యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి మార్చి 31వరకు అన్ని ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు యాదాద్రి క్షేత్రంలో భక్తులు జరిపించుకొనే మొక్కు పూజలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
గురువారం తులసీ కాటేజీలోని దేవస్థాన కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఆలయ ఆర్జిత సేవలైన మొక్కు కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హొమము, తల నీలాల సమర్పణ, సత్యనారాయణ వ్రత పూజలు, నిత్యాన్నదాన వితరణ నిలిపివేస్తున్నారు. అదే విధంగా ఆలయంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిలిపి వేయనున్నట్టు, ఆస్ధాన పరంగా స్వామివారికి నిత్యం కైంకర్యాలు జరపనున్నారు. అయితే యాదాద్రీశుడి దర్శనానికి విచ్చేసిన భక్తులకు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించనున్నట్టు ఆమె పేర్కొన్నారు.