42.2 C
Hyderabad
May 3, 2024 15: 59 PM
Slider సంపాదకీయం

తెలుగు సినిమా ‘‘జీరో’’లు స్పందించరేమిటి?

#apsaracinema

తెలుగు చలన చిత్ర పరిశ్రమపై కోలుకోలేని దెబ్బలు పడుతున్నా తెలుగు సినిమా ‘జీరో’లు మాత్రం నోరు మెదపడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు దాదాపు 30 సినిమా ధియేటర్లపై అధికారులు దాడులు జరిపి వాటిని సీజ్ చేశారు. అధికారుల దాడులకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ధియేటర్లు బంద్ పాటిస్తున్నారు.

అంతకు ముందు సినిమా షోలపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. సినిమా ధియేటర్లలో టిక్కెట్ రేట్లపై ఏకంగా ప్రభుత్వమే ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకున్నది. ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లను విక్రయించాలనే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్నది.

అది తాత్కాలికంగా అమలు జరగకపోయినా ప్రభుత్వం పరోక్షంగా వాటిని అమలు చేస్తూనే ఉన్నది. తాజాగా సినిమా ధియేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం కక్షకట్టినట్లు ప్రవర్తిస్తున్నా తెలుగు సినిమా ‘జీరో’లు మాత్రం నోరు మెదపడం లేదు. టిక్కెట్ ధరలు నిర్మాతలకు సంబంధించిన అంశమని ‘జీరో’లు భావించి ఒకరిద్దరు మినహా ఎవరూ జోక్యం చేసుకోలేదు.

ఇప్పుడు అధికారులు సినిమా ధియేటర్లపై ఏకపక్షంగా దాడులు చేసి మూసి వేయిస్తున్నా కూడా ‘జీరో’లు ఏ మాత్రం స్పందించడం లేదు. సినిమా ధియేటర్లు లేకపోతే ఈ హీరోలకు ఇంత ఆదరణ ఉండదు. అలాంటి సినిమా ధియేటర్ల పై దాడి జరుగుతున్నా ఏ హీరో కూడా ఇప్పటి వరకూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

నిర్మాతలు, ఎగ్జిబిటర్లు లేకపోతే పెద్ద సినిమాలు ఆగిపోతాయి. పెద్ద సినిమాలు ఆగిపోతే సినీ పరిశ్రమ మొత్తం మూతబడిపోతుంది. ఇది తెలిసి కూడా హీరోలు మౌనంగా ఉంటున్నారో, మనకెందుకులే అనుకుంటున్నారో తెలియదు. లేదా అధికార పార్టీకి భయపడి హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారో అర్ధం కావడం లేదు.

ఎగ్జిబిటర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తే నష్టపోయేది పెద్ద హీరోలే. సినిమా ఓపెనింగ్స్ పై ఆధారపడి మాత్రమే ఈ పెద్ద హీరోలకు అత్యంత భారీ పారితోషికాలు ఇస్తుంటారు. ఓపెనింగ్స్ లేని హీరోలకు అంతగా రెమ్యూనరేషన్ ఇవ్వరు. అంత ఓపెనింగ్స్ రావాలంటే హీరోలకు ధియేటర్లు తప్పని సరి.

అలాంటి అత్యంత ప్రాధాన్యతకలిగిన ఎగ్జిబిటర్లకు కష్టాలు వస్తే తెలుగు సినిమా హీరోలు కళ్లప్పగించి చూస్తున్నారు తప్ప ఏం మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్న వారిని చూసి ఇప్పుడు భయపడితే వారికే భవిష్యత్తు శూన్యంగా మారుతుందనడంలో సందేహం లేదు.

సినిమా ధియేటర్లు మినీ ఫ్యాక్టరీల్లాంటివి. ప్రత్యక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించే ఫాక్టరీలు అవి. స్వీపర్ల నుంచి బుకింగ్ క్లర్కుల వరకూ పదుల సంఖ్యలో చిన్న ధియేటర్లలో ఉపాధి పాందుతుంటారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేవి ఈ సినిమా ధియేటర్లే.

మినీ ఫ్యాక్టరీలపై ఇంత కక్ష ఎందుకో….?

వినోదపు పన్ను వసూలు కావడానికి మూలాధారం సినిమా ధియేటర్లే. అలాంటి ‘‘మినీ ఫ్యాక్టరీ’’ లను ప్రభుత్వం కక్షగట్టి మూసేయిస్తున్నది. ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న ధియేటర్లు లైసెన్సు రెన్యూ చేసుకోకపోతే తప్పు సంబంధిత అధికారిపై కూడా ఉంటుంది.

అలా రెన్యూ చేయించుకోని ధియేటర్లకు నోటీసులు జారీ చేసి గడువు ఇచ్చి సీజ్ చేయాలి తప్పించి ఏకంగా దాడులు చేసి మూసివేయిస్తే ఎవరికి నష్టం……? ప్రత్యక్షంగా ధియేటర్ యజమానికి నష్టం, అందులో పని చేసే సిబ్బందికి నష్టం. పరోక్షంగా పెద్ద హీరోలకు నష్టం….. అదే విధంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోతుంది.

ఇవన్నీ ఆలోచించకుండా కేవలం ఒక్క హీరోను దృష్టిలో ఉంచుకునో, ఒక్క కులాన్ని దృష్టిలో ఉంచుకునో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిర్ణయాలు తీసుకుంటూ పోతే…. మిగిలేది ఏమీ ఉండదు. తెలుగు సినిమా హీరోలు ముందు నుంచే ప్రభుత్వ పెద్దలను చూసి భయపడుతూనే ఉన్నారు.

ప్రభుత్వ పెద్దలతో సఖ్యత కోసం చిరంజీవి లాంటి మెగా హీరోలే తహతహలాడారు. అక్కినేని నాగార్జున లాంటి వాళ్లయితే బహిరంగ వేదికలపై నుంచి ప్రభుత్వ పెద్దలకు దణ్ణం పెట్టిమరీ వేడుకున్నారు. ఆన్ లైన్ టిక్కెట్ల విధానం చిరంజీవి, నాగార్జున లాంటి వారే కోరారని ఒక నాటి సినీ నటి, ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే రోజా డైరక్టుగా చెప్పారు.

దాన్ని ఎవరూ ఖండించలేదు. పబ్లిక్ గా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు తెరపైకి తెచ్చి పోసాని కృష్ణ మురళి లాంటి అధికార పార్టీ తొత్తులతో తిట్టించారు.

మొత్తం సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి తెలుగు సినీ హీరోలు ఇప్పటికైనా తెగించి ముందుకు రాకపోతే వారు ‘‘జీరోలు’’ కావడమే కాకుండా సినీ పరిశ్రమ మొత్తాన్నీ జీరో చేసిన వారవుతారు. ఇప్పటి వరకూ సంపాదించిన దానితో తృప్తి పెడదామనుకుంటే అది కూడా ఉండకపోవచ్చు.

ఊరుదాకా వచ్చిన సమస్య మన ఇంటిదాకా రాకపోదు. సినిమా ధియేటర్ గేట్ కీపర్ ఉద్యోగం నేడు పోతే… పెద్ద హీరో ఉద్యోగం రేపు పోతుంది.  

Related posts

మాదక ద్రవ్యలను అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలి

Bhavani

అక్రమ కేసులతో చంద్రబాబును ఆపలేరు

Bhavani

సంక్షేమంతో బాటు ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులు

Satyam NEWS

Leave a Comment