బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీలైన మార్గాల అన్వేషణతో ఎన్ ఆర్సీ బిల్లును ఉపసంహరించుకునేలా చర్యలు చేబడితే మైనార్టీలు టీడీపీకి రుణపడి ఉంటారని కడప టీడీపీ మైనార్టీ నేత సుబాన్ బాషా అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను గురువారం విజయవాడలో ఆయన కలిశారు.
తెలుగుదేశం పార్టీ తరపున సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ తరహాలో ఎన్ ఆర్సీ పై తీర్మానం చేయాలని ఆయన అభ్యర్ధించారు. ఎన్ ఆర్సీ,ఎన్ పీఆర్,సి ఎ ఎ, పై ప్రజల భయాందోళనలను చంద్రబాబునాయుడికి సుబాన్ బాషా వివరించారు.
అలాగే 10 రోజులుగా కడప షాహిన్బాగ్ జేఏసీ ప్రజా దీక్షల తీవ్రతను కూడా వివరించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి,ఎమ్మెల్సీ నారా లోకేష్ ను కలసి ఎన్ఆర్సీ విషయం పై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన టీడీపీ మైనార్టీ నేతలు మన్నూరు అక్బర్,ఉస్మాన్ ఖాన్,ఫతేవుల్లా తదితరులు పాల్గొన్నారు.