40.2 C
Hyderabad
May 5, 2024 15: 19 PM
Slider సంపాదకీయం

మేం సేకరించే సమాచారం ఎక్కడికి వెళుతున్నది?

#Pawan Kalyan

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వైకాపా నేతలకు ఇప్పుడు వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట వాలంటీర్ల వ్యవస్థ లోని లోపాలను ఎత్తి చూపారు. ప్రతి 50 ఇళ్లకు వైకాపా ప్రభుత్వం ఒక వాలంటీర్ ను నియమించింది. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వారి వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకుంటున్నారు.

ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఎవరు ఏమి చేస్తుంటారు? అనే వివరాలు సేకరిస్తుంటారు. ఇంట్లో ఉండేవారు ఎవరు బయట ఉద్యోగానికి వెళ్లేది ఎవరు అనే విషయాలు కూడా వారు అడిగి తెలుసుకుంటున్నారు.హైదరాబాద్ లో ఉద్యోగం చేసే కొడుకు లేదా కూతురు ఉంటే వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు.

ఒక కుటుంబం ఆదాయవ్యయాల నుంచి అన్ని విషయాలనూ వాలంటీర్లు అడిగి తెలుసుకుంటున్నారు. సామాజిక పెన్షన్లు ఇచ్చే పేరుతో ఈ అన్ని వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు ఇవ్వకపోతే రేషన్ ఆగిపోతుందేమో, పెన్షన్ ఆగిపోతుందేమో, ఇల్లు ఇవ్వరేమో అనే భయంతో అన్ని వివరాలను వాలంటీర్లకు ఇచ్చేస్తున్నారు.

ఇలా ఎవరైనా ఒక వ్యక్తి సమాచారం సేకరించడం మన వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించడమే అవుతుంది. జనాభా లెక్కలు సేకరించే టీచర్లు, ప్రభుత్వ పథకాలు అందించే ప్రభుత్వ ఉద్యోగులకు సమాచారం ఇవ్వడం మన బాధ్యత.

అయితే అటు ప్రభుత్వ ఉద్యోగి కాకుండా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించేవాడు వాలంటీర్. మరి ఇలాంటి అటూ ఇటూ కాని ఒక త్రిశంకు వ్యవస్థను పెట్టడమే వైకాపా ప్రభుత్వం ప్రజలపై చేసిన కుట్ర. ఈ త్రిశంకు వ్యవస్థ ద్వారా పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి వేసిన ఎత్తుగడ.

ఇలా సమాచారం సేకరించే అధికార అనధికారులందరిని తమ పార్టీకి చెందిన వారిని పెట్టుకోవడంతోనే ఈ కుట్ర ప్రారంభం అయింది. ఈ వాలంటీర్లు సేకరించే సమాచారాన్ని హైదరాబాద్ లోని ఒకరికి పంపుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ డేటా మొత్తం దగ్గర ఉంచుకున్న ఆ వ్యక్తి తమకు ఎవరు ఓటు వేస్తారు? ఎవరు వెయ్యరు అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. దీనికి కూడా వాలంటీర్లు సహకరిస్తున్నారు.

తమకు ఓటు వేయని కుటుంబాలను గుర్తించి వారిని వాలంటీర్లు ఒకటికి రెండు సార్లు కలుస్తున్నారు. అయినా వారు మారకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారు. ఇంటి ముందు స్కూటర్ ఉందనో, కరెంటు బిల్లు పెరిగిందనో సాకు చెబుతున్నారు. కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడనే కారణం కూడా చెప్పి వృద్ధులకు పెన్షన్ కట్ చేస్తున్నారు.

ఇలా కట్ చేస్తున్న వారంతా వైకాపాకు ఓటు వేయని వారుగా వాలంటీర్లు నిర్ధారించిన వారే.ఇలా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని నిరూపించాలని వైకాపా సవాల్ విసురుతున్నది. మంత్రులతో సహా పలువురు వైకాపా నేతలు ముందుకు వచ్చి దీన్ని నిరూపించాలని కోరుతున్నారు.కొత్తగా నిరూపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే అక్రమాలకు పాల్పడుతున్న వాలంటీర్ల ఉదాహరణలు కో కొల్లలుగా వస్తున్నాయి.

ఇదే విషయాన్ని మరింత లోతుగా పరిశీలించిన పవన్ కల్యాణ్… ఈ వాలంటీర్లు వంటరి మహిళల వివరాలు, ఇంట్లో ఉన్న యువతుల వివరాలు కూడా సేకరిస్తున్నారని, వాటిని ఎక్కడకు పంపుతున్నారో స్పష్టం చేయాలని కోరారు. అందులో తప్పేముందో అర్ధం కావడం లేదు.

ఇలా సేకరించిన సమాచారం కొంత పైకి పంపించి మరి కొంత తమకు అనుకూలంగా వాడుకోరని నమ్మకం ఏమిటి? తమకు అనుకూలంగా …. అంటే పెన్షన్ డబ్బులు కొట్టేయడం, తమకు కావాల్సిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించడం లాంటి పనులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి పని ప్రభుత్వ ఉద్యోగి చేస్తే అతనిపై ఫిర్యాదు చేయవచ్చు. అందుకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉంటారు. మరి వాలంటీర్ల వ్యవస్థ పై ఎవరికి ఫిర్యాదు చేయాలి? వాలంటీర్ల వ్యవస్థకు బాస్ ఎవరు అని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. దీనికి వైకాపా నేతలు పిచ్చిపిచ్చిగా ప్రత్యారోపణలు చేస్తున్నారు తప్ప సమస్య తీవ్రతను గుర్తించడం లేదు. వాలంటీర్ల వ్యవస్థను పవన్ కల్యాణ్ తిడుతున్నా ఎవరూ స్పందించడం లేదని వైకాపా నేతలు వాలంటీర్లను రెచ్చగొడుతున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి అవంతి వీడియో బయటకు వచ్చింది కూడా.

విచిత్రం ఏమిటంటే వైకాపా నాయకులు ఎంత రెచ్చగొట్టినా కూడా మూడు లక్షల మంది వాలంటీర్లలో కనీసం పది వేల మంది కూడా వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేయలేదు. అంటే వాలంటీర్లకు కూడా తాము చేస్తున్న తప్పు తెలుసు అని అనుకోవాల్సి వస్తున్నది. తాము సేకరిస్తున్న సమాచారం పార్టీలోని కొందరు వ్యక్తులకు వెళుతుందనే విషయం కూడా వారికి తెలిసిందన్నమాట. తాము ఇచ్చిన సమాచారంతో వైకాపా కు చెందిన కొందరు సంఘ విద్రోహ శక్తులు తమకు ఇష్టమైన పనులు చేస్తున్నారని కూడా వాలంటీర్లకే అనుమానం వచ్చింది.

అందుకే వాలంటీర్లు ఎక్కడా స్పందించడం లేదు. వాలంటీర్లు తమ జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యోగం చేస్తున్నారు. వలం 5 వేల రూపాయల జీతంతో వారు గత నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఉద్యోగం ఉంటుందన్న గ్యారెంటీ లేదు. దాంతో వాలంటీర్లు కూడా ఈ ఉద్యోగం పట్ల నిరాసక్తతతో ఉన్నారు.

వాలంటీర్లు ప్రజా సేవ వరకు మాత్రమే పరిమితం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. వాలంటీర్లు వైకాపా పార్టీ పని చేస్తే తాము సహించేది లేదని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే వాలంటీర్లను అందరిని ప్రజలు దొంగలు గా చూస్తున్నారు. వారికి సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎవరైనా అమాయకంగా సమాచారం ఇచ్చే పరిస్థితి ఉన్నా దాన్ని వాలంటీర్లు తమ పైన ఉన్న పార్టీ పెద్దలకు ఇవ్వడం లేదు.

Related posts

బద్వేల్ పట్టణంలో విద్యార్థిని అదృశ్యం

Satyam NEWS

జోబైడెన్ ప్రతిపాదనకు నో చెప్పిన సెనేటర్

Satyam NEWS

భూములు లేని  కుటుంబాలకు భూములు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment