భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన చారిత్రాత్మకమైన పౌరసత్వ సవరణ చట్టం-2019కి దేశ ప్రజలందరూ మద్దతు పలకాలని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పిలుపునిచ్చారు.
నేడు కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరంలో జాతీయవాదులు జాతీయ జెండాలు, కాషాయ జెండాలు చేతబట్టి నిర్వహించిన మహా ప్రదర్శనకు రావు పద్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం చారిత్రాత్మకమైనదని, భారత దేశ చరిత్ర గతిని మార్చే కీలక చట్టమని అన్నారు. వెయ్యి స్తంభాల గుడిలోని రుద్రేశ్వరుని సాక్షిగా హన్మకొండ పురవీధుల్లో కదం తొక్కిన యువకులే ఈ చట్టాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
రావు పద్మ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు, మార్వాడి సమాజ్, రాజస్థాన్ సమాజ్, నాయకులు, వివిధ విద్యాసంస్థల అధినేతలు, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు, నగరంలోని వివిధ వర్గాల ప్రజలు, జాతీయ జెండాలతో పట్టణంలో పాదయాత్ర చేశారు.