29.7 C
Hyderabad
May 4, 2024 06: 17 AM
Slider వరంగల్

ప్రపంచ ఓజోన్ డే కవితల పోటీకి విశేష స్పందన

#Ozone Day

“ప్రపంచ ఓజోన్ డే” సందర్భంగా పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి తెలంగాణ అటవీ శాఖ – ములుగు రేంజ్, ములుగు జిల్లా, లీడ్ ఫౌండేషన్, తెలంగాణ సాహితిలు సంయుక్తంగా నిర్వహించిన కవితల పోటీలో వివిధ రాష్ట్రాల నుండి తెలుగు కవులు విశేషంగా స్పందించారు.

సుమారు 200 కవితల్లో అత్యుత్తమమైన కవితలు ఎంపిక చేసి బహుమతులు ప్రకటించామని ములుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం. రామ్ మోహన్, లీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాసుల రవికుమార్ లు తెలిపారు.

“పుడమి గర్భం చీల్చి వనరుల పిండాల్ని ఆరగించావు/ ప్లాస్టిక్ దేహాన్ని కౌగిలించుకొని కాంక్రీటరణ్యపు కంచెకు ఊపిరి తీగలు వేలాడేశావు/ కాలుష్యం కత్తి మొన గుండెల్లో దించి ఆయువుకు కోతపెట్టుకున్నావు”అంటూ తన ఆవేదనను “ఆకుపచ్చని ప్రమాణం” కవిత రూపంలో వ్యక్తం చేసిన డి. నాగజ్యోతి శేఖర్, కాకినాడ మొదటి బహుమతి పొందారు.

 “ఈ ప్రకృతి దీపం అసుర చేష్టల తుఫాను గాలులకి ఆరిపోకుండా/ నా రెండు చేతులూ అడ్డుపెట్టి /నా హృదయం మెదడూ రెండూ పణంగా పెట్టి / ఈ ప్రపంచాన్ని బతికిస్తానని గట్టి సంకల్పం చేయాలి”అంటూ “సంజీవని” కవిత ద్వారా మన కర్తవ్య నిర్వహణ తెలియజేసిన డాక్టర్ మోపిదేవి విజయగోపాల్, వైజాగ్ ద్వితీయ బహుమతి పొందారు.

“కొట్టేసిన కొమ్మలతో అంగవైకల్యమైన వృక్షాలు/గర్భ విచ్ఛిన్నం అయిన నేలతల్లి కన్నీళ్ళలోంచి  పండిన పంటంతా మునిగిపోతుంటే /తట్టుకోలేని దేశపు వెన్నెముక పూర్తిగా వంగిపోయి/ పొలానికి స్మృతి చిహ్నంగా దిష్టిబొమ్మ గా మిగిలిపోతుంది” అంటూ “వృక్ష వారధులవుదాం” అనే కవిత రాసిన శైలజామిత్ర, హైదరాబాద్ తృతీయ బహుమతి పొందారు.

విజేతలకు రూ. 2000/-,1500/-,1000/-నగదు బహుమతి అందించనున్నారు. ఫణి మాధవి కన్నోజు, ఉషారాణి, బండారి రాజ్ కుమార్, పువ్వాడ వెంకటేష్,  సుష్మ, గిరి ప్రసాద్ చెలుమల్ల, పి. ఆర్. ఎల్ .స్వామి,పల్లవి, లక్ష్ము నాయుడు, వేణుమాధవ్, దాకోజు కుసుమ కుమార్ లు ప్రత్యేక బహుమతులకు ఎంపికయినట్లు రామ్ మోహన్, రవి కుమార్ లు తెలిపారు.

ఈ పోటీకి న్యాయనిర్ణేతలుగా గుండెబోయిన శ్రీనివాస్, మోహన కృష్ణలు వ్యవహరించారు. అటవీశాఖ ములుగు రేంజ్, లీడ్ ఫౌండేషన్ సహకారంతో గత కొద్ది కాలంగా పర్యావరణ పరిరక్షణ పట్ల విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

 కరోనా సమయంలో ఈసారి వినూత్నంగా కవితల పోటీ నిర్వహించింది. ఇందులోని అత్యుత్తమమైన 50 కవితలతో కవితా సంపుటి తీసుకురానున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ మోహన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి రక్షకులై, రాబోయే తరానికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని కానుకగా అందివ్వాలని వారు కోరారు.

Related posts

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎడతెరిపిలేని దాడులు

Satyam NEWS

ధర్మారెడ్డి ని సస్పెండ్ చేయాలని జనసేన డిమాండ్

Satyam NEWS

రెడ్ హ్యాండెడ్: ఏసీబీకి దొరికిన అవినీతి డిప్యూటీ తాసిల్దార్

Satyam NEWS

Leave a Comment