పెరల్ గార్డెన్ లో పెళ్లి జరుగుతోంది. అదే సమయంలో అక్కడే ఓ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ముగ్గురు ఆ తర్వాత ఒకరు చనిపోయి పెళ్లివేడుక విషాదాంతం అయింది. ఈ దుర్ఘటన హైదరాబాద్ లోని గోల్నాక ప్రాంతంలో చోటు చేసుకుంది. గోల్నాక ప్రాంతంలోని పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కూలడంతో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అంబర్ పేట పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండు ఆటోలు శిథిలాల కింద ధ్వంసమయ్యాయి. 10 టూ వీలర్ లు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు, జీహెచ్ఎంసీ టీమ్, డిజాస్టర్ టీమ్ ప్రమాద స్థలికి చేరుకున్నాయి. గాయపడిన వారిని మలక్ పేటలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈస్ట్ జోన్ జాయింట్ పోలీస్ కమిషనర్ రమేష్ తోపాటు మరికొంతమంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
previous post