related posts

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్

Satyam NEWS

స్కాలర్ షిప్ అక్రమాలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు

Satyam NEWS

వద్దని చెప్పినా రైతులు మొక్కజొన్న పంట వేశారు

Satyam NEWS

Leave a Comment