27.7 C
Hyderabad
May 4, 2024 10: 40 AM
Slider ప్రత్యేకం

New Challenge: మంకీపాక్స్ అంటే?

#monkeypox

కరోనా వైరస్ వ్యాప్తి సాగుతూనే ఉంది. అందులో విభిన్న రకాలు ( వేరియంట్స్) పుట్టుకొస్తూ చికాకు పెడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ధన,ప్రాణ రూపాల్లో చాలా కోల్పోయాం. లోకం ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు. ఇప్పుడేమో మంకీపాక్స్ అంటూ జనాల్ని భయపెట్టే వార్తలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకూ సుమారు 50కి పైగా దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతోందని, వేలకొద్దీ కేసులు నమోదయ్యాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ఈ వైరస్ కేరళ ద్వారా భారతదేశంలో కూడా అడుగుపెట్టిందనే అనుమానాలు రేగుతున్నాయి. కరోనా కేసులు కూడా మొట్టమొదటగా కేరళనే తాకాయి. కేరళలో తాజాగా ఒక వ్యక్తికి మంకీపాక్స్ తరహా లక్షణాలు కన్పించాయి. ఈ వ్యక్తి ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చాడు.

అతని నుంచి సేకరించిన నమూనాలను పుణేలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్ కు పంపించారు.ఆ ఫలితాలు వస్తే కానీ మంకీపాక్స్ విషయంపై స్పష్టత రాదు. ఈ వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు మంకీపాక్స్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినట్లు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఏ ఏ దేశాలకు వెళ్లి వచ్చారు మొదలైన విషయాలను గోప్యంగా ఉంచారు.

యూరప్,ఆఫ్రికాలో వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు,అందులోనూ యూరప్ దేశాలు 80శాతం వాటాతో సింహభాగంలో ఉన్నట్లు సమాచారం. మంకీపాక్స్ తరహా కేసు మన దేశంలో నమోదవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక చిన్నారి ఇంచుమించుగా ఇటువంటి లక్షణాలతో బాధపడిందని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే, పరీక్షల అనంతరం అది ఆ వైరస్ కాదని తేలింది.

ఇప్పుడు ఈ కేరళ కేసు సంగతి తేలాల్సివుంది. ఈ వైరస్ అధికంగా వ్యాప్తి చెందడానికి ప్రధానమైన కారణం శృంగారమని డబ్ల్యూ హెచ్ ఓ అంటోంది. ఇతరులతో శారీరకంగా కలవడం వల్ల వస్తోందని చెబుతున్న నేపథ్యంలో పలుచోట్ల పరిశోధనలు మొదలయ్యాయి. వాటికి సంబంధించిన సమగ్రమైన నివేదికలు ఇంకా బయటకు వెల్లడవ్వాల్సివుంది. కరోనా వైరస్ వలె మంకీపాక్స్ సోకినవారిని కూడా ఐసోలేషన్ లో ఉంచాలని వైద్యులు చెబుతున్నారు.

దీని నివారణకు సంబంధించి యాంటీ వైరల్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఉత్పత్తి,సరఫరా చాలా పరిమితంగా ఉన్నాయి. కరోనాకు మాదిరి ఈ వ్యాక్సిన్లు సామూహికంగా ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేశారు. మంకీపాక్స్ వల్ల కొన్ని మరణాలు కూడా సంభవించాయి. ఇంతకూ ఈ వైరస్ ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు!

దీనికి 70ఏళ్ళ పైన చరిత్ర ఉంది.1950ల్లో మొదట్లో కోతుల్లో గుర్తించారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చివుంటుంది. 1970 ప్రాంతంలో కాంగో రిపబ్లిక్ లో తొమ్మిది నెలల బాలుడికి అది సోకింది. మనుషుల్లోకి వ్యాప్తిచెందిన మొట్టమొదటి మంకీపాక్స్ కేసుగా అది నమోదైంది. అదిమొదలు సుమారు 10 ఆఫ్రికా దేశాల్లోకి విస్తరించింది. పశ్చిమ దేశాల్లోనూ అప్పుడప్పుడూ స్వల్పంగా కేసులు నమోదవుతూ వచ్చాయి.

కేవలం కోతుల నుంచే కాక ఎలుకలు, చుంచులు, ఉడతల నుంచి కూడా వ్యాపిస్తున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్లు లేదా వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా ఉండడం,శారీరకంగా కలవడం వల్ల ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లు ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న పరిశోధనల ద్వారా అర్ధం చేసుకోవాలి.

జ్వరం,తలనొప్పి,వాపు, నడుంనొప్పి,కండరాల నొప్పి, అలసట,ముఖం,కాళ్ళు,చేతులపై దద్దుర్లు,బొబ్బలు రావడం వ్యాధి లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలన్నీ రెండు నుంచి మూడు వారాల్లో బయటపడుతున్నాయి. ఎక్కువమంది కొద్దిరోజుల్లోనే కోలుకుంటున్నారు.

నమోదైన మరణాలు 10 శాతానికి లోపే ఉన్నాయి. ఇది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మంకీపాక్స్ పేరుపై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీని పేరు మారే అవకాశం ఉంది. పేరులో ఏముంది? వ్యాప్తి పెరగకుండా చూడడం, వచ్చినవారు జాగ్రత్తగా ఉండడం, దీని శాశ్వత అంతానికి మార్గాలు కనిపెట్టడం ముఖ్యం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ప్రతీ ఒక్కరిలో భయం…అందుకే బయటకొస్తే… మాస్క్ తొనే…!

Satyam NEWS

జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు

Bhavani

22న లోకేష్ వరినాటు బొమ్మ ఆవిష్కరణ

Bhavani

Leave a Comment