ఎన్నికల కమిషనర్ ను బాత్ రూం లు కడిగే వ్యక్తి, బొచ్చుకుక్క, లోపర్, వెధవ అని సభ్యసమాజం తలదించుకునే విధంగా నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తిట్టారని ఇదేం సంస్కృతి అని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ప్రశ్నించారు.
రాజ్యాంగం లోని ఆర్టికల్ 243ZA, 243K ప్రకారం ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రతినిధిని ఇలా తిట్టడం దారుణమైన విషయమని ఆయన అన్నారు. ఒక ప్రజాప్రతినిధి గా ఉండి ఈ విధంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 సార్లు శాసనసభ్యుడిగా,ఒక్కసారి మంత్రిగా పనిచేసి, జిల్లాలో గౌరవ ప్రదమైన కుటుంబం నుండి వచ్చిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంత దిగజారి ఎన్నికల కమీషనర్ గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడి తన కుటుంబ ప్రతిష్ట దిగజార్చడం తో పాటు తనను ఎన్నుకున్న కోవూరు ప్రజలు తలదించుకునేలా చేసారని అన్నారు.
ఇన్ని సార్లు శాసనసభ్యులు అయిన వ్యక్తి ఎన్నికల కమిషన్ కు ఉన్న అధికారాలు ఏమిటో కూడా తెలియకపోవడం సిగ్గుచేటని, ఎన్నికలను వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేదని మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల కమిషన్ తీసుకొన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన తరువాత కూడా ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కరోనా లేదని దానిని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా ఎట్లా వేస్తారని మాట్లాడిన శాసనసభ్యుడు, సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన మరుక్షణమే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో పూజలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా లేకపోతే మీ ప్రభుత్వం ఈ చర్యలు ఎందుకు తీసుకున్నదో ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పాలన్నారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేషకుమార్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారిద్దరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రసన్నకుమార్ రెడ్డి పై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి, శివుని రమణారెడ్డి, కావలి ఓంకార్,బాల రవి,ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, ఉయ్యురు వేణు,గుంజి పద్మనాభం, మరీబోయిన వేంకటేశ్వర్లు, అగ్గి మురళి,పొలయ్య తదితరులు పాల్గొన్నారు.