27.7 C
Hyderabad
May 4, 2024 07: 34 AM
Slider జాతీయం

రాత్రి కర్ఫ్యూ లాజిక్ ఏమిటన్న వరుణ్ గాంధీ

సొంత ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ తీవ్రస్థాయిలో చెలరేగారు. రాత్రిపూట కర్ఫ్యూ విధించి, పగటిపూట లక్షల మందితో ర్యాలీలో నిర్వహించడం ఏంటో సామాన్య జనానికి అర్థం కావడం లేదంటూ ట్వీట్‌ చేశారాయన. ఉత్తరప్రదేశ్‌లో ఒమిక్రాన్‌ వ్యాప్తిని అడ్డుకోడమే మన ప్రథమ కర్తవ్యం కావాలి గానీ, ఎన్నికల బల ప్రదర్శన కాదంటూ యూపీ సర్కారుకు వరుణ్‌గాంధీ చురకలంటించారు.

కొంతకాలంగా సొంత పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు వరుణ్‌గాంధీ. ఇటీవల వ్యవసాయ చట్టాల్ని సైతం ఆయన ఎండగట్టారు. ఆ చట్టాల్ని రద్దు చేయాలంటూ డిమాండ్‌ చేసి పార్టీని ఇబ్బందిపాలు చేశారు. రైతుల ఆత్మహత్యల్ని ట్విట్టర్‌ వేదికగా ఆయన వెలుగులోకి తెస్తున్నారు. వరుణ్‌ విమర్శలతో బీజేపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

సొంత పార్టీ, ప్రభుత్వంపై వరుణ్‌గాంధీ విమర్శల్ని పార్టీ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి వరుణ్‌ తల్లి మేనకాగాంధీకి ఉద్వాసన పలికింది బీజేపీ అధిష్ఠానం. అయినప్పటికీ వెనక్కి తగ్గని వరుణ్‌గాంధీ అటు పార్టీపై, ఇటు ప్రభుత్వంపై విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ వరుణ్ గాంధీ సంధిస్తున్న విమర్శనాస్త్రాలు.. బీజేపీని తీవ్ర ఇరకాటంలో పెడుతున్నాయి. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనందునే బీజేపీ పట్ల వరుణ్ గాంధీ గుర్రుగా ఉన్నారన్న ప్రచారం చాలా కాలం నుంచే జరుగుతోంది. ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Related posts

హిస్టరీ మఠాష్: వేంగి రాజుల గుట్టను దొంగిలించేస్తున్నారు

Satyam NEWS

సునీల్ కుమార్ పై చర్యలకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

జూనియర్ డాక్టర్ల సమ్మె మంచి పద్ధతి కాదు

Satyam NEWS

Leave a Comment