38.2 C
Hyderabad
May 3, 2024 21: 44 PM
Slider ఆధ్యాత్మికం

హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

#tirumala

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తోంది. దాతలు హర్షవర్ధన్‌, ఎస్‌ఎస్‌.రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి సహకారంతో టిటిడి ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల కోసం సోమవారం సాయంత్రం వైదిక క్రతువులు ప్రారంభమయ్యాయి. అంకురార్పణంలో భాగంగా పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, వాస్తుశాంతి, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.

నమూనా ఆలయంలో రోజువారీ కార్యక్రమాలు

ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు వారపు సేవ, ఉదయం 10 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. అదేవిధంగా, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.

వారపు సేవల్లో భాగంగా అక్టోబరు 11న ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు వసంతోత్సవం, అక్టోబరు 12న ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు సహస్ర కలశాభిషేకం, అక్టోబరు 13న ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు తిరుప్పావడ, అక్టోబరు 14న ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు అభిషేకం, ఉదయం 10 నుండి 12 గంటల వరకు  నిజపాదదర్శనం, అక్టోబరు 15న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

వైభవోత్సవాల నేపథ్యం

తిరుమలకు వచ్చే భక్తులందరూ స్వామివారికి జరిగే నిత్య, వారోత్సవాలు తిలకించడం సాధ్యంకాదు. వయోభారం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనేక మంది స్వామివారిని ఎక్కువ సార్లు చూసి తరించే అవకాశం ఉండదు. భక్తులకు ఈ లోటు లేకుండా చేయడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో  నిర్వహించే నిత్య, వార సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది. కరోనా కారణంగా రెండున్నర ఏళ్ల విరామం తరువాత నెల్లూరు నగరం నుంచి ఈ ఉత్సవాలను టిటిడి పునఃప్రారంభించింది.

విస్తృత ఏర్పాట్లు

నమునా ఆలయం వద్ద సేవల నిర్వహణకు ఆకట్టుకునేలా స్టేజి ఏర్పాటు చేశారు. భక్తులు కూర్చుని సేవలను దర్శించేందుకు వీలుగా కుర్చీలు, ఎండకు, వర్షానికి ఇబ్బంది లేకుండా విశాలమైన జర్మన్ షెడ్ ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి కల్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందువల్ల అన్నప్రసాదాల వితరణ కోసం క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అర్చకస్వాములు, పరిచారకులు ఇతర ఆలయ సిబ్బంది స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కార్యక్రమాలు, దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో గోసంరక్షణ, గో ఆధారిత ఉత్పత్తులు ఇతర ముఖ్యమైన అంశాలపై ఫ్లెక్సీలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. వైభవోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులతో సేవలందిస్తున్నారు. ఎస్వీబీసీ ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. పంచగవ్య ఉత్పత్తులతో పాటు 2023 డైరీలు, క్యాలెండర్లు భక్తులకు అందుబాటులో ఉంచారు.

Related posts

“అసని” తుపాను ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉన్నాం

Satyam NEWS

మాదాసి కురువ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత

Bhavani

Leave a Comment