పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కనుమరుగు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ అన్నారు. గ్రామాల అభివృద్ధికై పూరించిన “సర్పంచుల సమర శంఖారావం” రెండో దశ ఉద్యమంలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తూ ఈరోజు విజయనగరం జిల్లా, విజయనగరం టౌన్ లోని హోటల్ ఆనంద్ గ్రాండ్ లో సర్పంచ్ ల,గ్రామీణ ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య,మొండి వైఖరిని ఖండిస్తూ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 14,15 వ ఆర్థిక సంఘాల ద్వారా రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీలకు పంపించిన 8629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకొని ఈరోజు గ్రామాల్లోని సర్పంచ్లను నిధులు, విధులు, అధికారాలు లేకుండా ఉత్సవ విగ్రహాలులాగా మార్చి వేసిందని అన్నారు.
దానితో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక, తమను నమ్మి ఓటు వేసి గెలిపించిన గ్రామీణ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తమ సర్పంచులు ఎంతగానో మనోవేదను అనుభవిస్తున్నారని తెలిపారు. తమ సర్పంచుల బాధలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని ఉద్యమాలు, పోరాటాలు చేసినాగాని దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి సర్పంచుల మరియు గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పవర్ ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ సర్పంచుల హక్కుల కోసం రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ఐక్యమై ఉద్యమాలు ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచ్ల సంఘం నాయకులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు వై. వినోదరాజు, రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి గేదెల రాజారావు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నేపు రామకృష్ణ నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ్ యాదవ్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్, విజయనగరం జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షులు కర్రోతి సత్యన్నారాయణ, విశాఖ జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు చింతకాయల ముత్యాలు, ex జడ్పీటీసీ ఈశ్వర్ రావు, ఎంపీటీసీ చందకా చిన్నమునాయుడు తదితరులు పాల్గొన్నారు.