కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని కోర్పోల్ గ్రామంలో ఇద్దరు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎక్కనోళ్ళ దిలీప్(12) గుట్టమీది రాజు(16) గేదెలను మేపుతుంటారు. ఎప్పటిలాగే గేదెలను మేపేందుకు వెళ్లారు.
గేదెలు నీటి గుంటలో దిగగా వాటిని అదే నీటితో కడగడానికి ఇద్దరు గుంటలోకి దిగారు. ఈ క్రమంలోనే గేదెలు లోతు ఎక్కువున్న వైపు వెళ్లడంతో వాటిని అనుసరిస్తూ వెళ్లిన ఇద్దరు నీటిలో మునిగిపోయారు. యువకుల అరుపులు విని స్థానికంగా పొలాల దగ్గర ఉన్న వారు గుంట దగ్గరి కి వెళ్లి చూసే సరికి వారు కనిపించలేదు. దీంతో వారు గుంటలోకి దిగి గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
దీంతో వారి కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని వివరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇద్దరు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.