భారత్‌తో అమెరికా వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తెలిపారు. వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ఆయన ప్రచారం ప్రారంభించారు. వివేక్ రామస్వామి ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కోసం అయోవా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
అయోవాలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ అమెరికా, భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉంటే చైనాపై అమెరికా ఆధారపడటాన్ని నివారించవచ్చునని ఆయన అన్నారు. అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా చైనాపై ఆధారపడి ఉంది. అయితే భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా, చైనాపై ఆధారపడకుండా అమెరికా విముక్తి పొందవచ్చునని రామస్వామి తెలిపారు.
అండమాన్ మరియు నికోబార్‌లో భారత్ కు అమెరికా సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ద్వారా చైనాను మలక్కా జలసంధిలో అడ్డుకోవచ్చు అని అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుండి చమురు కొనుగోలు చేసే చైనా, దాని నౌకలు మలక్కా జలసంధి గుండా మాత్రమే వెళతాయి. ఈ రంగాల్లో భారత్‌తో సహకారాన్ని పెంచుకోవడం అమెరికాకు మేలు చేస్తుందని రామస్వామి అన్నారు.
రామస్వామి పిఎం మోడీని ప్రశంసించారు. ‘ఆయన (పిఎం మోడీ) భారతదేశానికి మంచి నాయకుడని నేను భావిస్తున్నాను. ఆయనతోనే ఇండో-యుఎస్ సంబంధాలను బలోపేతం చేయాలనుకుంటున్నాను’ అని అన్నారు. అమెరికా తదుపరి ప్రెసిడెంట్ రేసులో ఉన్న అతి పిన్న వయస్కుడు వివేక్ రామస్వామి. రామస్వామి (38) బిలియనీర్ వ్యాపారవేత్త.
బయోటెక్ కంపెనీ రోవాంట్ సైన్సెస్ వ్యవస్థాపకుడు. ఆగస్ట్ 23న విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో జరిగిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత రామస్వామి ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. చర్చ సమయంలో ఆయన ఇతర రిపబ్లికన్ అభ్యర్థులపై విజయం సాధించారు. చర్చ తర్వాత, ఎన్నికల ప్రచారానికి రామస్వామికి వచ్చిన విరాళాల సంఖ్య విపరీతంగా పెరిగింది.
ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ తర్వాత రెండో అభ్యర్థిగా రామస్వామి నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ప్రమేయానికి వివేక్ రామస్వామి కూడా వ్యతిరేకం. అమెరికా విదేశాంగ విధానానికి అతి పెద్ద సవాల్ ఏంటంటే.. మన భూమిని మనం కాపాడుకోలేమని, మనం చేస్తున్న యుద్ధాల వల్ల అమెరికా ప్రయోజనాలకు మేలు జరగదని అన్నారు. నిరంతరం ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటూ అమెరికా తప్పు చేస్తోందని నేను భావిస్తున్నానని రామస్వామి అన్నారు.
ఇది అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడదు. అమెరికా చైనాపై దృష్టి పెట్టాలి ప్రస్తుతం అమెరికాకు ఇది అతిపెద్ద ముప్పు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలవడం, అమెరికాకు కూడా ఎక్కువ దిగుమతులు చైనా నుంచే కావడం గమనార్హం. గతేడాది అమెరికా, చైనాల మధ్య అత్యధికంగా 690 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదైంది.
అమెరికా గత సంవత్సరం చైనా నుండి 536 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా దిగుమతి చేసింది. ఇది మొత్తం దిగుమతుల్లో 17 శాతం. అమెరికా కూడా చైనాకు 154 బిలియన్ డాలర్లు ఎగుమతి చేసింది.