29.7 C
Hyderabad
May 3, 2024 05: 55 AM
Slider జాతీయం

మోడీ వ్యూహంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేనా?

#modi

బీజేపీ సరికొత్త వ్యూహంతో తిరుగులేని విధంగా వరుసగా మూడోసారి గెలుపొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నది. గత 75 ఏళ్లలో ఏ పార్టీ కూడా లోక్ సభ ఎన్నికలలో 50 శాతం ఓట్లు పొందలేదు. కాంగ్రెస్ అత్యధికంగా 1984లో 48.1 శాతం ఓట్లు పొందింది. బిజెపి అత్యధికంగా 2019 ఎన్నికల్లో 37.4 శాతం ఓట్లు పొందింది. ఇందిరా గాంధీ విశేషమైన ప్రజాదరణ పొందుతున్న సమయంలో 1971 ఎన్నికలలో పొందిన ఓట్లు 43.7 శాతం. ఆమెకన్నా, ఆమె తండ్రి జవహర్ లాల్ నెహ్రు హయాంలో కాంగ్రెస్ ఎక్కువ శాతం ఓట్లు పొందింది.

1952లో 45 శాతం, 1957లో 47.8 శాతం, 1962లో 44.7 శాతం చొప్పున ఓట్లు కాంగ్రెస్ కు లభించాయి. ఇక మొదటిసారి కాంగ్రెసేతర పక్షం గెలుపొందిన జనతా పార్టీకి 1977లో 41.3 శాతం ఓట్లు వచ్చాయి. మొదటిసారిగా వచ్చే ఎన్నికలలో 50 శాతం ఓట్లు సంపాదించే విధంగా బిజెపి సమాయత్తం అవుతుంది. ఆ విధంగా జరిగితే ప్రతిపక్షాలు అన్ని కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెట్టినా బిజెపి విజయయాత్రను అడ్డుకోలేవని భావిస్తున్నది.

తాము పోటీ చేసిన ప్రతి చోటా 50 శాతం ఓట్లను పొందటం ద్వారా  కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన విపక్ష కూటమి నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని నివారించాలని చూస్తోంది. ఇదేమీ ఆ పార్టీకి కష్టసాధ్యమైన లక్ష్యం కాదు. గత సార్వత్రిక ఎన్నికల్లోనే బీజేపీ పోటీ చేసిన 436 స్థానాల్లో 303 గెలుచుకుంది. ఇందులో 50 శాతం మించి ఓట్లు సాధించి గెలిచినవి 224 ఉన్నాయి. అంటే సగం స్థానాలలో మాత్రమే 50 శాతంకు మించి ఓట్లు పొందింది. 1984 ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా అన్ని సీట్లలో శాతంకు మించి ఓట్లు పొందలేదు.

2014 ఎన్నికల్లో 136 మంది బిజెపి ఎంపీలు మాత్రమే 50 శాతంకు మించి ఓట్లు పొందారు. బిజెపి మొత్తం మీద 2019లో 37.4 శాతం ఓట్లు మాత్రమే పొందినా, తాను పోటీ చేసిన స్థానాల వరకు మాత్రమే తీసుకొంటే 46.1 శాతం ఓట్లు పొందింది.  మరో 4 శాతం అదనంగా ఓట్లు పొందగలిగితే మొత్తం మీద 50 శాతంకు మించి ఓట్లు పొందే అవకాశం ఉంటుంది.  గత ఎన్నికల్లోనే విపక్షాలన్నీ ఇప్పటి మాదిరిగా జట్టుకట్టి ఉంటే బీజేపీకి 79 స్థానాల్లో నష్టం కలిగించగలిగేది.

అందుకనే వరసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బిజెపిని  నిలువరించించేందుకు విపక్ష కూటమి 400కు పైగా స్థానాల్లో బీజేపీపై ‘ఉమ్మడి అభ్యర్థి’ని బరిలోకి దించాలని చూస్తోంది. తద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి, ఆ పార్టీ లాభపడకుండా చూడాలని, వ్యతిరేక ఓట్లను తమ ఉమ్మడి ఖాతాలో వేసుకోవడం ద్వారా తాము గెలుపొందవచ్చని భావిస్తోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్నందున సహజంగా ప్రభుత్వంపై ఏర్పడే వ్యతిరేకత కూడా తమకు కలిసొస్తుందని అంచనా వేసుకుంటోంది.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు సైతం తమకు అనుకూలంగా మారతాయని భావిస్తోంది. విపక్ష ‘ఉమ్మడి అభ్యర్థి’ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ తమ అస్త్రాలకు పదును పెడుతోంది. గతంలోనే 224 స్థానాల్లో 50 శాతం మించి ఓట్లతో గెలుపొందిన చరిత్ర ఉంది కాబట్టి ఈ సారి 50 శాతం మించి ఓట్లతో గెలుపొందే స్థానాల సంఖ్యను కనీసం 300కు పెంచుకోవాలని చూస్తున్నది. అందుకోసం గత ఎన్నికలలో కొద్దీ తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గాలపై బిజెపి ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

తాజాగా ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ, రాష్ట్రాల పదాధికారుల సమావేశంలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. ఇక నుంచి నేతలు, కార్యకర్తలు.. ప్రతి ఒక్కరూ అనునిత్యం ప్రజల్లోనే ఉండాలని, ప్రజలతోనే మమేకమై కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు.

మరోవైపు యువమోర్చా ఈ ప్రక్రియలో కీలకంగా మారాలని సూచిస్తూ అయోధ్య రామమందిరం గురించి దేశవ్యాప్తంగా 5,000కు పైగా సభలు, కార్యక్రమాలు చేపట్టాలని, కనీసం 10 కోట్ల కుటుంబాలను చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇక కనీసం 50 శాతం ఓట్లను సాధించాలంటే ముందు 2019లో తమకు ఓటేసిన ఓటర్లను చేజారకుండా చూసుకోవడంతో పాటు కొత్త ఓటర్లను కూడా ఆకట్టుకోవాలి. ఆ దిశగా సామాజిక సమీకరణాలకు సైతం పెద్దపీట వేస్తూ మధ్యభారత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చింది.

ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న యాదవులను ఆకట్టుకోవడం కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. యూపీలో సమాజ్‌వాదీ, బిహార్‌లో ఆర్జేడీ వంటి పార్టీలను యాదవులు తమ సొంత పార్టీలుగా భావిస్తారు. మిగతా ఓబీసీ సమాజం మొత్తం ఒకవైపు నిలిచినా సరే వారు మాత్రం ఈ రెండు పార్టీలను వీడి బయటకు రాలేదు.

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వరుసగా విజయం సాధించడం వెనుక ఓబీసీ ఓట్లు కీలక పాత్ర పోషించాయి. కానీ ఓబీసీ సమాజంలో అంతర్భాగంగా యాదవులను మాత్రం బీజేపీ ఇంతకాలం పాటు ఆకట్టుకోలేకపోయింది. యాదవ సమాజంలో ఎంతో కొంత మందిని తమ వైపు తిప్పుకుంటే ఆ ఓట్లు అదనంగా చేరినట్టేనని భావిస్తోంది. మరోవైపు దళిత, గిరిజన- ఆదివాసీలను కూడా ఇంతకాలం పాటు కాంగ్రెస్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల ఓటుబ్యాంకుగా పరిగణించే పరిస్థితి ఉండేది. కానీ బీజేపీ గత పదేళ్లలో ఈ రెండు సామాజిక వర్గాల్లోనూ చాలావరకు చొచ్చుకెళ్లింది.

ఓసారి దళిత రాష్ట్రపతి, మరోసారి గిరిజన- ఆదివాసీ మహిళా రాష్ట్రపతి వంటి సామాజిక సమీకరణాలను కూడా అమలు చేసింది. తమ ఓటుబ్యాంకు కాదు అనుకుని ఏ వర్గాన్నీ వదిలిపెట్టకుండా చివరకు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ముస్లింలకు సైతం దగ్గరయ్యే ప్రయత్నాలు చేపట్టింది. వీటికి తోడు దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు ఈమధ్య ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆయుధంగా మలచుకోవాలని చూస్తోంది. అలాగే 140 కోట్ల భారతీయుల్లో 70 కోట్లకు పైగా ఉన్న వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్నాయి.

కావాల్సిందల్లా తమ ఓటర్లను పోలింగ్ రోజున విధిగా ఓటేసేలా ప్రోత్సహించడం, వీలుంటే వారిని దగ్గరుండి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓటేయించడమే. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్,  ఛ‌త్తీస్‌ఘ‌ఢ్‌లలో బిజెపి గెలుపొందిన తీరు ఓ నమూనాగా భావిస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు అంతర్గత సర్వేలలో ఈ రెండు రాస్త్రాలలో కూడా బిజెపికి ఓటమి తప్పదని వెల్లడైనట్లు తెలుస్తున్నది. అయితే కేంద్ర మంత్రులు భూపేష్ యాదవ్ ను మధ్యప్రదేశ్ కు, మన్సుఖ్ మాండవీయను  ఛ‌త్తీస్‌ఘ‌ఢ్‌కు గత ఎన్నికలలో ఓటమి చెందిన నియోజకవర్గాలపైననే వారు ప్రత్యేకంగా దృష్టి సారించేవిధంగా చేశారు.

మధ్యప్రదేశ్ లో గత ఎన్నికలలో 89 నియోజకవర్గాలలో ఓటమి చెందినా, ఈ సారి వాటిపై ప్రధానంగా దృష్టి సారించడంతో 66 నియోజకవర్గాలలో గెలుపొందగలిగారు. దానితో ఎవ్వరూ ఊహించని విధంగా మూడింట రెండు వంతులకు దగ్గరలో సీట్లు వచ్చాయి. ఛ‌త్తీస్‌ఘ‌ఢ్‌లో కూడా అదే విధంగా జరిగింది. ఇప్పుడు ఈ ప్రయోగాన్ని జాతీయస్థాయిలో లోక్ సభ ఎన్నికల్లో అమలుపరుచనున్నారు.

Related posts

5రోజుల సీబీఐ కస్టడీకి చిదంబరం

Satyam NEWS

జామి సురేశ్ కిడ్నాప్ రహస్యం ఛేదించిన పోలీసులు

Satyam NEWS

వాలంటీర్లు సరే… వీళ్లు చేస్తున్నది ఏమిటి?

Satyam NEWS

Leave a Comment