28.7 C
Hyderabad
May 5, 2024 09: 34 AM
Slider జాతీయం

Good News: కరోనా ముగింపు ముచ్చట్లు

ఒక పక్క ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరోపక్క,మార్చి కల్లా కరోనా ముగిసిపోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా అలా జరిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? ఐ సీ ఎం ఆర్ కు చెందిన డాక్టర్ సమీరన్ పాండా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ఊతం ఇస్తున్నాయి.

ఆయన చేసిన వ్యాఖ్యలను ఒకసారి గమనిద్దాం.” మనం జాగ్రత్తలు పాటిస్తూ,భౌతిక దూరం మొదలైన నిబంధనలను అనుసరిస్తూ,మాస్కులు ధరిస్తూ,శానిటైజర్స్ ను వాడుతూ,అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే, మార్చి11కల్లా కరోనా వైరస్ ఎండమిక్ గా మారుతుంది” అని అన్నారు.

నిపుణుల అభిప్రాయం ఏమిటంటే…

ఇంకా మాట్లాడుతూ… డెల్టా వేరియంట్ ను ఒమిక్రాన్ భర్తీ చేస్తే,కోవిడ్ ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ పాండా అభిప్రాయపడ్డారు. నిపుణుల బృందం కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డిసెంబర్ 11వ తేదీన ఒమిక్రాన్ వేవ్ ప్రారంభమైంది.

ఇది మూడు నెలల పాటు ఉంటుందని వారు అంటున్నారు. ఈ లెక్కన చూస్తే, మార్చి 11 నుంచి కొంత ఉపశమనం కలుగవచ్చు. ఐ సీ ఎం ఆర్ నిపుణుల మాటల ప్రకారం,మార్చి నుంచి మంచి ఘడియలు వస్తాయని అనుకోవాలి. ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ కూడా వ్యాప్తిలో ఉంది.

వ్యూహాలు మార్చుకుంటూ వెళుతున్న ఐసీఎంఆర్

ఈ తీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా సాగుతోంది. దిల్లీ,ముంబయిలో ఒమిక్రాన్ – డెల్టా వేరియంట్ సగటున 80 : 20 నిష్పత్తిలో ఉన్నట్లు సమాచారం. మహానగరాల్లో కరోనా గరిష్ఠ స్థాయికి చేరిందా లేదా అన్నది తెలియాలంటే మరో రెండు వారాలు వేచి చూడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.

దానికి తగ్గట్టుగా ఐ సీ ఎం ఆర్ పరీక్షా వ్యూహాలను మార్చుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తోందన్నది వాస్తవం. కొత్త కేసులు 3 లక్షలకు చేరువయ్యాయి. ఇది ఇలా ఉండగా, రికవరీ రేటు 94 శాతం ఉండడం శుభసూచకమే. కోవిడ్ కేసులు భారీగా పెరగడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.

రెండు వేరియంట్లు కలిసి సాగుతుండడం ఒక కారణం. డెల్టా వేరియంట్ తో పోల్చుకుంటే ఒమిక్రాన్ వ్యాప్తి ఐదారురెట్లు ఎక్కువగా ఉండడం మరో కారణమని నిపుణుల అభిప్రాయం. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ,తీవ్రత మాత్రం తక్కువేనని ఎక్కువమంది చెప్పడం ఊరటనిచ్చే అంశం.

ఎవరి ఇష్టం వచ్చినట్లు వారి అన్వయం

కాకపోతే,సెకండ్ వేవ్ తో పోల్చుకుంటే ఇప్పుడు నడుస్తున్న మూడో వేవ్ లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. శాస్త్రీయమైన అంశాలకు భిన్నంగా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ, ఉచిత సలహాలు ఇవ్వడమో, భయభ్రాoతులుకు గురిచెయ్యడమో జరుగుతోంది.

సమాచార సాంకేతిక వ్యవస్థ పెరిగిన నేపథ్యంలో ఇదొక విపరీతమైన పరిణామం. మరోవైపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం ఎంతో ఆశావహం. రెండు డోసుల పంపిణీ 60 శాతం దాటితే హెర్డ్ ఇమ్మ్యూనిటీ ( సామూహిక రోగ నిరోధక శక్తి) ఆశించిన స్థాయిలో పెరుగుతుందని నిపుణులు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు.

ప్రస్తుత వ్యాక్సినేషన్ ప్రగతిని గమనిస్తే, ఆ స్థాయిని దాటిపోయాం. ప్రీకాషస్ డోస్ కూడా మొదలైంది. 15 నుంచి 18 ఏళ్ళ పిల్లలకు కూడా వ్యాక్సిన్లు అందిస్తూ ఉండడం మరో మంచి అడుగు. కోవిడ్ వ్యాప్తి ఉధృతిని, తీవ్ర పరిణామాలను అడ్డుకట్ట వేయాలంటే  నిబంధనలను పాటించడంతో పాటు మరిన్ని సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేలా చేయాలి. కోవిడ్ వైరస్ శక్తిసామర్ధ్యాలు త్వరలోనే నిర్వీర్యమవుతాయని ఆకాంక్షిద్దాం,అవ్వాలని బలంగా కోరుకుందాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే హక్కు ఎవరికి లేదు

Satyam NEWS

డెత్ బెల్స్:నిర్భయ కేసు దోషులకు జనవరి 22న ఉరి

Satyam NEWS

దొంగను పట్టుకున్న చండూర్ సిఐ సురేష్ కుమార్

Satyam NEWS

Leave a Comment