February 28, 2024 08: 12 AM
Slider సినిమా

సినిమాటోగ్రాఫర్ గా రాణిస్తున్న “విజయనగరం చిన్నోడు”

#cinema

ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను… అతను ప్రేమించే ప్రకృతి సానుకూలం చేసింది. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమైన ఆ కుర్రాడు… తనకు లభించని ప్రేమ, ఆప్యాయతలను ప్రకృతి నుంచి పొందే ప్రయత్నం చేస్తూ సేద దీరేవాడు. ప్రకృతి ఆవిష్కరించే అందాలను కెమెరాలో బంధించి మురిసిపోతుండేవాడు. అదే అతన్ని “సినిమాటోగ్రఫీ”వైపు దృష్టి సారించేలా చేసింది. కష్టాలను కేర్ చేయక… కెమెరాతో చెలిమి చేసి… ఉజ్వల భవిష్యత్ కలిగిన వర్ధమాన ఛాయాగ్రాహకుడిగా రాణిస్తున్న ఆ యువ తేజం పేరు “శ్రీసాయి కుమార్ దారా”.

సరిగ్గా ఏడేళ్ల క్రితం, 2016లో పొట్ట చేతబట్టుకుని భాగ్యనగరానికి చేరుకున్న సాయికుమార్… కెమెరా విభాగంలో చేరడంఎలా అన్నది తెలియక… షార్ట్ ఫిల్మ్స్ కు పని చేస్తూ ఫోకస్ పుల్లర్ “నాగేశ్వరరావు దేవరకొండ” దృష్టిలో పడడం అతని జాతకాన్ని మార్చేసింది. నాగేశ్వరరావు దేవరకొండ అండతో… “కృష్ణగాడి వీర ప్రేమగాధ” చిత్రానికి సినిమాటోగ్రాఫర్ యువరాజ్ దగ్గర కెమెరా అసిస్టెంట్ గా చేరిన సాయి.. ఆ తర్వాత యువరాజ్ గురువు దేవరాజ్ దగ్గర “ఈడు గోల్డెహె” చిత్రానికి పని చేశాడు. ఆ తర్వాత రత్నవేలు దగ్గర “రంగస్థలం, సైరా” చిత్రాలకు పని చేసే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకున్నాడు.

అయినా… ఇంకా ఏదో నేర్చుకోవాలన్న అతని దాహం తీరలేదు. తను కెరీర్ గా ఎంపిక చేసుకున్న విభాగంలో మరింత ప్రావీణ్యం సాధించాలన్న కాంక్షతో సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ నెలకొల్పిన “మైండ్ స్క్రీన్” అనే సినిమాటోగ్రఫీ ఇనిస్టిట్యూట్ లో చేరి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. దాన్ని బట్టి ఈ రంగంపై సాయి కుమార్ కు గల ప్యాషన్ ను అర్ధం చేసుకోవచ్చు.

అప్పటికి సంపాదించినదానికి తోడు కొంత అప్పు కూడా చేసి… సినిమాటోగ్రఫీలో సుశిక్షితుడుగా మారిన సాయికుమార్ ను కరోనా కష్టాలు చుట్టుముట్టాయి. అయితే… కష్టాలతో ఇష్టంగా చెలిమి చేయడం చిన్నప్పటి నుంచి సాయికి వెన్నతో పెట్టిన విద్య కావడంతో… కష్టాల గ్రహణాలు దాటుకుని… “శశివదనే” చిత్రానికి ఛాయాగ్రహణం అందించే అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఆ  సినిమా సెట్స్ పై ఉండగనే… సాయి కుమార్ టాలెంట్ బయటకు పొక్కి… మరో సినిమా ఛాన్స్ వచ్చింది. సాయి సినిమాటోగ్రఫీ అందించిన “ది ట్రయిల్” అనే ఆ చిత్రం ఇటీవల విడుదలై… “సాయి కుమార్” అనే పేరు చాలా మంది దృష్టిని విశేషంగా ఆకర్షించేలా చేసింది.

ప్రస్తుతం “అవికా గోర్ -నందు” నటిస్తున్న “అగ్లీ స్టోరీ”కి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయి… సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో శత్రు – సప్తగిరి   నటించనున్న ఇంకా పేరు పెట్టని చిత్రం కమిట్ అయి ఉండడం విశేషం. విజయనగరం నుంచి హైద్రాబాద్ రావడానికి, ఇక్కడ నిలదొక్కుకోవడానికి కారకులయిన “పంతులు గారు” ఏడిద మల్లేశ్వర శర్మ,  కెమెరా విభాగంలో తాను ప్రవేశించడానికి ప్రోత్సహించడంతోపాటు… ఇప్పటికీ తన వెన్నంటి ఉన్న నాగేశ్వరావు దేవరకొండ, తన గురువులు “యువరాజ్, దేవరాజ్, రత్నవేలు”లకు ఎప్పటికీ రుణ పడి ఉంటానని వినయంగా చెప్పే… సినిమాటోగ్రాఫర్ గా తన సత్తాను పూర్తి స్థాయిలో ప్రకటించుకోగలిగే పెద్ద కాన్వాసు కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు.

Related posts

పెండింగ్ పనులపై సీఎంను కలిసిన ఒంగోలు ఎంపి

Satyam NEWS

చికిత్స పూర్తి కాకుండానే చేతులు దులుపుకున్నారు

Satyam NEWS

ప్రజాభిప్రాయం లేకుండా మాస్టర్ ప్లాన్ రూపకల్పన

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!