27.7 C
Hyderabad
May 4, 2024 10: 01 AM
Slider విజయనగరం

ఉత్త‌రాంధ్రను అభివృద్ది చేసింది మేమే…!

#botsa

ఉత్త‌రాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ది చేసింది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు నాయుడు త‌న ఐదేళ్ల ప‌దవీకాలంలో ఉత్త‌రాంధ్ర కోసం ఏమి చేశారో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. స్థానిక ఐస్ ఫ్యాక్ట‌రీ జంక్ష‌న్‌లో మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ కొత్త‌గా ఏర్పాటు చేసి దండి స‌త్యాగ్ర‌హ విగ్ర‌హాల‌ను మంత్రి బొత్స  ఆవిష్క‌రించారు. అభివృద్దితోపాటు, ప్ర‌జ‌ల్లో స్వాతంత్య్ర‌ స్ఫూర్తిని నింపేందుకు ఈ విగ్ర‌హాలు దోహ‌దం చేస్తాయ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో డిప్యుటీ స్పీక‌ర్ కోల‌గట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యుటీ ఛైర్‌ప‌ర్స‌న్లు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ఇస‌ర‌పు రేవ‌తీదేవి, క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల నాయుడు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అనంత‌రం మంత్రి బొత్స‌ మీడియాతో మాట్లాడుతూ, త‌మ ప్ర‌భుత్వం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణాన్ని ద‌శ‌ల‌వారీగా అభివృద్ది చేయ‌డానికి, సుంద‌రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. దీనిలో భాగంగా నేటినుంచి వ‌రుస‌గా వారం రోజుల‌పాటు వివిధ అభివృద్ది కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వం జ‌రుగుతుంద‌న్నారు. విశాఖ‌లో జ‌రిగిన ఉత్త‌రాంధ్ర స‌ద‌స్సులో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి బొత్స తీవ్రంగా ఖండించారు.

ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌లు హ‌ర్షించ‌బోర‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు త‌న హాయంలో ఉత్త‌రాంధ్ర అభివృద్ది కోసం చేసిన ఒక్క కార్య‌క్ర‌మాన్నైనా చెప్ప‌గ‌ల‌రా ? అని ప్ర‌శ్నించారు. రుషికొండ‌పై ప్ర‌భుత్వ క‌ట్ట‌డాల నిర్మాణ‌మే జ‌రుగుతోంద‌ని, ప్ర‌యివేటు భ‌వ‌నాలు కావ‌ని ఆయ‌న అన్నారు. విశాఖ‌ప‌ట్నంలో ఐటి కంపెనీలు గానీ, ఫార్మాసిటీ గానీ వైఎస్ఆర్ హ‌యాంలోనే వ‌చ్చాయ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు త‌న ఇష్టానుసారం అవాకులూ, చ‌వాకులూ మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న అనుకూల మీడియాతో త‌ప్పుడు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. బాబు త‌న హాయంలో పేద‌ల ఆక‌లితో రాజ‌కీయం చేశార‌ని, జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో దోచుకుతిన్నార‌ని, రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని ఆరోపించారు.

పేద ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి నేరుగా న‌గ‌దు బ‌దిలీ చేయ‌డాన్ని చంద్ర‌బాబునాయుడు భ‌రించేలేక‌పోతున్నార‌ని బొత్స అన్నారు. ప్ర‌జ‌ల గొనుగోలు శ‌క్తి పెరిగిన‌ప్పుడే, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ది చెందుతుంద‌ని చెప్పారు. చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని, ఓట్లు అడిగే అర్హ‌త అత‌నికి లేద‌ని మంత్రి అన్నారు. త‌మ ప్ర‌భుత్వం విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, సంక్షేమానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. రాజకీయాల‌కు అతీతంగా అర్హులంద‌రికీ సంక్షేమ ఫ‌లాల‌ను అందించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు.

సుమారు 73 శాతం మంది వ్య‌వ‌సాయ రంగంపై ఆధార‌ప‌డి ఉన్నార‌ని, అందుకోస‌మే గిట్టుబాటు ధ‌ర‌ను ముందుగానే ప్ర‌క‌టించి రైతుల‌కు న్యాయం చేస్తున్నామ‌ని అన్నారు. సామాన్యుడి చెంత‌కే వైద్యం అందించేందుకు ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానానికి శ్రీ‌కారం చుట్టామ‌ని పేర్కొన్నారు. విద్యారంగంలో మ‌న రాష్ట్రం దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చామ‌ని, వారిని మెప్పించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని మంత్రి బొత్స దీమా వ్య‌క్తం చేశారు.

అంతకు ముందు డిప్యుటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, ప్ర‌జ‌ల్లో నాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపేందుకు దండి స‌త్యాగ్ర‌హ విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. స్వాతంత్య్ర స‌మ‌రానికి స్ఫూర్తిగా నిలిచిన ఉప్పు స‌త్యాగ్రం 1930 మార్చి 12 న స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం వ‌ద్ద ప్రారంభ‌మ‌య్యింద‌ని, నాటి బ్ర‌టీష్ ప్ర‌భుత్వం ఉప్పుపై వేసిన ప‌న్నును దిక్క‌రిస్తూ ఏప్రెల్ 6న‌ దండి వ‌ద్ద ఉప్పును త‌యారు చేశార‌ని చెప్పారు.  వేలమంది సత్యాగ్రహులతో గాంధీ మ‌హాత్ముడు కలిసి చేసిన ఈ శాస‌నోల్లంఘ‌న, స్వాతంత్య్ర ఉద్య‌మానికి స్పూర్తిగా నిలిచింద‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ ఇందుకూరి ర‌ఘురాజు, మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యుటీ ఛైర్‌ప‌ర్స‌న్లు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ఇస‌ర‌పు రేవ‌తీదేవి, పార్టీనాయ‌కులు ఆశ‌పు వేణు లు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా బాసరలో వసంత పంచమి వేడుక

Satyam NEWS

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విజయనగరం ఓఎస్డీ పర్యటన..!

Satyam NEWS

ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Sub Editor

Leave a Comment